పోలీస్‌స్టేషన్ ముందు ప్రతిఘటన నిర్వహిస్తున్న అంబిక
కోలారు: ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ భర్త అత్తమామలు వారి పాలిట విలన్లుగా మారి చిచ్చుపెట్టారు. తన భర్తను వెదికి ఇవ్వాలని కోరుతూ ఒక మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం సాయంత్రం నగరంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ ముందు ప్రతిఘటన నిర్వహించింది. తాలూకాలోని వక్కలేరి గ్రామానికి చెందిన అంబిక ఇలా నిరసన చేపట్టింది. తన మామ తన భర్తకు వేరే పెళ్లి చేసి తనకు దూరంగా ఉంచారని, తనకు, పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదని బాధితురాలు విలపించింది. న్యాయం కోసం గత 8 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని ఆరోపించింది. వక్కలేరి గ్రామానికి చెందిన మనోహర్, తాను గత 10 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, తమ పెళ్లిని అత్తమామలు వ్యతిరేకించడంతో తాము వేరే కాపురం పెట్టామని చెప్పింది.
తన భర్తకు తాగుడు మాన్పిస్తామని తెలిపి తననుంచి నెలల తరబడి దూరం చేశారని ప్రస్తుతం తన మామ తన భర్తకు వేరే వివాహం చేసి తన నుంచి దూరం చేశారని ఆరోపించింది. గత 8 రోజుల క్రితమే రూరల్ స్టేషన్‌లో తన భర్తను వెతికి ఇవ్వాలని ప్రతిఘటన నిర్వహించినా పోలీసులు పట్టించుకోక పోవడంతో స్టేషన్ ముందు నిరసన తెలుపుతున్నానని తెలిపింది. తన భర్తకు తనపై లేనిపోని చాడీలు చెప్పి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు పిల్లలు కలిగిన తాను భర్తను వీడి ఎలా జీవనం సాగించాలని ప్రశ్నించింది. తనకు భర్తను తెచ్చివ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది. తన మామ రిటైర్డు ఏఎస్సై కావడంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment