‘దందా’ పోలీసు! | Private settlements in srikakulam district police stations | Sakshi
Sakshi News home page

‘దందా’ పోలీసు!

Published Wed, Jul 26 2017 4:37 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

‘దందా’ పోలీసు! - Sakshi

‘దందా’ పోలీసు!

♦  పోలీసుస్టేషన్లలో ప్రైవేట్‌ సెటిల్‌మెంట్‌లు
అధికార పార్టీ నేతల కనుసన్నల్లో విధులు
ఆరోపణలొస్తున్నా బదిలీ లేకుండా తిష్ఠ
స్టేషన్ల సుందరీకరణ ముసుగులో నొక్కుళ్లు
వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని  తోటి పోలీసుల్లో ఆవేదన
కొత్త బాస్‌ త్రివిక్రమ వర్మ ఓ లుక్‌ వేయాల్సిందే!


సీఎం త్రివిక్రమవర్మ... జిల్లా పోలీసు బాస్‌గా బ్రహ్మారెడ్డి స్థానంలో బాధ్యతలు స్వీకరించి బుధవారానికి నెల పూర్తవుతోంది! తొలి రోజు నుంచే ఆయనకు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి! వాటిలో మిగతావాటి మాటెలా ఉన్నా సొంత శాఖనే ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఎదురైంది! అధికార పార్టీ నేతల అండదండలతో చెలరేగిపోతున్న ఇద్దరు పోలీసు అధికారులను ఇటీవలే వీఆర్‌కు పంపించిన ఆయన తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు! కేసు నమోదులో నిర్లక్ష్యం వహించిన మరో ఇద్దరు పోలీసులపై కొరడా ఝుళిపించారు! వారే గాకుండా కొంతమంది స్టేషన్‌ అధికారులు ఏళ్ల తరబడి పాతుకుపోయి పోలీసు శాఖకే మచ్చ తెస్తున్నారని తోటి పోలీసులే లోలోన ఆవేదన చెందుతున్నారంటే పరిస్థితి ఊహించవచ్చు! అలాంటివారిని కొత్త బాస్‌ ఎలా  దారిలో పెడతారో వేచి చూడాల్సిందే!

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లా పోలీసు శాఖను సంస్కరించాలనే డిమాండ్లు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. కొన్ని పోలీసుస్టేషన్లు ప్రైవేట్‌ సెటిల్‌మెంట్‌లకు వేదికగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులెవ్వరైనా స్టేషన్‌కొచ్చి ఫిర్యాదు ఇస్తే చాలు... ఇరు పార్టీల నుంచి దండిగా వసూళ్లకు పాల్పడుతున్న పోలీసు అధికారులు ఉన్నారు. కేసులు నీరుగార్చేస్తున్నారు. తాము చెప్పినదానికల్లా తలూపుతూ అడుగులకు మడుగులొత్తుతారనే ఉద్దేశంతోనే అధికార పార్టీ నాయకులు కూడా వారికి అండగా నిలబడుతున్నారు! ఎస్పీ బంగళా, జిల్లాలో పలు పోలీసుస్టేషన్ల ఆధునికీకరణ ముసుగులో వ్యాపారులు, పారిశ్రామికవేత్తల నుంచి భారీగా వసూలు చేసి దిగమింగిన పోలీసు అధికారులపై సైతం ఈగ కూడా వాలకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కొంతమందికి నేరగాళ్లతో తెరవెనుక సంబంధాలున్నాయనే ఆరోపణలు ఇటీవల కాలంలో వినిపిస్తున్నాయి.

లీలల్లో మచ్చుకు కొన్ని....
జిల్లా కేంద్రం శ్రీకాకుళం నగరంలోని రెండు పోలీసుస్టేషన్లలో ఇటీవలి వరకూ పనిచేసిన ఇద్దరు పోలీసు అధికారులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లోని ఇసుక ర్యాంపుల్లో అక్రమార్కుల నుంచి ఓ అధికారి బాగానే వసూలు చేశారట! తన జేసీబీని వమరవల్లికి చెందిన ఓ జేసీబీ యాజమానికి అప్పగించి అద్దె రూపేణా బాగానే ఆర్జించారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కూడా ఆయనకు బాగానే కలిసొచ్చింది. అలాగే మరో సర్కిల్‌ స్థాయి అధికారిది ముడుపుల వసూళ్లలో అందెవేసిన చేయి. ఇరు పార్టీల నుంచి ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు వచ్చినా దీర్ఘకాలం నగరంలో తిష్ట వేయడం ఆయనకే చెల్లింది.

