
ముంబై: మహారాష్ట్రలోని ధులేకు చెందిన ఓ యువకుడు ఫేస్‌బుక్ లైవ్‌లో ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన ఐర్లాండ్ లోని ఫేస్‌బుక్ అధికారులు వెంటనే ముంబై పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని గుర్తించి, యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అంతా 50 నిమిషాల్లోపే పూర్తయింది. ధులే పోలీస్ ఠాణాలో హోంగార్డ్‌గా చేస్తున్న వ్యక్తి కుమారుడు(23) ఆదివారం చేతిని కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. దీనిని ఐర్లాండ్‌లోని ఫేస్‌బుక్ సిబ్బంది గమనించి వెంటనే ముంబైలోని సైబర్ క్రైం పోలీస్ డిప్యూటీ కమిషనర్ రశ్మి కరండికర్‌కు ఫోన్ చేసి తెలిపారు.
ఆమె వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తంచేశారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులు రాత్రి 9 గంటలకల్లా ధులేలోని భోయి సొసైటీ ప్రాంతంలోని ఓ ఇంట్లో గాయపడి ఉన్న బాధిత యువకుడిని గుర్తించారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి, ప్రాణాపాయం నుంచి కాపాడారు. సోమవారం అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారని ఎస్పీ చిన్మయ్ పండిట్ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడబోయిన ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment