husband missing
-
జనవరిలో పెళ్లి.. నెల రోజులుగా గొడవలు.. ఉన్నట్టుండి భర్త మాయం!
సాక్షి, హైదరాబాద్: తన భర్త అదృశ్యమయ్యాడని ఓ నవ వధువు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యూసుఫ్‌గూడ బస్తీలో నివసించే సోను(24) ప్రైవేట్ ఉద్యోగి కాగా, భార్య షేక్ రోషణి(24) ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తోంది. ఈ నెల 5న ఆఫీసుకు వెళ్లిన సోను ఇంటికి తిరిగి రాలేదు. దీంతో రోషణి అతనికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది ఇదిలా ఉండగా, ఈ ఏడాది జనవరిలో తమకు పెళ్లైందని, నెల రోజులుగా తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని భార్య తెలిపింది. ఈ కారణంగా తన భర్తకు గుంటూరు జిల్లా మాచర్లలో నివసించే తల్లిదండ్రులు రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారంటూ ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను అన్ని ప్రాంతాల్లో వెతికానని, తన భర్త జాడ తెలియరాలేదని చెప్పింది. తన అత్తమామల వద్దే భర్త ఉండి ఉంటాడంటూ ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యకు సెల్ఫీ వీడియో పంపి..ఆ తర్వాత..
సాక్షి, కణేకల్లు: తన చావుకు ఎవరూ కారణం కాదంటూ భార్యకు వీడియో సందేశాన్ని పంపి భర్త కనిపించకుండా పోయాడు. వివరాలు.. కణేకల్లు మండలం యర్రగుంట గ్రామానికి చెందిన మల్లికార్జున, జయలక్ష్మి దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. యర్రగుంట బస్టాండ్ ప్రాంతంలో సెల్ఫోన్ల మరమ్మతు దుకాణాన్ని మల్లికార్జున నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన అతను ఈ విషయాన్ని భార్యకు కూడా తెలపలేదు. డాక్టర్ వద్దకు ఒక్కడే వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చేవాడు. మంగళవారం ఉదయం తాను దుకాణానికి వెళుతున్నట్లు ఇంట్లో తెలిపి బయటకు వచ్చిన అతను.. ద్విచక్ర వాహనంపై మాల్యం – నాగేపల్లి గ్రామాల మధ్య ఉన్న హెచ్చెల్సీ గట్టుకు చేరుకున్నాడు. అనంతరం కాలువ గట్టుపై నిల్చోని తన చావుకు ఎవరూ కారణం కాదని, ఆరోగ్యం బాగాలేకపోవడంతో జీవితంపై విరక్తితో కాలువలో దూకి చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి భార్యకు పంపాడు. ఆలస్యంగా ఈ సందేశాన్ని గమనించిన భార్య జయలక్ష్మి తీవ్ర ఆందోళనకు గురైంది. విషయాన్ని వెంటనే కుటుంబసభ్యులకు, బంధువులకు, పోలీసులకు చేరవేయడవంతో అందరూ ఆగమేఘాలపై కాలువ గట్టుకు చేరుకున్నారు. అక్కడ మల్లికార్జున ద్విచక్ర వాహనంతో పాటు సెల్‌ఫోన్, షర్ట్ లభ్యమయ్యాయి. కుటుంబసభ్యులు కాలువ వెంబడి గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అంతా క్షణాల్లోనే.. రెండు కుటుంబాల్లో అంతులేని శోకం) -
సంతోషంగా మేడారం వెళ్లొచ్చారు.. ఉతకాల్సిన బట్టలు ఎక్కువగా ఉన్నాయని..
సాక్షి, ఖమ్మం: కుటుంబంతో సహా మేడారంలో సమ్మక్క – సారలమ్మ జాతరకు వెళ్లారు. అమ్మ వారికి మొక్కులు చెల్లించి సరదాగా గడిపి వచ్చారు. ఉతకాల్సిన బట్టలు ఎక్కువగా ఉండడంతో దంపతులిద్దరూ కలిసి సాగర్ కాల్వ వద్దకు వెళ్లారు. అయితే, ప్రమాదవశాత్తు కాలు జారి భార్య కాల్వలో పడి కొట్టుకుపోతుండగా.. కాపాడేందుకు దిగిన భర్త ఇద్దరూ ప్రవాహంలో మునిగారు. పోలీసులు, ఈతగాళ్లు చేపట్టిన గాలింపుల్లో భార్య మృతదేహం లభించగా, భర్త కోసం గాలింపు కొనసాగుతోంది. ఖమ్మం రూరల్ మండలం ఆరేకోడుకు చెందిన ఆరెంపుల పరశురాం – నందిని(25) భార్యాభర్తలు, వీరికి ఇద్దరు పిల్లలు సుమశ్రీ, యశ్వంత్ ఉన్నారు. పరశురాం తాపీ మేస్త్రీ పనిచేస్తుండగా నందిని ఇంటి వద్దే ఉంటోంది. వీరు మేడారంలో మొక్కు చెల్లించుకోవడానికి ఈనెల 15న వెళ్లి 17న తిరిగి వచ్చారు. ఇంట్లో ఉతకాల్సిన ఎక్కువగా బట్టలు ఉండటంతో శుక్రవారం ఉదయం భార్యాభర్తలిద్దరు కూతురు సుమశ్రీని తీసుకుని ముత్తగూడెం – పల్లెగూడెం గ్రామాల నడుమ ఉన్న సాగర్ కాల్వ వద్దకు వెళ్లారు. కూతురిని కాల్వ గట్టుపై ఉంచి బట్టలు ఉతుకుతుండగా నందిని ప్రమాదవశాత్తు కాలు జారి కాల్వలో పడిపోయింది. దీంతో హతాశుడైన పరశురాం ఆమెను కాపాడేందుకు కాల్వలోకి దూకాడు. ఈత వచ్చిన ఆయన కొట్టుకుపోతున్న భార్యను కాపాడే యత్నంలో నందిని భర్త మెడ పట్టుకోవడంతో ఊపిరి ఆడక ఇద్దరూ మునిగి కొట్టుకుపోసాగారు. చదవండి: హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని... తల్లిదండ్రులు కానరాకపోవడంతో బేల చూపులు చూస్తున్న చిన్నారులు ఈ విషయాన్ని గుర్తించిన వాహనదారులు వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా గజ ఈతగాళ్లను పిలిపించి గాలించగా పల్లెగూడెం లాకుల వద్ద నందిని మృతదేహం లభించింది. పరశురాం ఆచూకీ కోసం ఇంకా కాల్వలో వెతుకుతున్నారు. కాగా, ఇదిలా ఉండగా కాల్వలో పడి తల్లి మృతి చెందడం, తండ్రి జాడ తెలియకపోవడంతో వీరి పిల్లలిద్దరు అమ్మానాన్న ఏరీ అంటూ బేల చూపులు చూస్తుండడం అందరినీ కంటతడి పెట్టించింది. -
భార్యభర్తల మధ్య గొడవ.. భర్త అదృశ్యం
సాక్షి, మీర్‌పేట(రంగారెడ్డి): భార్య కేసు పెట్టిందని మనస్తాపం చెందిన వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఏఎస్ఐ తిరుపతయ్య ప్రకారం.. మీర్‌పేట జనప్రియా మహానగర్‌కు చెందిన టి.రవీందర్ (45), వృత్తి రీత్యా ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో రవీందర్‌పై గతంలో భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన రవీందర్ కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యతో గొడవ.. మొబైల్ ఇంట్లోనే ఉంచి భర్త అదృశ్యం
సాక్షి, జీడిమెట్ల(హైదరాబాద్): తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి భార్యతో గొడవపడి కనిపించకుండా పోయిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన ప్రభాకర్‌చారి(38), స్వాతిలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. ప్రైవేట్ ఉద్యోగం చేసే ప్రభాకర్‌చారికి తాగుడు అలవాటు ఉంది. కాగా స్వాతి లాలాపేట్‌లో ఉండే తన తల్లి అనారోగ్యంగా ఉండటంతో పిల్లలను తీసుకుని ఇటీవల తన భార్య పుట్టింటికి వెళ్లింది. తిరిగి ఈ నెల 14న ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లోని సామగ్రి కనిపించలేదు. ఈ విషయమై భర్తను ఆరా తీయగా తానే అమ్మేశానని చెప్పడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రభాకర్ చారి తన మొబైల్‌ను ఇంట్లో ఉంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అతడి భార్య స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నా భర్తను వెతికి పెట్టండి: కెనడాలో తెలుగు మహిళ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: కెనడాలోని మాంట్రియల్లో ఉంటున్న దీప్తిరెడ్డి అనే వివాహిత తన భర్త కనిపించడం లేదని భారత విదేశాంగ శాఖకు ట్విటర్లో తెలిపింది. ఎటువంటి సమాచారం లేకుండా తన భర్త తనను వదిలేసి ఇండియాకు వచ్చేశారని వాపోయింది. ప్రస్తుతం, తాను గర్భవతిని ఉన్నట్లు వెల్లడించింది. తన భర్త అనుగుల చంద్రశేఖర్ రెడ్డి కెనడాలో మెక్‌గ్రిల్ యూనివర్సిటీలో రసాయన శాస్త్రవిభాగంలో పనిచేసేవారని తెలిపింది. తన భర్తకు చాలా సార్లు ఫోన్‌చేశాను.. నా సెల్ నంబరును నా భర్త తరపు కుటుంబ సభ్యులు బ్లాక్ చేశారని వాపోయింది. ఆగస్టు 9 నుంచి తన భర్త ఆచూకీ లేదని వాపోయింది. తాను.. భారత హైకమిషన్‌కు 2021 ఆగస్టు 20న ఫిర్యాదు చేశానని తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని తన ట్వీట్లో తెలియజేసింది. కావాలనే నా భర్త ఆచూకీ తెలియకుండా చేస్తున్నారని తెలిపింది. కాగా, తన బావ శ్రీనివాస్ రెడ్డి చైతన్యపురిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటారని దీప్తి పేర్కొంది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిపింది. తన భర్త ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళనకు లోనవుతున్నానని తెలిపింది. దీప్తి వినతి మేరకు స్పందించిన విదేశాంగ శాఖ రాచకొండ పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు చంద్రశేఖర్ రెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: Krishna: కేఈబీ కెనాల్ లోకి దూసుకెళ్లిన ఇన్నోవా వాహనం -
నా భర్త ఆచూకీ చెప్పండి
శ్రీకాకుళం,రాజాం సిటీ: తన భర్త శీర శ్రీనివాసనాయుడును గత నెల 16న జ్వరం, పచ్చకామెర్లు ఉండడంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తీసుకువెళ్లామని రాజాం గాయత్రికాలనీకి చెందిన శీర రాజేశ్వరి ఆదివారం విలేకరులకు తెలిపారు. ఆ రోజే వైద్యులు పరీక్షలు నిర్వహించి రాగోలు జెమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేయగా 108 అంబులెన్స్‌లో తన భర్తను తీసుకువెళ్లారని, తమను ఆటోలో అక్కడకు రావాలని సిబ్బంది సూచించడంతో ఆటోలో వెళ్లగా అప్పటికే అంబులెన్స్ సిబ్బంది తన భర్తను ఆస్పత్రిలో దించి తిరుగుముఖం పట్టారని చెప్పారు. భర్త ఆచూకీ కోసం ఆస్పత్రి వద్ద విచారించగా లోపలకు రానీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త వద్ద ఫోన్ కూడా లేకపోవడంతో ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అక్కడ నుంచి వెనుదిరిగి ఇంటికి వచ్చేశామని, తరువాత ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్లి వాకబుచేయగా ఎటువంటి సమాధానం లేదని వాపోయారు. కనీసం ఎక్కడున్నాడో చెప్పమని ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈవిషయమై ఎస్పీ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లగా టూ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయమని సలహా మేరకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికే 32 రోజులైనా భర్త ఆచూకీ తెలియకపోవడం, ఆస్పత్రి వర్గాల వద్ద ఎటువంటి సమాచారం లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరారు. -
భర్త ఏమైయ్యాడో తెలియదు.. బతుకు భారం
నెల్లూరు, కావలి: భర్త ఏమైపోయాడో తెలియదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇద్దరు బిడ్డల భవిష్యత్ ఆలోచనలు చావనీయలేదు. పేదరికంలో మగ్గిపోతుండడంతో బంధువులు చేరదీసి అక్కున చేర్చుకోవడంతో కాలం వెళ్లదీసింది. పిల్లలను అనాథలను చేయకూడదని ఆరేళ్లుగా దయనీయంగా బతుకుతోంది. కావలికి చెందిన లలితాంబికకు దగదర్తి మండలం అనంతవరం గ్రామానికి చెందిన బండారు కామేశ్వరరావుతో 14 ఏళ్ల క్రితం వివాహామైంది. వారికి వెంకట సాయి తరుణ్, సుస్మిత లక్ష్మి పిల్లలు ఉన్నారు. కరెంట్ మెకానిక్ అయిన కామేశ్వరరావు ఆరేళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. లలితాంబిక పలు చోట్ల విచారించి, దగదర్తి పోలీసులకు తన భర్త జాడ తెలియడం లేదని ఫిర్యాదు చేసింది. వారి నుంచి సరైన సమాచారం లేదు. భర్త లేడనే మనోవ్యథ, పిల్లలు భవిష్యత్‌పై భయాలతో మానసికంగా చితికిపోయింది. ఆస్తులు ఏమీ లేని నిరుపేద కుటుంబానికి చెందిన లలితాంబిక, ఇద్దరు పిల్లలను బంధువులు చేరదీశారు. తన బిడ్డలను చదివించాలని బలమైన కాంక్షను లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తోంది. కుమారుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మకమైన నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి జరిగిన పోటీ పరీక్షలు నెగ్గి 7వ తరగతికి అడ్మిషన్ సాధించాడు. కుమార్తె 2వ తరగతి చదువుతోంది. బంధువులకు భారంగా ఉన్నాననే భావంతో కుమిలిపోతున్న లలితాంబిక ఉపాధి అవకాశాలు వెతుక్కొని పిల్లలను పోషించుకొంటూ వారిని బాగా చదివించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆమె దయనీయ పరిస్థితిని ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తూ ప్రతి అక్క చెల్లెమ్మకు అండగా ఉంటానని చెప్పిన మాటలు ఆమెలో ఆత్మస్యైర్యాన్ని నింపాయి. ఏ దిక్కూలేని తన లాంటి వారిని ఆదుకుంటారని ఆశలు కలిగింది. ఈ నేపథ్యంలో ఆమె ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి తన దీన పరిస్థితిని తెలియజేసింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కలిసి తన పరిస్థితి వివరస్తానని, ఉపాధి అవకాశం కల్పిస్తే తన బిడ్డలను పోషించుకొని ప్రయోజకులను చేసుకొంటానని దీనంగా వేడుకొంటుంది. -
భర్త ఆచూకీని కనిపెట్టకపోతే..
కర్ణాటక, బొమ్మనహళ్లి : తన భర్త ఆచూకీని కనిపెట్టకపోతే పోలీస్‌స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటానని ఓ మహిళ సామాజిక మాధ్యమంద్వారా పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది. వివరాలు.. హెచ్ఎస్ఆర్ లేఔట్లో జై జినిషా అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహమైంది. దంపతులకు ఏడాది వయసున్న బిడ్డ ఉంది. ఇదిలా ఉండగా ఆరు నెలలుగా జై కనిపించకుండా పోయాడు. దీంతో తన భర్త ఆచూకీ కనిపెట్టాలని జినిషా హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేసిది. పోలీసులు జై కోసం గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని పోలీసులు ఆమెకు తెలియజేశారు. దీంతో మనోవేదనకు గురైన జినిషా... తన భర్తను వెతికి తనకు అప్పగించాలని, లేదంటే పోలీస్స్టేషన్ముందే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను హెచ్చరిస్తూ సామాజి మాధ్యమాల్లో పోస్టు చేసింది. -
నా భర్తను తెచ్చివ్వండి
కోలారు: ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ భర్త అత్తమామలు వారి పాలిట విలన్లుగా మారి చిచ్చుపెట్టారు. తన భర్తను వెదికి ఇవ్వాలని కోరుతూ ఒక మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం సాయంత్రం నగరంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ ముందు ప్రతిఘటన నిర్వహించింది. తాలూకాలోని వక్కలేరి గ్రామానికి చెందిన అంబిక ఇలా నిరసన చేపట్టింది. తన మామ తన భర్తకు వేరే పెళ్లి చేసి తనకు దూరంగా ఉంచారని, తనకు, పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదని బాధితురాలు విలపించింది. న్యాయం కోసం గత 8 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని ఆరోపించింది. వక్కలేరి గ్రామానికి చెందిన మనోహర్, తాను గత 10 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, తమ పెళ్లిని అత్తమామలు వ్యతిరేకించడంతో తాము వేరే కాపురం పెట్టామని చెప్పింది. తన భర్తకు తాగుడు మాన్పిస్తామని తెలిపి తననుంచి నెలల తరబడి దూరం చేశారని ప్రస్తుతం తన మామ తన భర్తకు వేరే వివాహం చేసి తన నుంచి దూరం చేశారని ఆరోపించింది. గత 8 రోజుల క్రితమే రూరల్ స్టేషన్లో తన భర్తను వెతికి ఇవ్వాలని ప్రతిఘటన నిర్వహించినా పోలీసులు పట్టించుకోక పోవడంతో స్టేషన్ ముందు నిరసన తెలుపుతున్నానని తెలిపింది. తన భర్తకు తనపై లేనిపోని చాడీలు చెప్పి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు పిల్లలు కలిగిన తాను భర్తను వీడి ఎలా జీవనం సాగించాలని ప్రశ్నించింది. తనకు భర్తను తెచ్చివ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది. తన మామ రిటైర్డు ఏఎస్సై కావడంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంది. -
హనీమూన్ విషాదాంతం: ‘తమన్నా’ మృతి
భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లిన నూతన వధువు తమన్నా (25) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. సెల్ఫీ తీసుకుంటూ కాలుజారిపడి చనిపోయిందని భర్త చెబుతుండగా, మృతురాలి బంధువులు మాత్రం పలు సందేహాలను వ్యక్తం చేస్తూ ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ సంఘటన అనంతరం తమన్నా భర్త పరారీలో ఉండటం మరింత అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే..ఢిల్లీకి చెందిన తమన్నా, షాదాబ్ లకు గత ఏడాది నవంబర్‌లో వివాహం అయింది. ఈ నెలలో కొత్త జంట హనీమూన్ కోసం నైనిటాల్ వెళ్లింది. తాము ఇద్దరం సెల్పీ తీసుకుంటుండగా హఠాత్తుగా అక్కడ పాము కనిపించిందని, దీంతో భయపడిన తమన్నా అనుకోకుండా వెనక్కి జరుగుతూ.. సుమారు 250 అడుగుల లోయలోకి పడిపోయిందని, తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందనేది తమన్నా భర్త చెబుతున్నకథనం. క్యాడ్ డ్రైవర్ అందించిన సమాచారం ప్రకారం.... జనవరి 15న నైనిటాల్ సైట్ సీయింగ్ కోసం ఈ కొత్త జంట క్యాబ్ బుక్ చేసుకున్నారు. మధ్యలో తమన్నా కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో..దంపతులు ఇద్దరూ క్యాబ్ దిగి కొండవాలు వైపు నడుచుకుంటూ వెళ్లారని, ఇంతలో అరుపులు, ఏడుపులు వినడంతో తాను అక్కడకు చేరుకోగా.. పామును చూసి భయపడి తన భార్య లోయలో పడిపోయిందని షాదాబ్ చెప్పినట్లు తెలిపాడు. వెంటనే స్థానికుల సహాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు డ్రైవర్ పేర్కొన్నాడు. తన సోదరిని కట్నం కోసమే షాబాద్ చంపేశాడని తమన్నా సోదరుడు అరిఫ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం తమన్నా మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించినట్లు టైనిటాల్ పోలీసు స్టేషన్ అధికారి ప్రమోద్ పతక్ తెలిపారు. -
నా భర్త ఏమయ్యాడో తెలుపండి!
వేలూరు(తమిళనాడు): ఆమెది ఫిలిప్పీన్స్. అతనిది తమిళనాడు. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆకస్మికంగా తన భర్త కనిపించకుండాపోవడంతో ఫిలిప్పీన్స్ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వివరాలివి.. వాలాజ తిరుమల మొదలియార్ వీధికి చెందిన మురుగన్ కుమారుడు నాగరాజన్ (31) ఖతార్ దేశంలోని ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. నాగరాజన్ కార్యాలయంలోనే ఫిలిప్పీన్స్‌కు చెందిన సైరల్ మాండేరియన్ (34) కూడా పనిచేస్తుంది. సహోద్యోగులుగా ఉన్న వీరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ ఖతార్‌లోనే పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడున్నాడు. రెండు సంవత్సరాల క్రితం భార్యతో కలిసి స్వదేశానికి వచ్చిన నాగరాజన్ బెంగళూరు జేజే నగర్‌లోని శారద అవెన్యూ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. 15 రోజుల క్రితం తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి నాగరాజన్ వాలాజ వచ్చాడు. అప్పటినుంచి అతను భార్యతో మాట్లాడలేదు. ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్‌లో ఉండడంతో వాలాజలోని బంధువుల వద్ద సైరల్ మాండేరియన్ వాకబు చేసింది. నాగరాజన్‌కు తల్లిదండ్రులు మరో వివాహం చేస్తున్నట్లు వారి ద్వారా తెలుసుకుంది. దీంతో ఆదివారం ఆమె వాలాజ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఆచూకీ తెలపాలంటూ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నాగరాజన్ ఇంటికి వెళ్లి విచారించారు. అయితే కుటుంబసభ్యులందరూ వేరే ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. నాగరాజన్ సెల్‌ఫోన్ సిగ్నల్‌ను బట్టి పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
మాచినేనిపేట సర్పంచ్ భర్త రాములు ఏమయ్యాడు..?
మాచినేనిపేట (జూలూరుపాడు), న్యూస్‌లైన్: మాచినేనిపేట గ్రామ సర్పంచ్ దేవి భర్త, వైఎస్ఆర్ సీపీ నాయకుడు సపావట్ రాములు జాడ శుక్రవారం నాటికి కూడా తెలీలేదు. ఆయన బుధవారం మాచినేనిపేటలోని తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆయన కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. రాములు భార్య దేవిని కూడా వారు ప్రశ్నించారు. సాగర్ కాల్వలో గాలింపు రాములును హత్య చేసి, మృతదేహాన్ని ఏన్కూరులోని సాగర్ కాల్వలో పడేశారన్న సమాచారంతో కుటుంబీకులు, గ్రామస్తులు, పోలీసులు గురువారం రాత్రి వరకు ఏన్కూరు నుంచి కల్లూరు వరకు గాలించారు. పాత కక్షల నేపథ్యంలోనే... పాత కక్షల నేపథ్యంలోనే సపావట్ రాములును కొందరు ‘మాయం’ చేసి ఉండవచ్చని స్థానికు లు భావిస్తున్నారు. ఐదేళ్ల కిందట రాములుకు, గురవాగుతండాకు చెందిన వ్యక్తికి మధ్య ఘర్ష ణ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పం చాయతీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు వా రిద్దరి మధ్య స్నేహం కుదిరిందని, ఎన్నికలలో కలిసి పనిచేశారని అంటున్నారు. రాములు బుధవారం తన ఇంటి నుంచి 20వేల రూపాయలు తీసుకుని, ఆ వ్యక్తితో కలిసి ఏన్కూరు వెళ్లారని (రాములు) కుటుంబీకులు తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాస్తారోకో ‘రాములును హత్య చేసి సాగర్ కాల్వలో మృతదేహాన్ని పడేసినట్టయితే ఈ రెండు రోజుల్లో ఎక్కడో ఒకచోట మృతదేహం కనిపించేది. శవాన్ని మరోచోట ఉంచి.. కావాలనే పోలీసులను, గ్రామస్తులను నిందితులు తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పోలీసులు కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై గ్రామస్తులు, రాములు కుటుంబీకులు, బంధువులు శుక్రవారం రాస్తారోకో చేశారు. ఏఎస్పీకి ఫిర్యాదు రాస్తారోకో సాగుతున్న సమయంలోనే ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళుతున్న ఏఎస్పీ నాగేశ్వరరావు వాహనం వచ్చింది. పోలీసుల తీరుపై ఏఎస్పీకి ఆందోళనకారులు ఫిర్యాదు చేశారు. రాములు ఆచూకీ త్వరగా తెలుసుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతిం చారు. ఎస్ఐ ఆర్.అంజయ్య తన సిబ్బందితో కలిసి ఏన్కూరు సాగర్ కాల్వ వెంట గాలించి పోలీస్ స్టేషన్‌కు తిరిగొస్తుండగా ఆందోళనకారులు అడ్డగించి, రాస్తారోకోకు దిగారు. అటుగా వచ్చిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కృ ష్ణారెడ్డికి వారు సమస్యను వివరించారు. ఆయన ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. -
భార్యను కాపాడబోయి భర్త గల్లంతు
తెనాలిరూరల్, న్యూస్‌లైన్: కుటుంబంలో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని మనస్థాపానికి గురైన భార్య కాల్వలోకి దూకడంతో ఆమెను రక్షించేందుకు దూకిన భర్త గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు భార్యను కాపాడగలిగారు. తెనాలి మండలం కంచర్లపాలెం వంతెన వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన కట్టా వెంకట నాంచారయ్య అలియాస్ నాని(39) రాయనపాడు రైల్వేవ్యాగన్ వర్క్‌షాప్‌లో డీజిల్ ఇంజిన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతని మొదటి భార్యకు అనారోగ్యంగా ఉండడంతో కొంతకాలం క్రితం సింగ్నగర్కే చెందిన క్యాటరర్ సుభాషిని అలియాస్ సుహాసిని(27)ని రహస్యంగా వివాహం చేసుకున్నాడు. సిబ్బంది, సామాగ్రిని తరలించేందుకు సుహాసిని వినియోగించే లగేజ్ ఆటోను నాంచారయ్య ఖాళీ సమయాల్లో నడుపుతుంటాడు. తమ వివాహం విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపాలంటూ కొంతకాలంగా సుహాసిని భర్తపై వత్తిడి తెస్తోంది. ఈ విషయమై ఇరువురు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. బుధవారం మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో క్యాటరింగ్ చేసిన సుహాసిని తెనాలికి చెందిన వంట కార్మికులను ఇళ్ల వద్ద దింపేందుకు నాంచారయ్యతో కలసి ఆటోలో సాయంత్రం 6.30 గంటలకు తెనాలి బయలుదేరింది. ఇద్దరూ ఆటోలో ఘర్షణ పడటంతో సుహాసినిని కంచర్లపాలెం వంతెన వద్ద ఆటో నుంచి దింపేశాడు. కార్మికులను తెనాలిలో దింపి తిరిగి వస్తున్న ఆటోను చూసిన సుహాసిని వెంటనే వంతెనపై నుండి తూర్పు కాల్వలోకి దూకేసింది. భార్యను రక్షించేందుకు నాంచారయ్య కూడా కాల్వలోకి దూకేశాడు. అదే సమయంలో వంతెనవైపు వస్తున్న తాలూకా కానిస్టేబుల్ అంకయ్య వీరిని గమనించి స్థానికులను పిలిచి రక్షించే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్‌తోపాటు స్థానికులు ఇద్దరు కాల్వలోకి దూకి సుహాసినిని కాపాడగలిగారు. నాచారయ్య కాల్వలో గల్లంతయ్యాడు. తాలూకా ఎస్ఐ జె. శ్రీనివాస్, సిబ్బందితో అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నాంచారయ్య ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాధితురాలిని స్టేషనుకు తీసుకువెళ్లి విచారిస్తున్నారు.