Manuru
-
మంజీరలో ఏఓ గల్లంతు?
మనూరు(నారాయణఖేడ్): సంగారెడ్డిలోని రైతు శిక్షణకేంద్రంలో అరుణ(34) ఏఓగా పనిచేస్తోంది. గురువారం సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్‌కు వస్తున్న క్రమంలో మనూరు మండలం రాయిపల్లి వద్ద మంజీరలోకి దూకి ఆత్మహత్య చేసుకొంటున్నట్లు నారాయణఖేడ్ మండలం పైడిపల్లిలోని వరుసకు తమ్ముడైన పవన్‌కు ఫోన్ చేసింది. విషయం తెలుసుకున్న కుంటుంబ సభ్యులు వంతెన వద్దకు చేరుకున్నారు. వంతెనవద్ద ఉన్న టీఎస్15 ఈడీ0403 కారులో యువతి హ్యండ్‌బ్యాగు, చెప్పులు ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున ఎస్ఐ నరేందర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీంతో చుట్టుపక్కలవారితో విచారించారు. ఆమె కోసం నదిలో గాలింపు చేపట్టారు. యువతి ఆచూకీ లభించకపోవడంతో తమ్ముడు శేరి శివకుమార్ ఫిర్యాదుమేరకు గల్లంతు కేసుగా నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు. కాగా సంఘటన స్థలానికి ఖేడ్ సీఐ రవీందర్‌రెడ్డి, రాయికోడ్ ఎస్ఐ ఏడుకొండలు చేరుకుని వివరాలు అడిగితెలుసుకున్నారు. అలుముకున్న విషాదఛాయలు అరుణ గల్లంతుతో ఖేడ్‌లో విశాద ఛాయలు అలుముకున్నాయి. ఈమె గతంలో మనూరు, నారాయణఖేడ్, కల్హేర్ ఏఓగా పనిచేసింది. 2016లో మోర్గికి చెందిన శివశంకర్‌తో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు రుద్రవీర్, 11 నెలల విరాట్ ఉన్నారు. -
ఆ పోలీసుస్టేషన్ అంటే ఎస్ఐలకు దడ !
రాజంపేట : నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట రూరల్ (మన్నూరు) పోలీసుస్టేషన్ ఎస్ఐలుకు అచ్చిరావడంలేదు. మన్నూరు పోలీసుస్టేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్న ఎస్ఐలు ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. సస్పెన్షన్ కావడమో..రాజకీయ బదిలీ...లేక వ్యక్తిగతగ ఫెయిల్యూర్స్‌తో ఎస్ఐలు స్టేషన్ వీడిపోతున్నారు. దీంతో ఇక్కడ పోస్టింగ్ అంటే ఎస్ఐలు వెనడుగు వేస్తున్నారు. మన్నూరు పోలీసుస్టేషన్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. లాకప్‌డెత్ నుంచి నేటి వరకు పనిచేసిన ఎస్ఐలు అనేక వివాదాలు, ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారంటే ఈ స్టేషన్ ప్రభావం ఏ పాటిదే అవగతమవుతుంది. పరిధి విస్తారం..మానసిక ఒత్తిడిలు.. పేరుకే రూరల్ పోలీస్టేషన్..కానీ పరిధి విస్తా రం. ప్రజల కోసం పనిచేసే ఎస్ఐలకు రాజ కీయ ఒత్తిళ్లు అధికం అన్న విమర్శలున్నాయి. మన్నూరు పోలీసుస్టేషన్ పరిధి ఎక్కువుగా ఉండటంతో ఒక ఎస్ఐ విధులు నిర్వర్తించాలంటే కష్టమవుతోంది. ఇక్కడ పనిచేసే ఎస్ఐకు మానసిక ,విధి పరమైన ఒత్తిడిలతో కుటుంబాలతో గడపలేని పరిస్ధితులు దాపురించాయి. ఇటీవల మన్నూరు ఎస్ఐ మహేశ్‌నాయుడు భార్య ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలతో ఈ స్టేషన్ అంటేనే హడలెత్తిపోతున్నారు. వాస్తుపరంగా ఈస్టేషన్‌కు దోషాలు ఉన్నాయనే అనుమానాలు మన్నూరు పోలీసులను వేధిస్తున్నాయి. పట్టణతరహాలో ఎస్హెచ్ఓ అవసరం.. రాజంపేట పట్టణపోలీసుస్టేషన్ తరహలో స్టేషన్‌హౌస్ ఆఫీసర్‌కు సీఐ స్ధాయి అధికారిని పోలీసుశాఖ నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే రూరల్ సీఐ ఉన్నప్పటికీ రాజంపేట నియోజకవర్గంలో ఒక మండలం రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు, పుల్లంపేట మండలాలు చూసుకోవాల్సి వస్తోంది. మన్నూరు పరిధిలో అధిక సంఖ్యలో గ్రామాలు, అటవీ పల్లెలు, పట్టణంతో పాటు అభివృద్ధి చెందుతున్న బోయనపల్లె, పలు ఉన్నత విద్యాసంస్ధలు, చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్ధితిలో ఈ స్టేషన్‌ను ఒక ఎస్ఐ మెయింటెన్ చేయడం కష్టంగా ఉందని పోలీసులు అంటున్నారు. ఇప్పటివరకు ఎవరెవరు.. ఇప్పటి వరకు మన్నూరు పోలీసుస్టేషన్లో అనేక మంది సీఐలు, ఎస్ఐలు పనిచేసినప్పటికి వివాదాలు నడుమ వెళ్లిపోవడం ఈ స్టేషన్ సంప్రదాయం. 1998 నుంచి తీసుకుంటే మునిరామయ్య, గోరంట్ల మాధవ్, సయ్యద్ సాబ్జాన్, శాంతుడు, ఓవీ రమణ, రామచంద్రారెడ్డి, జెవీఎస్ సత్యనారాయణ, ఎం.కృష్ణారెడ్డి, పి.చంద్రశేఖర్, రెడ్డప్ప, కృష్ణయ్య, కృష్ణమోహన్, డి.శ్రీనివాస్, ఎస్వీనరసింహారావు, మధుసూదన్‌రెడ్డి, సుధాకర్, మహమ్మద్‌రఫి, ప్రవీణ్‌కుమార్, ఎన్వీనాగరాజు, పి.మహేశ్‌లు పనిచేశారు. వీరిలో సగానికిపైగా పోలీసు అధికారులు అనవసర వివాదాల్లో చిక్కుకొని ఇక్కడి నుంచి వీఆర్, బదిలీలో వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు. మన్నూరు పోలీసుస్టేషన్ ఎక్కడుండాలి... మన్నూరు పోలీసుస్టేషన్ రూరల్ పరిధిలో కాకుండా పట్టణంలోని పట్టణ పోలీస్ క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్నారు. గతంలో హరితహోటల్ సమీపంలో ఉన్న మన్నూరు పోలీసుస్టేషన్‌ను నిర్మాణ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పేల్చేశారు.బోయనపల్లె మెయిన్‌రోడ్డులోని పీఓబి, ఎర్రబల్లి వద్ద స్థలాలు ఉన్నాయి. అక్కడ నిర్మించేందుకు పోలీసు బాస్‌లు ఆలోచన చేయడంలేదు. ప్రస్తుతం ఉన్నచోటు నుంచి మరోచోటుకు తరలించాలని అధికారులను స్టేషన్లో పని చేస్తున్న పోలీసులు కోరుతున్నారు. -
మాటల యుద్ధం
మనూరు : మనూరులో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం ముగింపులో మనూరు సర్పంచ్ మారుతిరెడ్డి లేచి పట్టపగలు విద్యుత్ దీపాలు వెలుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఏఈ మాణిక్యం మాట్లాడుతూ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందన్నారు. పంచాయతీ నిధులు వెచ్చిస్తే ప్రత్యేక లైన్ వేసేందుకు చర్యలు తీసుకుంటాన్నారు. ‘ప్రభుత్వం మెడలు వంచి విద్యుత్ బిల్లు తీసుకుంటోంది. మీరేం చేస్తున్నారు ’అని సర్పంచ్ పేర్కొనడంతో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. విద్యుత్ బల్బుల సమస్య నేటిది కాదని గత ప్రభుత్వం నుంచి వస్తోందని అన్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదనడంతో సర్పంచ్ మారుతిరెడ్డి మాట పెంచారు. ఎమ్మెల్యే, సర్పంచ్ల మధ్య మాటల యుద్ధ వాడివేడిగా సాగింది. బెల్లాపూర్ ఎంపీటీసీ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ప్రశ్నించకుండా ఇప్పు అగడమేంటని, కాంగ్రెస్ హయాంలో దోచుకున్నారని ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. జెడ్పీటీసీ నిరంజన్, ఎంపీపీ లక్ష్మిగణపతి ఎంత జోక్యం చేసుకున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. పోలీసులు సమావేశ మందిరం వద్దకు వచ్చి పరిస్థితిని పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్ మారుతిరెడ్డి మాట తీరు సరికాదన్నారు. అనవసరమైన మాటలతో అభివృద్ధిని ఆటంకపర్చరాదని అన్నారు. ఎంపీపీ ఉపాధ్యక్షుడు గడ్డె రమేశ్ జోక్యం చేసుకుని కాంగ్రెస్ నాయకులను విమర్శించడం సమంజసం కాదన్నారు. ఓ దశలో వ్యక్తిగత విమర్శలకు దారి తీసే పరిస్థితి వచ్చింది. సభలో తీవ్ర గందరగోళం, ఉత్కంట నెలకొంది. ఎంపీపీ జోక్యం చేసుకుని సర్పంచ్‌ను సముదాయిండంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
జాతరలో ఇరువర్గాల ఘర్షణ
మనూరు : ఆటోల పార్కింగ్ విషయమై ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ కత్తులు, వేటకొడవళ్లు, రాళ్లతో దాడులకు దారి తీసింది. ఈ ఘటనను నివారించేందుకు యత్నించిన ఏఎస్ఐ, వీఆర్ఏలు గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని బోరంచ నల్లపోచమ్మ జాతరలో గురువారం చోటు చేటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రామం, కర్ణాటకలోని సిరికంగ్టి గ్రామాలకు చెందిన భక్తులు గురువారం జాతరకు హాజరయ్యారు. కాగా.. వీరు పక్క పక్కనే బస చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఆటోల పార్కింగ్ విషయం లో వీరి మధ్య మాట మాట పెరిగింది. దీంతో కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తులు ఒక్కసారిగా ఝరాసంగం గ్రామానికి చెందిన భక్తులపై దాడులకు పాల్పడ్డారు. వారి వెంట తీసుకువచ్చిన కత్తులు, వేట కొడవళ్లు, రాళ్లతో దాడులు జరపడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోచమ్మ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ముజీబుద్దీన్, మరో ఇద్దరు కానిస్టేబుళ్ల, వీఆర్ఏ ముక్తర్లు ఘటనా స్థలానికి చేరుకుని గొడవను నివారించే ప్రయత్నం చేయ గా.. వారిపై కూడా కర్ణాటకకు చెందిన భక్తులు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఏఎస్ఐ, వీఆర్ఏలు గాయపడ్డారు. వీరి తో పాటు ఝరాసంగానికి చెందిన పెం టమ్మ (45), ఆటోడ్రైవర్ దశరథ్ (25), నిర్మల, మల్లేశంలకు తీవ్రగాయాలయ్యా యి. కాగా.. ఝరాసంఘానికి చెందిన పెంటమ్మ బంగారు ఆభరణాలు సైతం లాక్కున్నట్లు సమాచారం. పట్టించుకోని పోలీసు ఉన్నతాధికారులు? మద్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన గొడువ అరగంట తర్వాత అదుపు తప్పడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ విషయాన్ని మనూరు స్టేషన్‌కు సమాచారం అందించారు. అ యితే రెండు గంటల తరువాత కానిస్టేబుళ్లను జాతర వద్దకు వచ్చి ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
యువతతోనే అభివృద్ధి సాధ్యం
మనూరు, న్యూస్‌లైన్: యువతతోనే అభివృద్ధి సాధ్యమని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి అప్పారావు షెట్కార్ అన్నారు. మనూరు మండలం నాగల్గిద్దలో వివిధ పార్టీలకు చెందిన యువకులు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో యువత కీలకంగా మారిందన్నారు. మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్‌లో యువకులు విద్యావంతులుగా తయారుకావాల్సిన అవసరముందన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే అది కేవలం యువత చేతుల్లోనే ఉందని సూచించారు. యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమన్నారు. గత ఐదేళ్లలో నాగల్గిద్ద గ్రామం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని, ఇది ముమ్మాటికి పాలకుల నిర్లక్ష్యమేనని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. తనకు ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశమిస్తే గ్రామంతోపాటు నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా మొహియొద్దీన్ను, ఖేడ్ అసెంబ్లీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. పార్టీలోకి చేరిన వారిలో నరేశ్, భీందాస్, కృష్ణ, దిగంబర్‌రావు, రమేశ్, సంతోష్, దత్తు, సంగమేశ్వర్, ప్రకాశ్ తదితరులు చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నరేశ్ యాదవ్, అంబదాస్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి క్షేత్రాలపై ఎక్సైజ్ దాడులు
మనూరు, న్యూస్‌లైన్: మండల పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా సాగవుతున్న గంజాయి క్షేత్రాలపై ఎక్సైజ్ అధికారులు మంగళవారం దాడులు చేశారు. ఎనక్‌పల్లి పంచాయతీ మధిర గ్రామమైన ఉట్పల్లి శివారుల్లోని గట్టుపై రెండు ఎకరాల్లో సాగవుతున్న గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేశారు. అనంతరం కరస్‌గుత్తి పంచాయతీ పరిధిలోని రేఖ్యనాయక్ తండాలో ఎకరం విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయి ధ్వంసం చేశారు. ఈ రెండు గ్రామాల్లో సుమారు 3 లక్షల గంజాయి మొక్కలను ఎక్సైజ్ సిబ్బంది ధ్వంసం చేసినట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ శశిధర్‌రెడ్డి తెలిపారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.1.5 కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గంజాయి సాగుచేస్తున్న భూ యజమానులను రెవెన్యూ రికార్డుల ఆధారంగా గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో దాడుల్లో ఎక్సైజ్ సీఐలు రామకృష్టారెడ్డి, రజాక్, ధనంజయ్, ఎస్ఐలు సురేందర్, ఎల్లాగౌడ్, సూర్యప్రకాశ్, జాన్సన్, నాగేందర్, భీమేశ్వర్, మురళీధర్లతోపాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.