పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులు
చీపురుపల్లి: ఎస్సై కాంతికుమార్, ఎంపీడీఓ రామకృష్ణల తీరు కారణంగానే తన భర్త తీవ్ర మనస్తాపానికి గురై మృతి చెందాడని రామలింగాపురం గ్రామానికి చెందిన అప్పలనరసమ్మ ఆరోపించింది. ఈ మేరకు భర్త మృతదేహంతో ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద గ్రామస్తులతో కలసి ఆందోళన చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మైదాన ప్రాంత గిరిజన సంక్షేమ సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు కొల్లాన పైడితల్లి ఆదివారం మృతి చెందాడు. అయితే పైడితల్లి ఎస్సై, ఎంపీడీఓ వేధింపుల వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మృతుడి భార్య అప్పలనరసమ్మ, కుమారుడు నాగరాజు మాట్లాడుతూ, జనవరి నెలలో ఎంపీడీఓ తమ గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులపై కేసు పెట్టారని..
అందులో ఎలాంటి సంబంధం లేని పైడితల్లిపై కూడా కేసు పెట్టారన్నారు. కేసు పెట్టడంతో పైడితల్లి మనస్తాపానికి గురై అకాల మరణం చెందాడని చెప్పారు. ఇటీవల కొద్దిరోజులుగా ఇంటికి పోలీసులు రావడంతో ఆయన తట్టుకోలేకపోయారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసిన రోజున పైడితల్లి ఓ ఆదర్శ వివాహంలో ఉన్నారని.. అయినప్పటికీ ఆయనపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. ఎస్సై కాంతికుమార్, ఎంపీడీఓ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మైదాన ప్రాంత గిరిజన సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు గేదెల లక్ష్మణరావు మాట్లాడుతూ, గిరిజనులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ఇదే విషయమై ఎస్సై కాంతికుమార్ మాట్లాడుతూ, ఎంపీడీఓ రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 20 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అందులో మృతుడు పైడితల్లి ఉన్నాడో లేదో కూదా తమకు తెలియదని.. ఇంకా విచారణ కొనసాగుతోందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment