ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్ద రోధిస్తున్న కుమార్తెలు
ధర్మవరం అర్బన్ : ‘నా భర్తను ఒక్క సారి చూపించండి సార్. నా భర్తను మూడురోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారు. ఇంత వరకు ఎక్కడున్నాడో తెలియలేదు. నా భర్తకు గుండెజబ్బు ఉంది. రోజూ 5 మాత్రలు మింగాలి. నాకు ఐదుగురు పిల్లలు. తండ్రిని చూడాలని పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. ధర్మవరం, కొత్తచెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి ఇలా అన్ని పోలీస్‌స్టేషన్లకు తిరుగుతున్నా నా భర్త ఏ స్టేషన్‌లో ఉన్నాడో పోలీసులు చెప్పలేదంటూ పట్టణంలోని బోయవీధికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు వడ్డె శ్రీనివాసులు భార్య వేదవతి కన్నీటి పర్యంతమైంది.
తీవ్ర మనస్థాపంతో అనారోగ్యానికి గురైన వేదవతి శనివారం రాత్రి ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో తన గోడును వెళ్లబోసుకుంది. తన భర్త , వైఎస్సార్‌సీపీ నాయకుడు వడ్డె శ్రీనివాసులును మూడురోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారు. బాంబుదాడి కేసులో ప్రధాన నిందితుడైన ఉపేంద్రను ఎవరో వెంబడించారని పోలీసులు తన భర్తను తీసుకెళ్లారు. తన భర్తతో ఒక్కసారి మాట్లాడించాలని పోలీసుల కాళ్లు పట్టుకుంటే చివరికి శనివారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడించారని చెప్పింది. ఫోన్‌లో తన భర్త చాలా బాధగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు తన భర్తను చిత్రహింసలు పెడుతున్నారని, ఏ స్టేషన్‌లో పెట్టారో చెప్పకుండా పోలీసులు నరకయాతన పెడుతున్నారని వాపోయింది. తన భర్తకు ఏమైనా జరిగితే పిలలతో పాటు తాను కూడా అనాథలమవుతామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment