దామోదర్‌కు అభినందనలు తెలుపుతున్న హోం మంత్రి నాయిని. చిత్రంలో మల్లారెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాల భవన నిర్మాణాలను నిర్మిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ వెల్లడించారు. పదవీ బాధ్యతలు స్వీకరించి సోమవారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తోడ్పాటుతో పోలీసుశాఖకు కొత్త భవనాలు, క్వార్టర్లు, ఠాణాల ఆధునీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 95 శాతం వృద్ధిరేటు సాధించామని, ఈ ఏడాది బడ్జెట్‌లో భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ. 464.46 కోట్లను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్‌కు మంజూరు చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ హౌసింగ్ కార్పొరేషన్‌పై ప్రభుత్వాలు దృష్టి సారించలేదని అన్నారు. పోలీసు భవనాలనే కాకుండా జైళ్ల, అగ్నిమాపకశాఖ, హార్టి్టకల్చర్ కాలేజీలు, ఇతర విభాగాల్లోని భవనాల నిర్మాణ బాధ్యతలనూ కార్పొరేషన్ చేపట్టడం గర్వకారణమన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో 13 జిల్లాల్లో పోలీస్ హెడ్‌క్వార్టర్లు(డీపీవో), పరేడ్ గ్రౌండ్స్, క్వార్టర్లు నిర్మిస్తున్నట్టు దామోదర్ తెలిపారు. సిద్దిపేటతోపాటు రామగుండం కమిషనరేట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 313 పోలీసు స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, 103 కొత్త ఠాణాలను నిర్మిస్తున్నామని, రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పోలీసు గెస్ట్‌హౌస్, వెల్ఫేర్ సెం టర్ నిర్మాణం జరుగుతోందన్నారు. సింగరేణి యాజమాన్యం సహాయంతో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్నామని చెప్పారు. నిర్మాణాలు పారదర్శకంగా జరగడంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఐజీ బి. మల్లారెడ్డి కృషి ఎంతో ఉందని, సీఈ గోపాలకృష్ణ, ఎస్‌ఈ విజయ్‌కుమార్ తో పాటు మిగిలిన సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని దామోదర్ కొనియాడారు.
సీఎం తోడ్పాటు మరువలేనిది: మల్లారెడ్డి
ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు హౌసింగ్ కార్పొరేషన్‌కు పెద్దగా గుర్తింపు లేదని, కానీ స్వరాష్ట్రం లో పక్కా నిర్మాణాలన్నింటినీ తామే చేపట్టడం గర్వంగా ఉందని కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. వరంగల్ కమిషనరేట్ నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు. నిర్మల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణ పనులను వేగంగా చేపడుతున్నట్లు చెప్పారు. గతేడాదిలో రూ. 220 కోట్ల పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి బిల్లు పంపించామని, ఇది మొత్తం పోలీస్ హౌసింగ్ చరిత్రలో రికార్డు అని మల్లారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తోడ్పాటు, కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ సూచనలతో హౌసింగ్ కార్పొరేషన్ మరిన్ని విజయాలు సాధించాలని మల్లారెడ్డి ఆకాం క్షించారు. అధికారులు, సిబ్బంది కృషి వల్లే నిర్మాణాలు, ఆధునీకరణ వేగవంతమవుతోందన్నారు. కాగా, పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో పోలీసుశాఖలో భవనాలు, హెడ్ క్వార్టర్ల నిర్మాణంలో క్రియాశీలపాత్ర పోషిస్తున్న దామోదర్‌తోపాటు అంకితభావంతో పనిచేస్తున్న ఐజీ, ఎండీ మల్లారెడ్డిని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment