భర్త ఫొటోను చూపుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్న రాజేశ్వరి
శ్రీకాకుళం,రాజాం సిటీ: తన భర్త శీర శ్రీనివాసనాయుడును గత నెల 16న జ్వరం, పచ్చకామెర్లు ఉండడంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తీసుకువెళ్లామని రాజాం గాయత్రికాలనీకి చెందిన శీర రాజేశ్వరి ఆదివారం విలేకరులకు తెలిపారు. ఆ రోజే వైద్యులు పరీక్షలు నిర్వహించి రాగోలు జెమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేయగా 108 అంబులెన్స్‌లో తన భర్తను తీసుకువెళ్లారని, తమను ఆటోలో అక్కడకు రావాలని సిబ్బంది సూచించడంతో ఆటోలో వెళ్లగా అప్పటికే అంబులెన్స్ సిబ్బంది తన భర్తను ఆస్పత్రిలో దించి తిరుగుముఖం పట్టారని చెప్పారు.
భర్త ఆచూకీ కోసం ఆస్పత్రి వద్ద విచారించగా లోపలకు రానీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త వద్ద ఫోన్ కూడా లేకపోవడంతో ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అక్కడ నుంచి వెనుదిరిగి ఇంటికి వచ్చేశామని, తరువాత ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్లి వాకబుచేయగా ఎటువంటి సమాధానం లేదని వాపోయారు. కనీసం ఎక్కడున్నాడో చెప్పమని ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈవిషయమై ఎస్పీ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లగా టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని సలహా మేరకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికే 32 రోజులైనా భర్త ఆచూకీ తెలియకపోవడం, ఆస్పత్రి వర్గాల వద్ద ఎటువంటి సమాచారం లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరారు.
Comments
Please login to add a commentAdd a comment