అంతకాలం ఉన్నా పరిష్కారమైన, దర్యాప్తు పూర్తయిన కేసు ఒక్కటీ లేదంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్ల క్రితం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోనే ఇద్దరు గుమస్తాలు రూ.70 లక్షల వరకు స్వాహా చేసిన కేసు ఈయన హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది.  ఇటీవల రిమ్స్‌లో సుమారు రూ.3 లక్షల విలువైన ఎండోస్కోపీలో ఒక ముఖ్య పరికరం మాయమైన కేసునూ నీరుగార్చేయడం ఆయనకే చెల్లింది. నగరంలోని ఓ హోటల్‌లో విశ్రాంత పోలీస్‌ ఉద్యోగి కుమారుడి హత్యలో కూడా నిందితుల నుంచి భారీగా నొక్కేశాడనే విమర్శలూ ఆయనపై వచ్చాయి.

 ఎచ్చెర్ల పోలీసుస్టేషన్‌లో పనిచేసిన ఓ ఎస్సైపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఓ ఐపీఎస్‌ అధికారితో విచారణకు డీఐజీ కార్యాలయం నుంచే ఆదేశాలు రావడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణాదారుల నుంచే గాకుండా పెట్రోల్‌ బంకులు, మద్యం దుకాణాల యజమానుల నుంచి వసూళ్లు, పరిశ్రమల యాజమాన్యాలకు తొత్తుగా వ్యవహరించడం వంటి ఆరోపణలు అతనిపై వెల్లువెత్తాయి.

∙ రాజాం సర్కిల్‌ స్టేషన్‌ పరిధిలో కేసు పెట్టినా, కేసు ఉపసంహరించుకోవాలనుకున్నా ఓ సర్కిల్‌ స్థాయికి ముడుపులు చెల్లించాల్సిందే. ఇదే అదనుగా కొంతమంది కానిస్టేబుళ్లు సాయంత్రం సమయాల్లో పట్టణానికి సమీపంలో వాహనాలను తనిఖీ సాకుతో ఆపి వసూళ్లకు అలవాటు పడ్డారు. రాత్రివేళల్లో దాబాల వద్దకు చేరి నిర్వాహకుల నుంచి వసూళ్లు జరపడం షరా మామూలుగా మారింది. రూరల్‌ స్టేషన్‌కు చెందిన ఓ అధికారి కూడా మామూళ్లకు మారుపేరుగా మారారు. రోడ్డు ప్రమాదం జరిగితే చాలు ఇటు నిందితులు, అటు బాధితుల నుంచి ఎంతోకొంత నొక్కేయడంలో ఆయన సిద్ధహస్తుడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
∙టెక్కలి సర్కిల్‌ స్టేషన్‌లో మూడేళ్లుగా పాతుకుపోయిన ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు అనేకం వస్తున్నాయి. ఆయనకు అధికార పార్టీలో ఓ ముఖ్య నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయి. వైన్స్, మైన్స్‌ వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు భారీగానే దండేస్తున్నా ఆయనను దండించేవారే కరువయ్యారనేది బాధితుల ఆవేదన.

 కాశీబుగ్గ డివిజనల్‌ సర్కిల్‌ పరిధిలో కొంతమంది పోలీసు అధికారులు ఒక్కటై దందా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భూమి కబ్జాలు, స్థల వివాదాలు, అక్రమ వ్యాపారాలు, దొంగ రవాణా... ఇలా ఏదైనా సరే సెటిల్‌మెంట్‌లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జీడిపప్పు రైలులో రవాణా చేయాలన్నా, పశువులను అక్రమంగా లారీలోకి ఎక్కించాలన్నా, గుట్కా గుట్టుగా సరిహద్దు దాటిపోవాలన్నా అక్రమార్కులు వారిని కలిస్తే సరిపోతుందట! కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు  కార్పొరేట్‌ హంగుల పేరుతో ఓ అధికారి అన్ని రకాల వ్యాపారుల నుంచే గాకుండా చివరకు రాజకీయ నాయకుల నుంచి కూడా భారీగానే వసూలు చేశారంట!

వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్‌ పూర్తిగా అధికార పార్టీ కార్యాలయంగా మారిపోయందనే విమర్శలు మార్మోగుతున్నాయి. ఇక్కడి అధికారి ఒకరు ఏకంగా ఇసుక, మద్యం, గనుల వ్యాపారుల నుంచి నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల నుంచి, వారు ఫిర్యాదు ప్రకారం నిందితుల నుంచి ఇరువైపులా కేసు తీవ్రతను బట్టి రూ.2 వేల నుంచి రూ.50 వేల వరకూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొనేందుకు ఏసీబీ ఇటీవల వలవేసినా చివరి నిమిషంలో తప్పించుకున్నారని తెలిసింది.  

అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తడంలో పాతపట్నం, మెళియాపుట్టి పోలీసుస్టేషన్లలో కొంతమంది పోలీసులను మించినవారు లేరనే విమర్శలు వస్తున్నాయి. గంజాయి, ఎర్ర చందనం అక్రమంగా సరిహద్దు దాటిపోతున్నా వీరిపై ఈగ కూడా వాలకపోవడానికి కారణం కూడా అదేనన్న ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement