మనూరు, న్యూస్‌లైన్: మండల పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా సాగవుతున్న గంజాయి క్షేత్రాలపై ఎక్సైజ్ అధికారులు మంగళవారం దాడులు చేశారు. ఎనక్‌పల్లి పంచాయతీ మధిర గ్రామమైన ఉట్‌పల్లి శివారుల్లోని గట్టుపై రెండు ఎకరాల్లో సాగవుతున్న గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేశారు. అనంతరం కరస్‌గుత్తి పంచాయతీ పరిధిలోని రేఖ్యనాయక్ తండాలో ఎకరం విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయి ధ్వంసం చేశారు. ఈ రెండు గ్రామాల్లో సుమారు 3 లక్షల గంజాయి మొక్కలను ఎక్సైజ్ సిబ్బంది ధ్వంసం చేసినట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ శశిధర్‌రెడ్డి తెలిపారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1.5 కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గంజాయి సాగుచేస్తున్న భూ యజమానులను రెవెన్యూ రికార్డుల ఆధారంగా గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో దాడుల్లో ఎక్సైజ్ సీఐలు రామకృష్టారెడ్డి, రజాక్, ధనంజయ్, ఎస్‌ఐలు సురేందర్, ఎల్లాగౌడ్, సూర్యప్రకాశ్, జాన్సన్, నాగేందర్, భీమేశ్వర్, మురళీధర్‌లతోపాటు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.