కాంగ్రెస్ హవా | Seat sharing: Congress to stay firm | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ హవా

Published Wed, Dec 4 2013 12:25 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Seat sharing: Congress to stay firm

సాక్షి, ముంబై: జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఇటీవల ఎన్నికలు జరిగిన ధులే, నందూర్బార్‌లలో అధికార పీఠాన్ని అధిష్టించేందుకు మార్గం సుగమం చేసుకుంది. అయితే అకోలా జిల్లా పరిషత్‌లో మాత్రం కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ఇక్కడ బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.
 
 ధులే, నందూర్బార్, అకోలా జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారులు సోమవారం ప్రకటించారు. ధులే జిల్లా పరిషత్‌లో మొత్తం 56 స్థానాల్లో కాంగ్రెస్ 30 సీట్లను కైవసం చేసుకుంది. ప్రభుత్వంలో మిత్రపక్షంగా కొనసాగుతున్న ఎన్సీపీ కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. శివసేన రెండు, బీజేపీ 13 స్థానాలు దక్కించుకున్నాయి. నందూర్బార్ జిల్లా పరిషత్‌లోని 55 స్థానాలకుగానూ కాంగ్రెస్ 29, ఎన్సీపీ 25 స్థానాలు కైవసం చేసుకున్నాయి. బీజేపీకి కేవలం ఒకే స్థానం లభించింది. అకోలా జిల్లా పరిషత్‌లోని 52 స్థానాల్లో బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ 22, కాంగ్రెస్ 5, ఎన్సీపీ 2, శివసేన 8, బీజేపీ 11, ఎమ్మెన్నెస్ రెండు స్థానాలు దక్కించుకున్నాయి. అత్యధిక స్థానాలు బీఆర్పీ దక్కించుకుని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలను కంగుతినిపించింది.
 
 ఇదిలావుండగా గతసారి జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో నందూర్బార్‌ను ఎన్సీపీ దక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం 16 స్థానాలతో సరిపెట్టుకోగా, ఎన్సీపీ ఏకంగా 32 స్థానాలు దక్కించుకుని అధికార పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఈసారి 55 స్థానాల్లో కాంగ్రెస్ 29 స్థానాలను కైవసం చేసుకుంది. ధులే జిల్లా పరిషత్ కాంగ్రెస్ అధీనంలోనే ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ధులే జిల్లా పరిషత్‌లో తొలి రెండున్నర సంవత్సరాలు ఎన్సీపీ, శివసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అధికారాన్ని పంచుకున్నాయి. ఆ తర్వాత మిగిలిన రెండేళ్లు కాంగ్రెస్ పాలించింది. అయితే ఈసారి మొత్తం 56 స్థానాల్లో ఏకంగా 30 స్థానాలు కైవసం చేసుకుని కాంగ్రెస్ తిరుగులేని మెజార్టీని సొంతం చేసుకుంది.
 
 లోక్‌సభ సీట్ల పంపిణీపై ప్రభావం
 ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరగనున్న అధికార ప్రజాస్వామ్య కూటమిల లోక్‌సభ స్థానాల పంపిణీపై ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటికే ఎన్సీపీ ప్రభావం తగ్గిందని చెబుతున్న రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే లోక్‌సభ సీట్ల పంపిణీలో కాంగ్రెస్ 29, ఎన్సీపీ 19 స్థానాల్లో పోటీ చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. తాజాగా వచ్చిన ఫలితాలు కాంగ్రెస్‌కు మరింత ఊపునిచ్చే అవకాశముంది. అయితే పాత ఫార్ములా ప్రకారమే 26ః22 స్థానాల్లో పోటీ చేయాలని ఎన్సీపీ అంటోంది. అయితే సీట్ల పంపిణీపై త్వరలో ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement