ముండ్లగిరి కిశోర్ మృతదేహం
సుజాతనగర్ : గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆటోను పోలీసుల వాహనం ఢీకొంది. యువకుడిని బలిగొంది. కొణిజర్ల మండలానికి చెందిన ముండ్లగిరి కిశోర్(23), యామాల ప్రవీణ్, తంబళ్ళ అశోక్, ముత్తమాల కిశోర్, కాసిమల్ల రాజేష్.. ఎయిర్‌టెల్ కంపెనీలో ఇన్‌స్టాలేషన్ పనులు చేస్తుంటారు. ఇదే పనిపై ఈ నెల 17న భద్రాచలం వెళ్లారు. 22వ తేదీన పని ముగించుకున్నారు. అదే రోజు రాత్రి 9.00 గంటల సమయంలో ఆటోలో కొణిజర్లకు బయల్దేరారు. సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామ సమీపంలోగల అయ్యప్ప టెంపుల్ వద్ద వీరి ఆటోను, ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ప్రయాణిస్తున్న పోలీసు వాహనం (టాటా సుమో, టీఎస్09 పీఏ1538) ఢీకొంది.
ఆటోలో ప్రయాణిస్తున్న కొణిజర్ల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన ముండ్లగిరి కిశోర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ముత్తమాల కిశోర్, యామాల ప్రవీణ్, తంబళ్ళ అశోక్, కాసిమల్ల రాజేష్‌ను కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో పోలీసులు చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. వీరిలో తంబళ్ళ అశోక్, యామాల ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగ్రాతుల నుంచి వివరాలను సుజాతనగర్ ఎస్సై ఇ.రతీష్ సేకరించారు. టాటా సుమో డ్రైవర్ ఉప్పర శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. ముండ్లగిరి వెంకటేశ్వర్లు–భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. చిన్నవాడైన కిశోర్, గత మూడు నెలలుగా ఎయిర్‌టెల్ టవర్ పనులు చేస్తున్నాడు. తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు.
Comments
Please login to add a commentAdd a comment