
సాక్షి, విజయవాడ: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా విజయవాడ గొల్లపూడిలో రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. మహిళా తహశీల్దార్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు.. గొల్లపూడి సెంటర్ నుంచి వై జంక్షన్ వరుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసేవ చేసే ఉద్యోగులపై పాశవిక దాడి అత్యంత దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రజలకు రక్షణ కల్పించే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.