dhule
-
మహారాష్ట్రలో ట్రక్కు బీభత్సం.. 10 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధులే జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి నాలుగు వాహనాలు ఢీకొట్టి దాబాలోకి (హోటల్) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం పది గంటలకు పలాస్నర్ గ్రామ సమీపంలోని ముంబై-ఆగ్రా జాతీయ రహదారిపై జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి ధులేకు వెళ్తుండగా.. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పింది. దీంతో ముందుగా హైవేపై బస్టాప్ సమీపంలో ఉన్న రెండు బైక్‌లు, ఒక కారు, మరొక కారును ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కకు ఎగిరిపడింది. అంతటితో ఆగకుండా పక్కన ఉన్న దాబాలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా.. 20 మందికిపైగా గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. భాదితుల్లో బస్టాప్‌లో వేచిచూస్తున్న ప్రయాణికులు సైతం ఉన్నారని, క్షతగాత్రులను ధులే, సిర్పూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు విచారణ చేపట్టినట్లు చెప్పారు. చదవండి: సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వానికి ఊరట.. -
ఐర్లాండ్.. ముంబై.. ధులే..!
ముంబై: మహారాష్ట్రలోని ధులేకు చెందిన ఓ యువకుడు ఫేస్బుక్ లైవ్‌లో ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన ఐర్లాండ్ లోని ఫేస్బుక్ అధికారులు వెంటనే ముంబై పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని గుర్తించి, యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అంతా 50 నిమిషాల్లోపే పూర్తయింది. ధులే పోలీస్ ఠాణాలో హోంగార్డ్‌గా చేస్తున్న వ్యక్తి కుమారుడు(23) ఆదివారం చేతిని కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. దీనిని ఐర్లాండ్‌లోని ఫేస్బుక్ సిబ్బంది గమనించి వెంటనే ముంబైలోని సైబర్ క్రైం పోలీస్ డిప్యూటీ కమిషనర్ రశ్మి కరండికర్కు ఫోన్ చేసి తెలిపారు. ఆమె వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తంచేశారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులు రాత్రి 9 గంటలకల్లా ధులేలోని భోయి సొసైటీ ప్రాంతంలోని ఓ ఇంట్లో గాయపడి ఉన్న బాధిత యువకుడిని గుర్తించారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి, ప్రాణాపాయం నుంచి కాపాడారు. సోమవారం అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారని ఎస్పీ చిన్మయ్ పండిట్ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడబోయిన ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. -
భారీ పేలుడు; ఇరవై మంది మృతి!
ముంబై: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో సుమారుగా 20 మంది మృత్యువాత పడ్డారు. మరో 22 మంది తీవ్ర గాయాలపాలు కాగా 70 మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ధూలే జిల్లాలోని వాఘాది గ్రామంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం సిలిండర్ పేలింది. దీంతో ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో అక్కడున్న వారంతా హాహాకారాలు చేస్తూ బయటికి పరుగులు తీశారు. కాగా ప్రమాద సమయంలో అక్కడ సుమారు వంద మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం చెల్లాచెదురుగా పడి ఉన్న ఎనిమిది మృతదేహాలను వెలికితీశామని, మిగతా వాటి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తు సహాయక సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. -
పిల్లల్ని ఎత్తుకెళ్లేవారనే అనుమానంతో..
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ధూలే జిల్లాలోని ఓ గ్రామంలో పిల్లల్ని ఎత్తుకెళ్లే వారనే అనుమానంతో గ్రామస్తులు ఐదుగురు వ్యక్తులను కొట్టిచంపారు. గిరిజన గూడెం రైన్‌పాదలో రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ బస్సులో దిగిన ఐదుగుని స్ధానికులు చితకబాదారు. ఓ బాలికతో మాట్లాడేందుకు వారు ప్రయత్నించగా, పిల్లల్ని ఎత్తుకుపోయే బృందంగా అనుమానిస్తూ అక్కడ గుమికూడిన గ్రామస్తులు వారిపై దాడికి తెగబడ్డారని పోలీసులు చెప్పారు. ఈ ప్రాంతంలో పిల్లల్ని ఎత్తుకెళ్లేవారు తిరుగుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో గ్రామస్తులు వారిని చితకబాదడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారని తెలిపారు. మృతదేహాలను సమీప పింపల్నేర్ ఆస్పత్రికి తరలించారు. దేశవ్యాప్తంగా ఇటీవల ఈ తరహా ఘటనలు పెచ్చుమీరుతున్నాయి. నాలుగు రోజుల కిందట గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పిల్లల్ని ఎత్తుకువెళుతుందనే అనుమానంతో ఓ యాచకురాలిని కొట్టిచంపారు. బాధితురాలిని సర్ధార్‌నగర్‌కు చెందిన శాంతాదేవిగా గుర్తించారు. ఇదే ఘటనలో అశుదేవి నాథ్, లీలాదేవి నాథ్, అనసి నాథ్‌లకు గాయాలయ్యాయి. అహ్మదాబాద్‌లోని వదాజ్ ప్రాంతం మీదుగా బాధితులు ఆటోలో వెళుతుండగా స్ధానికులు వారిని అటకాయించి దాడికి పాల్పడ్డారు. మరోవైపు గత వారం చత్తీస్‌గఢ్‌లో పిల్లల్ని ఎత్తుకువెళతాడని అనుమానిస్తూ ఓ వ్యక్తిని చావబాదారు. -
కెప్టెన్ సమయస్పూర్తి.. తప్పిన పెనుప్రమాదం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ధులే జిల్లాలో ‘బాంబే ఫ్లయింగ్ క్లబ్’కు చెందిన ఓ శిక్షణ విమానం కరెంట్ తీగలకు తగిలి నేల కూలింది. ఈ సంఘటనలో ప్రధాన పైలట్ కెప్టెన్ జె పి శర్మా, శిక్షణతీసుకుంటున్న ఇద్దరు యువతులకు గాయలయ్యాయి. ధులే జిల్లా సాక్రీ తాలూకా దాతర్తీ గ్రామంలో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాంబే ప్లయింగ్ క్లబ్ ఆధ్వర్యం శిక్షణ కొనసాగుతుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కరెంట్ తీగలకు తగిలి నేలకూలింది. తృటిలో తప్పిన పెను ప్రమాదం... కెప్టెన్ జెపి శర్మా సమయాస్ఫూర్తితో వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయని తెలుసుకున్న కెప్టెన్ వెంటనే దాతర్తీ గ్రామం నుంచి దూరంగా పొలాలవైపు విమానాన్ని మళ్లించారు. గ్రామంలో నివాసప్రాంతాల్లో విమానం కూలినట్టయితే తీవ్రంగా ప్రాణహానీ జరిగి ఉండేది. అయితే కెప్టెన్ సమయాస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. -
డాక్టర్‌ను చితకబాదిన పేషంట్ బంధువులు
ముంబై: ట్రీట్మెంట్ అందించడానికి నిరాకరించాడన్న కారణంతో ఓ డాక్టర్‌ను పేషంట్ బంధువులు చితకబాదారు. తీవ్రగాయాలపాలైన డాక్టర్ ప్రస్తుతం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ధూలే పట్టణంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్(జీఎమ్సీ)కి ఆదివారం రాత్రి తలకు గాయమైన ఓ వ్యక్తిని ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారు. అయితే.. ఆ సమయంలో ఆసుపత్రిలో విధులు నిర్వర్విస్తున్న డాక్టర్.. పేషంట్‌ను వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పేషంట్ బంధువులు.. అతడిపై దాడికి దిగారు. రాడ్లు, చేతికందిన వస్తువులతో చితకబాదారు. ఆసుపత్రిని ధ్వసం చేశారు. ఈ ఘటనలో డాక్టర్ తలకు గాయాలయ్యాయి. దీంతో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను డాక్టర్ల అసొసియేషన్ తీవ్రంగా ఖండించింది. సీసీటీవీ ఫొటేజీ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కాంగ్రెస్ హవా
సాక్షి, ముంబై: జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఇటీవల ఎన్నికలు జరిగిన ధులే, నందూర్బార్లలో అధికార పీఠాన్ని అధిష్టించేందుకు మార్గం సుగమం చేసుకుంది. అయితే అకోలా జిల్లా పరిషత్‌లో మాత్రం కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ఇక్కడ బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ధులే, నందూర్బార్, అకోలా జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారులు సోమవారం ప్రకటించారు. ధులే జిల్లా పరిషత్‌లో మొత్తం 56 స్థానాల్లో కాంగ్రెస్ 30 సీట్లను కైవసం చేసుకుంది. ప్రభుత్వంలో మిత్రపక్షంగా కొనసాగుతున్న ఎన్సీపీ కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. శివసేన రెండు, బీజేపీ 13 స్థానాలు దక్కించుకున్నాయి. నందూర్బార్ జిల్లా పరిషత్‌లోని 55 స్థానాలకుగానూ కాంగ్రెస్ 29, ఎన్సీపీ 25 స్థానాలు కైవసం చేసుకున్నాయి. బీజేపీకి కేవలం ఒకే స్థానం లభించింది. అకోలా జిల్లా పరిషత్‌లోని 52 స్థానాల్లో బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ 22, కాంగ్రెస్ 5, ఎన్సీపీ 2, శివసేన 8, బీజేపీ 11, ఎమ్మెన్నెస్ రెండు స్థానాలు దక్కించుకున్నాయి. అత్యధిక స్థానాలు బీఆర్పీ దక్కించుకుని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలను కంగుతినిపించింది. ఇదిలావుండగా గతసారి జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో నందూర్బార్ను ఎన్సీపీ దక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం 16 స్థానాలతో సరిపెట్టుకోగా, ఎన్సీపీ ఏకంగా 32 స్థానాలు దక్కించుకుని అధికార పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఈసారి 55 స్థానాల్లో కాంగ్రెస్ 29 స్థానాలను కైవసం చేసుకుంది. ధులే జిల్లా పరిషత్ కాంగ్రెస్ అధీనంలోనే ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ధులే జిల్లా పరిషత్‌లో తొలి రెండున్నర సంవత్సరాలు ఎన్సీపీ, శివసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అధికారాన్ని పంచుకున్నాయి. ఆ తర్వాత మిగిలిన రెండేళ్లు కాంగ్రెస్ పాలించింది. అయితే ఈసారి మొత్తం 56 స్థానాల్లో ఏకంగా 30 స్థానాలు కైవసం చేసుకుని కాంగ్రెస్ తిరుగులేని మెజార్టీని సొంతం చేసుకుంది. లోక్‌సభ సీట్ల పంపిణీపై ప్రభావం ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరగనున్న అధికార ప్రజాస్వామ్య కూటమిల లోక్‌సభ స్థానాల పంపిణీపై ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటికే ఎన్సీపీ ప్రభావం తగ్గిందని చెబుతున్న రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే లోక్‌సభ సీట్ల పంపిణీలో కాంగ్రెస్ 29, ఎన్సీపీ 19 స్థానాల్లో పోటీ చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. తాజాగా వచ్చిన ఫలితాలు కాంగ్రెస్‌కు మరింత ఊపునిచ్చే అవకాశముంది. అయితే పాత ఫార్ములా ప్రకారమే 26ః22 స్థానాల్లో పోటీ చేయాలని ఎన్సీపీ అంటోంది. అయితే సీట్ల పంపిణీపై త్వరలో ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.