విద్యార్థి పృథ్వీరాజు
తణుకు టౌన్: జేఈఈ మెయిన్ 2021 ఫలితాల్లో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఓ విద్యార్థికి వెబ్‌సైట్‌లో గంటకో ర్యాంకు కనిపిస్తోంది. దీంతో అతడు జేఈఈ మెయిన్‌లో తనకు వచ్చిన కచ్చితమైన ర్యాంక్ ఏమిటో తెలియక ఆందోళన చెందుతున్నాడు. వివరాల్లోకెళ్తే.. తణుకు రూరల్ మండలం దువ్వకు చెందిన ముదునూరి పృథ్వీరాజు జేఈఈ మెయిన్ (అప్లికేషన్ నంబర్ 210310578634)లో నాలుగు సెషన్స్‌కు హాజరయ్యాడు. తాజాగా ప్రకటించిన ఫలితాలను వెబ్‌సైట్ నుంచి ప్రింట్ తీసుకున్నాడు.
వెబ్‌సైట్‌లో చూసినప్పుడు వేర్వేరు సమయాల్లో వేర్వేరు పర్సంటైల్‌తో, వేర్వేరు ర్యాంకులు కనిపిస్తున్నాయి. దీంతో పృథ్వీరాజు, అతడి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పృథ్వీకి ఫిబ్రవరిలో 23.98, మార్చిలో 64.99, జూలైలో 91.26, ఆగస్టు సెషన్‌లో 93.361 పర్సంటైల్ వచ్చింది. నాలుగో సెషన్‌లో మరింత మెరుగైన పర్సంటైల్ వస్తుందని భావించాడు. దీంతో మరోసారి వెబ్‌సైట్‌లో పరిశీలించగా ఈసారి 87.36 పర్సంటైల్ వచ్చినట్టు చూపించింది. దీంతో ఆందోళనకు గురైన అతడు మరో గంట తర్వాత చూడగా 64.99 పర్సంటైల్ వచ్చినట్టు చూపింది.
నాలుగో సెషన్‌లో ఫిజిక్స్ పర్సంటైల్ చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గంటల వ్యవధిలోనే పర్సంటైల్ మారిపోవడంతో ర్యాంక్ కూడా వేలల్లో నుంచి లక్షల్లోకి మారిపోయిందని ఆందోళన చెందుతున్నాడు. కాగా, పర్సంటైల్ 93.361 ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో జనరల్‌లో 43,204 ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 16,025 ర్యాంకు వచ్చాయి. పర్సంటైల్ 87.36 ఉన్నప్పుడు జనరల్‌లో 45,289, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 14,323గా ర్యాంకులు ఉన్నాయి. పర్సంటైల్ 64.99గా ఉన్నప్పుడు జనరల్ విభాగంలో 3,39,234, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 43,805గా ర్యాంకులు ఉన్నాయి. ఈ విషయమై స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించగా.. తాడేపల్లిగూడెంలోని నిట్‌లో సంప్రదించాలని తెలిపినట్టు తల్లిదండ్రులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment