మృతదేహంతో ఆందోళన చేస్తున్న థామస్‌పేట కాలనీవాసులు
రెవెన్యూ అధికారుల తీరుతో థామస్‌పేట కాలనీవాసులపై పోలీసులు కేసులు నమోదు చేయడం...కేసు నమోదైన వారిలో ఒకరు మృతి చెందడం...తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయాన్ని కాలనీవాసులు ముట్టడించడంతో పరిస్థితి చేయి దాటిపోతుందన్న తరుణంలో అధికారులు దిగొచ్చారు. కాలనీవాసుల డిమాండ్‌కు తలొగ్గారు. హామీలతో ఆందోళనకారులు శాంతించారు. వివరాల్లోకి వెళ్తే...
నెల్లిమర్ల: నగర పంచాయతీ పరిధి థామస్‌పేట కాలనీవాసులు అదే కాలనీకి చెందిన ఓ మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని లేకుంటే ఇక్కడి నుంచి కదలేది లేదని భీష్మించుకు కూర్చోవడంతో అధికారులు దిగొచ్చారు. తమ కాలనీకి చెందిన 27 మందిపై అక్రమంగా బనాయించిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ థామస్‌పేట కాలనీ వాసులు శుక్రవారం ఆందోళన చేపట్టారు.
న్యాయస్థానం పరిధిలో ఉన్న థామస్‌పేట కాలనీలో చాలా కాలంగా నివసిస్తున్న నిరుపేదలు శిథిలమైన, కాలిపోయిన ఇళ్ల స్థానంలో రేకుల షెడ్లు నిర్మించుకునేందుకు ఎయిమ్స్ విద్యా సంస్థల అధినేత కడగళ ఆనంద్‌కుమార్ తన కృషితో ఉత్తర్వులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న స్థలాల్లో సైతం ఇళ్లు నిర్మించుకుంటున్నారనే నెపంతో వారం రోజుల కిందట తహసీల్దార్ చిన్నారావు 27 మందిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు 27 మందిపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన బాధితుల్లో ఒకరైన రెడ్డి గురునాయుడు తీవ్ర ఆందోళనకు గురై గురువారం రాత్రి మృతి చెందారు. ఆగ్రహించిన కాలనీ వాసులు గురునాయుడు మృతదేహంలో శుక్రవారం ఉదయం 7 గంటలకే తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆందోళనకు దిగారు.
అధికారుల తీరును తప్పుబడుతూ నినదించారు. కాలనీ వాసులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, గురునాయుడు మృతికి కారణమైన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో డీఆర్‌ఓ సునీల్‌కుమార్, సీఐ లక్ష్మణరావు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. నమోదు చేసిన
కేసులపై పునః విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే ఉన్న ఇళ్ల స్థానంలో నిర్మించుకుంటున్న వారిపై కేసులు తొలగిస్తామన్నారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని కడగళ ఆనంద్‌కుమార్ అధికారులను కోరారు. వీరి ఆందోళనకు వైఎస్సార్ సీపీ నేతలు పెనుమత్స సాంబశివరాజు, చెనమల్లు వెంకటరమణ, జానా ప్రసాద్, పతివాడ సత్యనారాయణ, రేగాన శ్రీనివాసరావు, టీడీపీ నేతలు రవిశేఖర్, లెంక అప్పలనాయుడు, రెడ్డి వేణు, కింతాడ కళావతి తదితరులు మద్దతుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment