హోదా హోరు
హోదా హోరు
Published Sat, Jan 28 2017 10:53 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
తణుకు టౌన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ తణుకులోని ప్రభుత్వ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు నిరసన ర్యాలీ, మానవహారాలు నిర్వహించారు. శనివారం తణుకులోని శ్రీచిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన డిగ్రీ, పీజీ విద్యార్థులు, శ్రీనడింపల్లి వర్దనమ్మ తిరుపతిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తణుకు రాష్ట్రపతి రోడ్డులోని వెంకటేశ్వర థియేటర్, నరేంద్ర సెంటర్ మీదుగా కేశవస్వామి గుడి వరకూ సాగింది. ప్రత్యేక హోదా బ్యానర్‌లు, నినాదాలతో సుమారు 400 మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తణుకులోని నరేంద్ర సెంటర్‌లో విద్యార్థినీ, విద్యార్థులు మానవహారం నిర్వహించారు. వెంకటేశ్వర థియేటర్ వద్ద, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట విద్యార్థులు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
పార్టీలకతీతంగా విద్యార్థులు ఉద్యమించాలి
రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రత్యేక హోదా అవసరమని, దానిని సాధించేందుకు రాష్ట్రంలోని విద్యార్థులంతా పార్టీలకతీతంగా పోరాడాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే, తణుకు నియోజకవర్గ సమన్వయకర్త, డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని, మన రాష్ట్రంలో యువత ఉపాధికి అవసరమైన పరిశ్రమలు ఏర్పాటు చేస్తేనే సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమలు ఎక్కువగా స్థాపిస్తారని, తద్వారా యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. భవిష్యత్ తరాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచీ పోరాటం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటం అంతా యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసమేనని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థిలోకం ఏకం కావాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకూ విద్యార్థులు పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బోడపాటి వీర్రాజు, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, వానపల్లి శ్రీనగేష్, ఎంఎం రావు, కడియాల సూర్యనారాయణ, అంబటి రాఘవ, వి.సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement