భార్యను కాపాడబోయి భర్త గల్లంతు
Published Thu, Aug 29 2013 2:22 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
తెనాలిరూరల్, న్యూస్‌లైన్: కుటుంబంలో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని మనస్థాపానికి గురైన భార్య కాల్వలోకి దూకడంతో ఆమెను రక్షించేందుకు దూకిన భర్త గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు భార్యను కాపాడగలిగారు. తెనాలి మండలం కంచర్లపాలెం వంతెన వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన కట్టా వెంకట నాంచారయ్య అలియాస్ నాని(39) రాయనపాడు రైల్వేవ్యాగన్ వర్క్‌షాప్‌లో డీజిల్ ఇంజిన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతని మొదటి భార్యకు అనారోగ్యంగా ఉండడంతో కొంతకాలం క్రితం సింగ్‌నగర్‌కే చెందిన క్యాటరర్ సుభాషిని అలియాస్ సుహాసిని(27)ని రహస్యంగా వివాహం చేసుకున్నాడు.
సిబ్బంది, సామాగ్రిని తరలించేందుకు సుహాసిని వినియోగించే లగేజ్ ఆటోను నాంచారయ్య ఖాళీ సమయాల్లో నడుపుతుంటాడు. తమ వివాహం విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపాలంటూ కొంతకాలంగా సుహాసిని భర్తపై వత్తిడి తెస్తోంది. ఈ విషయమై ఇరువురు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. బుధవారం మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో క్యాటరింగ్ చేసిన సుహాసిని తెనాలికి చెందిన వంట కార్మికులను ఇళ్ల వద్ద దింపేందుకు నాంచారయ్యతో కలసి ఆటోలో సాయంత్రం 6.30 గంటలకు తెనాలి బయలుదేరింది. ఇద్దరూ ఆటోలో ఘర్షణ పడటంతో సుహాసినిని కంచర్లపాలెం వంతెన వద్ద ఆటో నుంచి దింపేశాడు.
కార్మికులను తెనాలిలో దింపి తిరిగి వస్తున్న ఆటోను చూసిన సుహాసిని వెంటనే వంతెనపై నుండి తూర్పు కాల్వలోకి దూకేసింది. భార్యను రక్షించేందుకు నాంచారయ్య కూడా కాల్వలోకి దూకేశాడు. అదే సమయంలో వంతెనవైపు వస్తున్న తాలూకా కానిస్టేబుల్ అంకయ్య వీరిని గమనించి స్థానికులను పిలిచి రక్షించే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్‌తోపాటు స్థానికులు ఇద్దరు కాల్వలోకి దూకి సుహాసినిని కాపాడగలిగారు. నాచారయ్య కాల్వలో గల్లంతయ్యాడు. తాలూకా ఎస్‌ఐ జె. శ్రీనివాస్, సిబ్బందితో అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నాంచారయ్య ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాధితురాలిని స్టేషనుకు తీసుకువెళ్లి విచారిస్తున్నారు.
Advertisement