మంచిగుండమంటే.. మంట పెట్టుకుండు
పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న జులాయి
గతంలో ఇతడిపై నిర్భయ కేసు
ఖమ్మం: ఖమ్మం నగరంలోని చర్చి కాంపౌండ్ ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల జొన్నలగడ్డ అరుణ్‌ప్రకాష్ సోమవారం ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు మంటలను ఆర్పి..ఆస్పత్రికి తరలించారు. అతడి తల్లి, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా..మద్యానికి బానిసై..భార్య, బిడ్డను వదిలేసి జులాయిగా తిరుగుతూ.. తరచూ తల్లితో గొడవపడుతున్న వ్యక్తిని మందలించినందుకు ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో వ్యక్తి. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని ఖమ్మం వన్‌టౌన్ పోలీసులను ఠారెత్తించాడు. తీవ్రంగా కాలిన శరీరంతో ప్రభుత్వాస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
ఉన్నత కుటుంబం..జులాయి జీవితం
ఇతని తల్లి జ్ఞాన విక్టోరియా సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. తండ్రి చనిపోయాడు. తమ్ముడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అరుణ్ ప్రకాష్ బీకాం చదువును మధ్యలోనే ఆపేసి.. 2005లో బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఓ బాబు పుట్టాడు. బాధ్యత లేకుండా తిరుగుతూ, మద్యానికి బానిసగా మారి తరచూ వేధిస్తుండడంతో భార్య నాలుగేళ్ల క్రితమే విడాకులు ఇచ్చి విజయవాడలోని పుట్టింటికి పోయింది. తల్లి ఇంట్లో ఉంటున్న ఇతను రెండేళ్ల క్రితం ముస్తఫానగర్‌కు చెందిన బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్భయ కేసు నమోదైంది. అప్పటి నుంచి..తరచూ తల్లితో గొడవపడుతుండే వాడు. పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడు. ఆ బాలిక కావాలంటూ..సైకోలా ప్రవర్తిస్తూ తనను ఇబ్బంది పెట్టేవాడని తల్లి ఏడుస్తూ వివరించింది.
బెదిరింపులతో వింత ప్రవర్తన
మద్యం మత్తులో రెండు రోజుల క్రితం ఇంటికి పెట్రోల్ తెచ్చుకొని ఒంటిపై పోసుకోగా..సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆదివారం డిశ్చార్జి అయ్యాడు. ఇంటికొచ్చాక..అద్దాలకు తల బాదుకుంటూ..తల్లితో గొడవపడ్డాడు. ఆమె ఇచ్చిన సమాచారంతో పోలీసులు అరుణ్‌ప్రకాష్‌ను పొలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి.. కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. సోమవారం ఉదయం మళ్లీ గొడవ చేస్తుండగా..తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో బాటిల్‌లో పెట్రోల్ తీసుకుని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ లోపలికి వచ్చిన అరుణ్‌ప్రకాష్ ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని మంట అంటించుకున్నాడు. వెంటనే కానిస్టేబుల్ బాలకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్ రమణ, సిబ్బంది కిషన్, సత్యనారాయణ మంటలను ఆర్పారు. స్టేషన్ పైన ఉన్న సీఐ వెంకటనర్సయ్య, ఎస్సైలు జాన్‌రెడ్డి, పూర్ణచందర్‌రావు అక్కడికి చేరుకొని..జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలో అతని వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ నమోదు చేసుకున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు బాబూజాన్ తెలిపారు. స్టేషన్‌లో ఘటన కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.