మదనపల్లెలో మూడుముక్కలాట.. రాజంపేటలో రచ్చరచ్చ | Rift in TDP: Annamayya District TDP Leaders Paid Their Tribute to NTR Separately | Sakshi
Sakshi News home page

మదనపల్లెలో మూడుముక్కలాట.. రాజంపేటలో రచ్చరచ్చ

Published Thu, Jan 19 2023 6:40 PM | Last Updated on Thu, Jan 19 2023 6:52 PM

Rift in TDP: Annamayya District TDP Leaders Paid Their Tribute to NTR Separately - Sakshi

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి సందర్భంగా బుధవారం అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య  విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్‌ విగ్రహాల సాక్షిగా వాగ్వాదాలకు, ఘర్షణలకు తెర తీశారు. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరువు కాస్తా మరింత దిగజారిపోయిందనే ఆవేదన ఆ పార్టీ  శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. 

సాక్షి, రాయచోటి: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది. ఆధిపత్య పోరులో ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించేందుకు తహతహలాడుతున్నారు. అధినేత వద్ద మెప్పుకోసం ఒకరు.. అధిష్టానంలో పలుకుబడి కోసం మరొకరు అన్నట్లు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా  తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం తప్పడం లేదు.  ఎక్కడ చూసినా ప్రధాన నేతల మధ్య వర్గ విభేదాలతో ఉన్న కాస్త పార్టీ పరువు గంగలో కలుస్తోంది. జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేక అల్లాడిపోతున్న టీడీపీకి ఈ వర్గ విభేదాలు మరింత తలనొప్పిగా తయారయ్యాయి. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కార్యక్రమాలు నిర్వహించడంతో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. 


ఎవరికి వారే... యమునా తీరే! 

జిల్లా కేంద్రమైన రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి లక్కిరెడ్డిపల్లెలో కార్యక్రమం నిర్వహించగా, నియోజకవర్గ, టిక్కెట్‌ ఆశిస్తున్న టీడీపీ నేతలు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబులు ప్రత్యేకంగా ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గురు కలిసి ఒకేచోట పాల్గొన్న పరిస్థితులు కనిపించలేదు. నేతలు తలోదారి కావడంతో తమ్ముళ్లు కూడా ఎవరికి తోచిన రీతిలో ఏ వర్గానికి ఇష్టమున్న నాయకుడిని పిలిపించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు.

మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టీడీపీ ఎంపీ అభ్యర్థి హరహరిలు పలుచోట్ల కార్యక్రమాల్లో పాల్గొంటే, మిగిలిన వర్గాలు పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు.  అలా వివిధ చోట్ల నాయకులు ఎవరికి వారుగా నిర్వహించడంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రాజంపేటలోనూ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తే, మరో వర్గానికి చెందిన టీడీపీ నేత జగన్‌మోహన్‌రాజు విడిగా తన వర్గంతోకలిసి  ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. చిట్వేలిలోనూ కస్తూరి విశ్వనాథనాయుడు, పంతగాని నరసింహప్రసాద్‌ వర్గాల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించింది.   


చిట్వేలిలో చీలిన నాయకులు.. 

చిట్వేలి: రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలో బుధవారం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించే విషయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు, పంతగాని నరసింహ ప్రసాద్‌ వర్గాల మధ్య వాదనలు చోటుచేసుకున్నాయి. మధ్యవర్తుల సూచన మేరకు కొంతసేపటి తర్వాత వివాదం సద్దుమణిగింది. కస్తూరి వచ్చి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వెళ్లిపోగా, అనంతరం నరసింహ ప్రసాద్‌ వచ్చి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఎన్టీఆర్‌ చిత్రపటం పెట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.   


మదనపల్లెలో మూడుముక్కలాట 

మదనపల్లె:  నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ తొలుత పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈలోపు రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటానరహరి మదనపల్లెలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం అందడంతో దొమ్మలపాటిరమేష్‌ ఆయన కోసం అక్కడే ఎదురుచూడసాగారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ భర్త రాటకొండ బాబురెడ్డి తన అనుచరులతో కలిసి ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వచ్చి నియోజకవర్గ ఇన్‌చార్జి దొమ్మలపాటి రమేష్‌ను మాటవరుసకైనా పలుకరించకుండానే పూలమాల వేసి నివాళులర్పించారు.


తర్వాత ఎంపీ అభ్యర్థి గంటానరహరి తంబళ్లపల్లె ఇన్‌చార్జి శంకర్‌తో కలిసి వచ్చి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తర్వాత దొమ్మలపాటి రమేష్‌ ఆయన వాహనంలో ఎక్కి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన రక్తదానశిబిరం ప్రా రంభోత్సవానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా గంటా నరహరి రాజంపేట టీడీపీ పార్లమెంట్‌ కార్యాలయంలో జిల్లా ప్రధానకార్యదర్శి యాలగిరి దొరస్వామినాయుడు ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే దీనిని జరగనీయకుండా, ఆలస్యం చేయించి తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు దొమ్మలపాటి రమేష్‌ గంటానరహరిని మండలంలోని సీటీఎంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి తీసుకెళ్లారని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాగా మరో ఎమ్మెల్యే ఆశావహుడు శ్రీరామినేని జయరామనాయుడు శివనగర్‌లోని తన కార్యాలయంలో వర్ధంతి వేడుకలు నిర్వహించి, చీకలబైలు సర్పంచ్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానంలో పాల్గొన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌.జే.వెంకటేష్‌ నిమ్మనపల్లె సర్కిల్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  


రాజంపేటలో రచ్చరచ్చ 

రాజంపేట: నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నేతలు వేర్వేరుగా బుధవారం నివాళులు అర్పించారు. ర్యాలీలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, మరో ఆశావహుడు చమర్తి జగన్‌మోహన్‌రాజులు తమ వర్గీయులతో వేర్వేరుగా పలు మండలాల్లో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో బత్యాలకే టికెట్‌ అని ఆయన వర్గీయులు, కాదు చమర్తికే టికెట్‌ అని ప్రత్యర్థి వర్గీయులు గళం విప్పారు. (క్లిక్ చేయండి: ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement