సాక్షి, అమరావతి: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. మహిళా తహశీల్ధారుపై ఇటువంటి చర్య అత్యంత దారుణమని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ ఘటనను దేశ రెవెన్యూ చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైనదిగా పేర్కొన్నారు. ప్రభుత్వాలు రెవెన్యూ శాఖకు సంబంధం లేని పనులు అంటగట్టడం వల్ల శాఖా సంబంధమైన పనులు చేయడంలో జాప్యం జరుగుతుందన్నారు.
రెవెన్యూ ఉద్యోగులు రాత్రి, పగలు కష్టపడి పనిచేస్తున్నా.. ప్రజల దృష్టిలో మన్ననలు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు చేసే తప్పులను అందరికి ఆపాదించడం వలన రెవెన్యూ ఉద్యోగులందరూ దోషులుగా నిలబడాల్సి వస్తోందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కే రక్షణ కరువైతే సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. విజయారెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుతాన్ని వెంకటేశ్వర్లు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment