తన ఇద్దరు పిల్లలతో బండారు లలితాంబిక
నెల్లూరు, కావలి: భర్త ఏమైపోయాడో తెలియదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇద్దరు బిడ్డల భవిష్యత్ ఆలోచనలు చావనీయలేదు. పేదరికంలో మగ్గిపోతుండడంతో బంధువులు చేరదీసి అక్కున చేర్చుకోవడంతో కాలం వెళ్లదీసింది. పిల్లలను అనాథలను చేయకూడదని ఆరేళ్లుగా దయనీయంగా బతుకుతోంది.
కావలికి చెందిన లలితాంబికకు దగదర్తి మండలం అనంతవరం గ్రామానికి చెందిన బండారు కామేశ్వరరావుతో 14 ఏళ్ల క్రితం వివాహామైంది. వారికి వెంకట సాయి తరుణ్, సుస్మిత లక్ష్మి పిల్లలు ఉన్నారు. కరెంట్ మెకానిక్ అయిన కామేశ్వరరావు ఆరేళ్ల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. లలితాంబిక పలు చోట్ల విచారించి, దగదర్తి పోలీసులకు తన భర్త జాడ తెలియడం లేదని ఫిర్యాదు చేసింది. వారి నుంచి సరైన సమాచారం లేదు. భర్త లేడనే మనోవ్యథ, పిల్లలు భవిష్యత్‌పై భయాలతో మానసికంగా చితికిపోయింది. ఆస్తులు ఏమీ లేని నిరుపేద కుటుంబానికి చెందిన లలితాంబిక, ఇద్దరు పిల్లలను బంధువులు చేరదీశారు. తన బిడ్డలను చదివించాలని బలమైన కాంక్షను లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తోంది. కుమారుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మకమైన నవోదయ విద్యాలయంలో ప్రవేశానికి జరిగిన పోటీ పరీక్షలు నెగ్గి 7వ తరగతికి అడ్మిషన్ సాధించాడు. కుమార్తె 2వ తరగతి చదువుతోంది.
బంధువులకు భారంగా ఉన్నాననే భావంతో కుమిలిపోతున్న లలితాంబిక ఉపాధి అవకాశాలు వెతుక్కొని పిల్లలను పోషించుకొంటూ వారిని బాగా చదివించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆమె దయనీయ పరిస్థితిని ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తూ ప్రతి అక్క చెల్లెమ్మకు అండగా ఉంటానని చెప్పిన మాటలు ఆమెలో ఆత్మస్యైర్యాన్ని నింపాయి. ఏ దిక్కూలేని తన లాంటి వారిని ఆదుకుంటారని ఆశలు కలిగింది. ఈ నేపథ్యంలో ఆమె ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి తన దీన పరిస్థితిని తెలియజేసింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కలిసి తన పరిస్థితి వివరస్తానని, ఉపాధి అవకాశం కల్పిస్తే తన బిడ్డలను పోషించుకొని ప్రయోజకులను చేసుకొంటానని దీనంగా వేడుకొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment