నా భర్త ఏమయ్యాడో తెలుపండి!
Published Mon, Jun 5 2017 10:10 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM
వేలూరు(తమిళనాడు): ఆమెది ఫిలిప్పీన్స్. అతనిది తమిళనాడు. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆకస్మికంగా తన భర్త కనిపించకుండాపోవడంతో ఫిలిప్పీన్స్ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వివరాలివి..
వాలాజ తిరుమల మొదలియార్ వీధికి చెందిన మురుగన్ కుమారుడు నాగరాజన్ (31) ఖతార్ దేశంలోని ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. నాగరాజన్ కార్యాలయంలోనే ఫిలిప్పీన్స్‌కు చెందిన సైరల్ మాండేరియన్ (34) కూడా పనిచేస్తుంది. సహోద్యోగులుగా ఉన్న వీరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ ఖతార్‌లోనే పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడున్నాడు.
రెండు సంవత్సరాల క్రితం భార్యతో కలిసి స్వదేశానికి వచ్చిన నాగరాజన్ బెంగళూరు జేజే నగర్‌లోని శారద అవెన్యూ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. 15 రోజుల క్రితం తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి నాగరాజన్ వాలాజ వచ్చాడు. అప్పటినుంచి అతను భార్యతో మాట్లాడలేదు.
ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్‌లో ఉండడంతో వాలాజలోని బంధువుల వద్ద సైరల్ మాండేరియన్ వాకబు చేసింది. నాగరాజన్‌కు తల్లిదండ్రులు మరో వివాహం చేస్తున్నట్లు వారి ద్వారా తెలుసుకుంది. దీంతో ఆదివారం ఆమె వాలాజ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఆచూకీ తెలపాలంటూ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నాగరాజన్ ఇంటికి వెళ్లి విచారించారు. అయితే కుటుంబసభ్యులందరూ వేరే ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. నాగరాజన్ సెల్‌ఫోన్ సిగ్నల్‌ను బట్టి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Advertisement
Advertisement