
మోడరన్ పోలీస్
► ఇక పోలీస్ వ్యవస్థ ఆధునికీకరణ
► సీఎం 54 వరాలు
► పళని వ్యాఖ్యలకు సభలో సెన్సార్
► మోనో రైలుకు ఒకే
► ప్రయోగాత్మకంగా బ్యాటరీ బస్సులు
దేశంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన తమిళ పోలీసు యంత్రాంగాన్ని మోడరన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునికీకరణ, సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు సిద్ధం అయింది. ఇందుకు తగ్గట్టుగా పోలీసులకు అసెంబ్లీ వేదికగా సీఎం పళని స్వామి శనివారం 54 వరాలను కురిపించారు. ఇక, చెన్నైలో మోనో రైలు, ప్రయోగాత్మకంగా బ్యాటరీ బస్సు సేవలు సాగుతాయని రవాణా శాఖ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా సీఎం పళని స్వామి ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలకు స్పీకర్ సెన్సార్ కట్ అన్నట్టుగా సభా పద్దుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపై ముఖ్యమంత్రి పళని స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో పలురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులతో పాటుగా సీఎం కూడా సమాధానాలు ఇచ్చారు. ఇందులో రాజీవ్ హత్య కేసు నిందితుడు పేరరివాలన్‌కు పరోల్ విషయంగా ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ సంధించిన ప్రశ్నకు పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే, డీఎంకే శాసనసభా పక్ష ఉపనేత దురై మురుగన్ విజ్ఞప్తి మేరకు వేలూరు జిల్లా పరిధిలో పోలీసు స్టేషన్ల పరిధి పెంపు, అనుసంధానం తదితర అంశాలకు అంగీకారం తెలియజేశారు. తదుపరి సీఎం పళని స్వామి తన పరిధిలోని హోం శాఖకు నిధుల కేటాయింపులపై సాగిన చర్చలో ప్రసంగాన్ని అందుకున్నారు.
పోలీసుల వ్యవస్థ వల్లే రాష్ట్రం శాంతివనం
రాష్ట్ర పోలీసుల పనితీరును గుర్తుచేస్తూ సీఎం ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని గొప్పలు చెప్పుకునే యత్నం చేశారు. రౌడీలు, అసాంఘిక శక్తుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రం శాంతివనంగా ఉండబట్టే, దేశ విదేశాల నుంచి పెట్టుబడుల్ని ఇక్కడ పెట్టేందుకు పెద్ద సంఖ్యలో సంస్థలు తరలివచ్చేందుకు సిద్ధం అవుతున్నాయని ఆశాభావం వ్యక్తంచేశారు. పోలీసుల నిత్యం ప్రజల కోసం శ్రమిస్తున్నారని వివరిస్తూ, వారిని విమర్శించడం కొందరు పనిగా పెట్టుకుని ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇక, రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని మోడరన్‌గా తీర్చిదిద్దనున్నామని ప్రకటించారు. ఆ మేరకు ఆధునికీకరణ, అత్యాధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం లక్ష్యంగా సైబర్ వేదిక ఏర్పాటు కానుందని వివరించారు. అలాగే, పోలీసులకు 54 వరాలను ప్రకటించారు. ఆ మేరకు చెన్నైలో ట్రాఫిక్ జరిమానా మోత మోగించేందుకు ఎలక్ట్రానిక్ స్పాట్ ఫైన్ పరికరాలను కొనుగోలు చేయనున్నారు. విధుల్లో వీరత్వం, సాహసం ప్రదర్శించిన పోలీసులకు అందించే సీఎం పతకం భత్యం రూ.300 నుంచి రూ.900లకు, పోలీసు పతకానికి రూ.200 నుంచి రూ.300కు పెంచారు. పోలీసుల కోసం ప్రత్యేక స్టోర్స్, కోయంబత్తూరు, సేలం, ధర్మపురిలో కొత్త పోలీసు స్టేషన్లు, అగ్నిమాపక సిబ్బందికి వైద్య ఖర్చుల పెంపు, ఖాళీల భర్తీలు, పదోన్నతులు తదితర అంశాలు ఆ వరాల్లో ఉన్నాయి.
మోనో రైలు, బ్యాటరీ బస్సు
సీఎం ప్రసంగానికి ముందుగా రవాణాశాఖ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్ ఓ ప్రకటన చేశారు. ఆమేరకు చెన్నైలో మోనో రైలు సేవకు తగ్గ పనులు త్వరలో చేపట్టనున్నామని వివరించారు. రూ.6,402 కోట్లతో ఈ పనులు సాగనున్నాయని తెలిపారు. పూందమల్లి–కత్తి పార, మార్గం మధ్యలో పోరూర్ నుంచి వడపళని వరకు రూ.3,267 కోట్లతో 20 కి.మీ దూరం మార్గం, వండలూరు నుంచి వేళచ్చేరి వరకు రూ.2,135 కోట్లతో 22 కి.మీ దూరం మార్గం పనులు చేపట్టనున్నామన్నారు. అలాగే, చెన్నైలో ప్రయోగాత్మకంగా బ్యాటరీ బస్సు సేవలకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
సీఎం వ్యాఖ్యల తొలగింపు
సభలో టాస్మాక్ ఆందోళన గురించి సీఎం పళని స్వామి ప్రసంగిస్తూ, ఆందోళనలు ఫ్యాషన్‌గా మారాయని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇందుకు ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ఆక్షేపణ వ్యక్తంచేశారు. ప్రజల పోరాటాలను ఫ్యాషన్‌గా సీఎం వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. దీంతో సీఎం వ్యాఖ్యలను సభ పద్దుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. ఇక, అసెంబ్లీలో తన పరిధిలోని శాఖల నిధుల కేటాయింపుల చర్చ ముగియడంతో సీఎం పళని స్వామి నేరుగా మెరీనా తీరం చేరుకున్నారు. అక్కడ దివంగత సీఎం, అమ్మ జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు.