పోలీసులతో వాగ్వాదానికి దిగిన బాధిత కుటుంబీకులు (ఇన్‌సెట్) ఆదినారాయణ గౌడు
బేతంచెర్ల : సారా విక్రయిస్తున్నాడనే నెపంతో ఎస్‌ఐ తిరుపాలు దాడి చేయడంతో బేతంచెర్ల హనుమాన్‌నగర్ కాలనీకి చెందిన ఆదినారాయణ గౌడ్ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఎస్‌ఐ తీరుకు నిరసనగా బాధిత కుటుంబీకులు ఆదివారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుడి భార్య లక్ష్మి, కుమార్తె, కోడలు సుధారాణి, రమాదేవి వివరాల మేరకు.. ఆదినారాయణగౌడు నాటుసారా విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఇందుకు ప్రతిగా పోలీసులకు డబ్బులు ముట్టజెప్పేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి రూ.30 వేలు ఇవ్వాలని పోలీసులు ఫోన్ చేసి బెదిరించారు.
ఇవ్వకపోవడంతో ఆదివారం ఉదయం ఎస్‌ఐ తిరుపాలు ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వకుంటే కేసు పెడతానంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా అనారోగ్యంతో బాధపడుతున్న ఆదినారాయణపై చేయిచేసుకోవడంతో అతడు అక్కడే స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో అతన్ని పోలీసులే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులతోపాటు కాలనీవాసులంతా ప్రాథమిక చికిత్స అనంతరం ఆదినారాయణను పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్కడే ఆందోళన చేపట్టారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ మాట్లాడుతూ నాటు సారా విక్రయిస్తూ కేసుపెడతారనే సాకుతో స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారని తెలిపారు.