బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు చూపుతున్న పోలీసులు
కర్నూలు: కర్నూలు నగరంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల గుట్టు రట్టయ్యింది. మొబైల్ యాప్ చూస్తూ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌కు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో మూడవ పట్టణ సీఐ హనుమంతనాయక్, ఎస్‌ఐ శ్రీనివాసులు, ఏఎస్‌ఐ విశ్వనాథ్‌రెడ్డి, సిబ్బంది పాండునాయక్, లక్ష్మీనారాయణ, మహేష్‌తో కలిసి బుధవారపేటలోని భవానీ దేవాలయం వద్ద బెట్టింగ్ రాయుళ్లను ఆదివారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి రూ.1.5 లక్షల నగదు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు నగరం పెద్దరంగరాజు వీధికి చెందిన గద్దెల రాజేశ్వరరావు... ప్రొద్దుటూరుకు చెందిన సుబ్బారెడ్డి, ఇర్ఫాన్ అనే వ్యక్తులకు బుకీగా వ్యవహరిస్తూ ఆటగాళ్లతో డబ్బులు వసూలు చేస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. రాజేశ్వరరావుతో పాటు పెద్దరంగరాజు వీధికి చెందిన సాయికుమార్, అభిలాష్, మేదరవీధికి చెందిన కమలాపురం శివకోటి, తెలుగువీ«ధిలో నివాసం ఉంటున్న జీతూరి వెంకటేష్ ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిర్వాహకుడు సుబ్బారెడ్డి, ఇర్ఫాన్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ హనుమంతనాయక్ తెలిపారు.
పోలీసులపై టీజీ భరత్ ఒత్తిడి
క్రికెట్ బెట్టింగ్‌లో బుకీతో పాటు నలుగురు ఆటగాళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం అందడంతో బెట్టింగ్ రాయుళ్లను విడిపించేందుకు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు, కర్నూలు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో తనకు యువకులు సహకరించినందున ఎలాగైనా వదిలిపెట్టాలని పోలీసులపై ఆయన ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. బెట్టింగ్ నిర్వాహకుల వద్ద భారీ మొత్తంలో నగదు లభించినప్పటికీ టీజీ భరత్ ఒత్తిడి మేరకు తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి, తక్కువ మొత్తంతోనే అరెస్ట్ చూపినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment