పోలీసు స్టేషన్ ఎదుటే ఘర్షణ
పోలీసు స్టేషన్ ఎదుటే ఘర్షణ
Published Mon, Jul 10 2017 11:05 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
– 14 మందిపై కేసు నమోదు
ఓర్వకలు: ఓర్వకల్లు పోలీసు స్టేషన్ ఎదుట సోమవారం ఇరువర్గాల ఘర్షణ సినిమాను తలపించింది. వెల్దుర్తి మండలం కలుగోట్ల గ్రామానికి చెందిన బుడగ జంగాల ఈరన్న కుమార్తె శేషమ్మను నాలుగేళ్ల క్రితం గడివేములకు చెందిన మారెన్న కుమారుడు ఎల్లప్పతో వివాహం నిశ్చయమైంది. కట్నకానుకల కింద మారెన్నకు ముందుగానే ఈరన్న రూ.20 వేలు ఇచ్చాడు. కొద్దిరోజుల తర్వాత బతుకుదెరువు కోసం కాల్వ గ్రామానికి వచ్చిన మారెన్న ప్రస్తుతం అక్కడే స్థిరపడ్డారు. అయితే ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేక ఈరన్న తన కుమార్తెకు మరో సంబంధం చూసి పెళ్లి చేశారు. అయితే మారెన్న రూ. 20 వేలు తిరిగి ఇవ్వకపోవడంతో ఈరన్న ఓర్వకల్లు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు మారెన్నను స్టేషన్‌కు పిలిపించి ఇరువర్గాలతో చర్చించారు.
ఈ విషయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకొని ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో సాక్ష్యాత్తు పోలీసుల ఎదుటే రాళ్లు రువ్వుకున్నారు. ఆ సమయంలో వారిని అదుపుచేయడం పోలీసులకు కష్టమైంది. ఈ ఘర్షణలో ఈరన్న వర్గానికి చెందిన అంజి, శేషమ్మ, మారెమ్మ, మాశన్న తీవ్ర రక్తగాయాలకు గురయ్యారు. సుమారు గంట సేపు జరిగిన ఘర్షణ వాతావరణం సినిమా సన్నివేశాన్ని తలపించింది. ఈ లోగా ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకుని పోలీసుల సహయాంతో ఇరువర్గాలకు చెదరగొట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాలకు చెందిన 14 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Advertisement