మన్నూరు పోలీసుస్టేషన్
రాజంపేట : నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట రూరల్ (మన్నూరు) పోలీసుస్టేషన్ ఎస్‌ఐలుకు అచ్చిరావడంలేదు. మన్నూరు పోలీసుస్టేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్న ఎస్‌ఐలు ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. సస్పెన్షన్ కావడమో..రాజకీయ బదిలీ...లేక వ్యక్తిగతగ ఫెయిల్యూర్స్‌తో ఎస్‌ఐలు స్టేషన్ వీడిపోతున్నారు. దీంతో ఇక్కడ పోస్టింగ్ అంటే ఎస్‌ఐలు వెనడుగు వేస్తున్నారు. మన్నూరు పోలీసుస్టేషన్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. లాకప్‌డెత్ నుంచి నేటి వరకు పనిచేసిన ఎస్‌ఐలు అనేక వివాదాలు, ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారంటే ఈ స్టేషన్ ప్రభావం ఏ పాటిదే అవగతమవుతుంది.
పరిధి విస్తారం..మానసిక ఒత్తిడిలు..
పేరుకే రూరల్ పోలీస్టేషన్..కానీ పరిధి విస్తా రం. ప్రజల కోసం పనిచేసే ఎస్‌ఐలకు రాజ కీయ ఒత్తిళ్లు అధికం అన్న విమర్శలున్నాయి. మన్నూరు పోలీసుస్టేషన్ పరిధి ఎక్కువుగా ఉండటంతో ఒక ఎస్‌ఐ విధులు నిర్వర్తించాలంటే కష్టమవుతోంది. ఇక్కడ పనిచేసే ఎస్‌ఐకు మానసిక ,విధి పరమైన ఒత్తిడిలతో కుటుంబాలతో గడపలేని పరిస్ధితులు దాపురించాయి. ఇటీవల మన్నూరు ఎస్‌ఐ మహేశ్‌నాయుడు భార్య ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలతో ఈ స్టేషన్ అంటేనే హడలెత్తిపోతున్నారు. వాస్తుపరంగా ఈస్టేషన్‌కు దోషాలు ఉన్నాయనే అనుమానాలు మన్నూరు పోలీసులను వేధిస్తున్నాయి.
పట్టణతరహాలో ఎస్‌హెచ్‌ఓ అవసరం..
రాజంపేట పట్టణపోలీసుస్టేషన్ తరహలో స్టేషన్‌హౌస్ ఆఫీసర్‌కు సీఐ స్ధాయి అధికారిని పోలీసుశాఖ నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే రూరల్ సీఐ ఉన్నప్పటికీ రాజంపేట నియోజకవర్గంలో ఒక మండలం రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు, పుల్లంపేట మండలాలు చూసుకోవాల్సి వస్తోంది. మన్నూరు పరిధిలో అధిక సంఖ్యలో గ్రామాలు, అటవీ పల్లెలు, పట్టణంతో పాటు అభివృద్ధి చెందుతున్న బోయనపల్లె, పలు ఉన్నత విద్యాసంస్ధలు, చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్ధితిలో ఈ స్టేషన్‌ను ఒక ఎస్‌ఐ మెయింటెన్ చేయడం కష్టంగా ఉందని పోలీసులు అంటున్నారు.
ఇప్పటివరకు ఎవరెవరు..
ఇప్పటి వరకు మన్నూరు పోలీసుస్టేషన్‌లో అనేక మంది సీఐలు, ఎస్‌ఐలు పనిచేసినప్పటికి వివాదాలు నడుమ వెళ్లిపోవడం ఈ స్టేషన్ సంప్రదాయం. 1998 నుంచి తీసుకుంటే మునిరామయ్య, గోరంట్ల మాధవ్, సయ్యద్ సాబ్జాన్, శాంతుడు, ఓవీ రమణ, రామచంద్రారెడ్డి, జెవీఎస్ సత్యనారాయణ, ఎం.కృష్ణారెడ్డి, పి.చంద్రశేఖర్, రెడ్డప్ప, కృష్ణయ్య, కృష్ణమోహన్, డి.శ్రీనివాస్, ఎస్వీనరసింహారావు, మధుసూదన్‌రెడ్డి, సుధాకర్, మహమ్మద్‌రఫి, ప్రవీణ్‌కుమార్, ఎన్వీనాగరాజు, పి.మహేశ్‌లు పనిచేశారు. వీరిలో సగానికిపైగా పోలీసు అధికారులు అనవసర వివాదాల్లో చిక్కుకొని ఇక్కడి నుంచి వీఆర్, బదిలీలో వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు.
మన్నూరు పోలీసుస్టేషన్ ఎక్కడుండాలి...
మన్నూరు పోలీసుస్టేషన్ రూరల్ పరిధిలో కాకుండా పట్టణంలోని పట్టణ పోలీస్ క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్నారు. గతంలో హరితహోటల్ సమీపంలో ఉన్న మన్నూరు పోలీసుస్టేషన్‌ను నిర్మాణ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పేల్చేశారు.బోయనపల్లె మెయిన్‌రోడ్డులోని పీఓబి, ఎర్రబల్లి వద్ద స్థలాలు ఉన్నాయి. అక్కడ నిర్మించేందుకు పోలీసు బాస్‌లు ఆలోచన చేయడంలేదు. ప్రస్తుతం ఉన్నచోటు నుంచి మరోచోటుకు తరలించాలని అధికారులను స్టేషన్‌లో పని చేస్తున్న పోలీసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment