తణుకు క్రైం :జిల్లాలో ప్రస్తుతం నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు ఉండగా అవి 9 అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నరసాపురంలో సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీస్(ఎస్డీపీవో)లు ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త ఆంధ్రప్రదేశ్‌కు డీఎస్పీ పోస్టులు ఎక్కువ కేటాయించారు. దీంతో ఆ అధికారులకు పని కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రస్తుతం 160 డీఎస్పీలు వివిధ పోస్టుల్లో ఉండగా, సుమారు 160 మంది కుర్చీల కోసం ఎదురు చూస్తున్నారు. వీరందరిని సర్దుబాటు చేసేందుకు, పోలీస్ శాఖ పనితీరు మెరుగుపరిచేందుకు ప్రతి జిల్లాలోను ప్రస్తుతం ఉన్న ఎస్డీపీవోలను రెట్టింపు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో ప్రస్తుతం ఉన్న నాలుగు పోలీస్ సబ్ డివిజన్‌లకు తోడు భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, పోలవరం సబ్ డివిజన్‌లను ఏర్పాటుచేసే అవకాశాలున్నట్టు విశ్వసనీయ సమాచారం. సబ్ డివిజన్‌లు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో సీఐ పోస్టులు కొన్ని రద్దు చేస్తారనే ఊహాగానాలకు తెరలేచింది. ఖాళీ అయిన సీఐల సేవలను ఎక్కడ వినియోగించుకుంటారనేది ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ నెలాఖరున చేపట్టనున్న బదిలీల ప్రక్రియ కీలకం కానుంది. ముందుగా డీఎస్పీలకు పోస్టింగ్‌లు ఇచ్చిన తరువాత సీఐలు ఆ కింది కేడర్ బదిలీలప్రక్రియ చేపడతారని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో టౌన్, రూరల్ స్టేషన్లకు హౌస్ ఆఫీసర్లుగా సీఐలను నియమించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ప్రజాప్రతినిధుల విముఖత
డీఎస్పీలాంటి ఉన్నతాధికారిని తమ ప్రాంతం లో నియమిస్తే తమకు కావలసిన పనులు జరగవనే ఉద్దేశంతో ఎస్డీపీవోల విస్తరణకు ప్రజా ప్రతినిధులు విముఖంగా ఉన్నట్టు తెలిసింది. కింది స్థాయి అధికారితో చేయించుకోగలిగే పనులు ఉన్నతాధికారుల నుంచి ఆశించలేమని, తమ ప్రాంతానికి ఎస్డీపీవో వద్దని ప్రజాప్రతినిధులు అధిష్టానానికి సంకేతాలు పంపిస్తున్నట్టు సమాచారం. తమ నాయకులకు తప్ప మరెవరికీ పోలీసు స్టేషన్లలో పనులు జరగకూడదనే ఉద్దేశంతో బదిలీల్లో పూర్తిగా తమ మార్కు చూపించాలని అధిష్టానం ఉంది. ఇదే అదనుగా తమ ప్రాంతానికి డీఎస్పీ వద్దు అని అధిష్టానానికి తెలిపేందుకు ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు సన్నద్ధమయ్యూరని సమాచారం.
అందుబాటులో ఉన్నతాధికారి ఉంటే..
ఉన్నతాధికారి అందుబాటులో ఉంటే కింది స్థాయి అధికారులు, సిబ్బంది పనితీరు మెరుగవుతుందని భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారి పర్యవేక్షణ కారణంగా క్రైం రేటు తగ్గడంతో పాటు దొంగతనాల కేసుల్లో రికవరీలు ఆశించిన స్థాయిలో ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రెట్టింపు కానున్న సబ్ డివిజన్లు!
Published Mon, Oct 6 2014 1:59 AM | Last Updated on Tue, Aug 21 2018 8:52 PM
Advertisement
Advertisement