గల్లంతైన పరశురాం, మృతి చెందిన నందిని (ఫైల్)
సాక్షి, ఖమ్మం: కుటుంబంతో సహా మేడారంలో సమ్మక్క – సారలమ్మ జాతరకు వెళ్లారు. అమ్మ వారికి మొక్కులు చెల్లించి సరదాగా గడిపి వచ్చారు. ఉతకాల్సిన బట్టలు ఎక్కువగా ఉండడంతో దంపతులిద్దరూ కలిసి సాగర్ కాల్వ వద్దకు వెళ్లారు. అయితే, ప్రమాదవశాత్తు కాలు జారి భార్య కాల్వలో పడి కొట్టుకుపోతుండగా.. కాపాడేందుకు దిగిన భర్త ఇద్దరూ ప్రవాహంలో మునిగారు. పోలీసులు, ఈతగాళ్లు చేపట్టిన గాలింపుల్లో భార్య మృతదేహం లభించగా, భర్త కోసం గాలింపు కొనసాగుతోంది. ఖమ్మం రూరల్ మండలం ఆరేకోడుకు చెందిన ఆరెంపుల పరశురాం – నందిని(25) భార్యాభర్తలు, వీరికి ఇద్దరు పిల్లలు సుమశ్రీ, యశ్వంత్ ఉన్నారు. పరశురాం తాపీ మేస్త్రీ పనిచేస్తుండగా నందిని ఇంటి వద్దే ఉంటోంది. వీరు మేడారంలో మొక్కు చెల్లించుకోవడానికి ఈనెల 15న వెళ్లి 17న తిరిగి వచ్చారు.
ఇంట్లో ఉతకాల్సిన ఎక్కువగా బట్టలు ఉండటంతో శుక్రవారం ఉదయం భార్యాభర్తలిద్దరు కూతురు సుమశ్రీని తీసుకుని ముత్తగూడెం – పల్లెగూడెం గ్రామాల నడుమ ఉన్న సాగర్ కాల్వ వద్దకు వెళ్లారు. కూతురిని కాల్వ గట్టుపై ఉంచి బట్టలు ఉతుకుతుండగా నందిని ప్రమాదవశాత్తు కాలు జారి కాల్వలో పడిపోయింది. దీంతో హతాశుడైన పరశురాం ఆమెను కాపాడేందుకు కాల్వలోకి దూకాడు. ఈత వచ్చిన ఆయన కొట్టుకుపోతున్న భార్యను కాపాడే యత్నంలో నందిని భర్త మెడ పట్టుకోవడంతో ఊపిరి ఆడక ఇద్దరూ మునిగి కొట్టుకుపోసాగారు.
చదవండి: హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని...
తల్లిదండ్రులు కానరాకపోవడంతో బేల చూపులు చూస్తున్న చిన్నారులు
ఈ విషయాన్ని గుర్తించిన వాహనదారులు వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా గజ ఈతగాళ్లను పిలిపించి గాలించగా పల్లెగూడెం లాకుల వద్ద నందిని మృతదేహం లభించింది. పరశురాం ఆచూకీ కోసం ఇంకా కాల్వలో వెతుకుతున్నారు. కాగా, ఇదిలా ఉండగా కాల్వలో పడి తల్లి మృతి చెందడం, తండ్రి జాడ తెలియకపోవడంతో వీరి పిల్లలిద్దరు అమ్మానాన్న ఏరీ అంటూ బేల చూపులు చూస్తుండడం అందరినీ కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment