పోలీసు స్టేషనా.. పార్టీ ఆఫీసా..!
► పాలక పార్టీ ఆఫీసులా మారిన పెదకాకాని పోలీస్‌స్టేషన్
► ప్రతిపక్షానికి చెందిన కుటుంబాల్లో మైనర్లపై కూడా కేసులు
► అధికార పార్టీ అరాచకాలకు విస్తుపోతున్న ప్రజలు
రాజధానిలో అధికార పార్టీ ఆగడాలకు ఇది పరాకాష్ట. పెద్దల మధ్య గొడవకు పార్టీ రంగు పులమడమే కాకుండా, ఆ వివాదంలో ప్రత్యర్థుల కుటుంబాలకు చెందిన మైనర్లపై కూడా కేసులు పెట్టించి స్టేషన్‌లో పెట్టించారు. ఓ కానిస్టేబుల్ అయితే మరీ అత్యుత్సాహం చూపించి ఓ బాలుడితో స్టేషన్‌లో మరుగుదొడ్డి కడిగించాడు. పెదకాకాని ఏకలవ్య కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
పెదకాకాని (పొన్నూరు): ఈనెల 8వ తేదీన ఏకలవ్య కాలనీకి చెందిన తోకల శివయ్య, మేడా వెంకటేశ్వర్లు, మేడా శ్రీను రోడ్డుపై మాట్లాడుతుండగా ఉసర్తి సాంబయ్య వచ్చి వైఎస్సార్ సీపీ ప్లీనరీకి రమ్మని అడిగాడు. అందుకు రాదల్చుకోలేదని చెప్పగా, వారిని సాంబయ్య తిట్టాడు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు మేడా శివయ్య, తన సోదరుడితో బజారు నుంచి వస్తుండగా ఉసర్తి శ్రీనివాస్, కార్తీక్ దారి ఇవ్వకుండా సైకిల్ అడ్డుపెట్టారు. అక్కడే ఉన్న ఉసర్తి సాంబయ్య మీటింగ్‌కు రానందుకు కర్రతో మేడా శివయ్యను తలపై కొట్టి గాయపరిచాడు. శివయ్యను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధితుని ఫిర్యాదు మేరకు ఉసర్తి సాంబయ్య, నాగేంద్రబాబు, సూరి, రాజేష్‌లతో పాటు మరో ఇద్దరు మైనర్ల పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు గురువారం స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు ఆరుగురిలో ఇద్దరు బాలురు ఉండడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైగా వారిలో ఒకరు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 10కి 10 జీపిఏ సాధించి ప్రస్తుతం ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. మరొక బాలుడు పెదకాకాని జిల్లా పరిషత్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. నలుగురు పెద్దలకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసి ఇద్దరు బాలుర వ్యవహారం పెండింగ్‌లో పెట్టి ఇంటికి పంపించారు.
దీనిపై బాధితులు గురువారం సాయంత్రం మంగళగిరి డీఎస్పీ రామాంజనేయులును కలసి జరిగిన ఉదంతాన్ని వివరించారు. ఈ కేసు వ్యవహారం తాను చూస్తానని, విచారించి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. పెదకాకాని పోలీసుస్టేషనా పార్టీ ఆఫీసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఓ కానిస్టేబుల్ తనతో పోలీస్‌స్టేషన్‌లో మరుగుదొడ్డి కడిగించాడని ఇంటర్ విద్యార్థి వాపోయాడు.