వివరాలు వెల్లడిస్తున్న పోలీసు అధికారులు
కర్నూలు : కర్నూలు కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. పోలీసులకు చిక్కిన వారంతా ఎంబీఏ, ఎంసీఏ, పోస్ట్‌గ్రా డ్యుయేట్ వంటి ఉన్నత చదువులు చదివిన వారు కావడం గమనార్హం. కర్నూలు నగరం ఎఫ్‌సీఐ కాలనీలోని కేఎంసీ పార్కు వద్ద బుధవారం క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను మూడో పట్టణ పోలీసులతో కలసి స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. దాడుల్లో 15 మందిని అరెస్టు చేయగా మరో 11 మంది పరారీలో ఉన్నారు. పట్టబడిన వారి వద్ద నుంచి రూ.5.58 లక్షల నగదు, రూ.92 లక్షల విలువ చేసే చెక్కులు, రూ.2.21 కోట్ల విలువ చేసే ప్రామిసరీ నోట్లు, 30 సెల్‌ఫోన్లు, రెండు కాలిక్యులేటర్లు, 5 బ్యాంక్ పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం కర్నూలు డీఎస్పీ డి.శ్రీనివాసులుతో కలసి ట్రైనీ ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు వివరాలు వెల్లడించారు.
రెండు గ్రూపులుగా..
కర్నూలు మండలం భూపాల్‌నగర్‌కు చెందిన పాలకుర్తి విశ్వనాథ్‌రెడ్డి ప్రధాన సూత్రధారిగా కర్నూలు నగరం లక్ష్మీనగర్‌కు చెందిన మొగలి యల్లగౌడ్, కృష్ణానగర్‌కు చెందిన బవనాసి అనిల్‌కుమార్, బుధవారపేటకు చెందిన పాషావలి, అరోరా నగర్‌కు చెందిన పేరుమల సాగర్, పత్తికొండ పట్టణానికి చెందిన బండ సందీప్, కర్నూలు నాగిరెడ్డి రెవెన్యూ కాలనీకి చెందిన కట్టుబడి శ్రీధర్, ముచ్చుమర్రి గ్రామానికి చెందిన కరణం ప్రభాకర్, తాండ్రపాడుకు చెందిన ప్రకాష్ గౌడ్, అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన జిట్టా నరేష్, పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన పట్నం శ్యాంబాబు, కర్నూలు నగరం సంతోష్‌నగర్‌కు చందిన షేక్ సద్దాం, భూపాల్‌నగర్‌కు చెందిన బత్తిన సురేంద్ర ఒక గ్రూపు, మరో ప్రధాన సూత్రధారి కర్నూలు నగరం బి.క్యాంప్‌లో నివాసముంటున్న ఫషీవుల్లా అలియాస్ జానకిరామ్ నేతృత్వంలో మరో గ్రూపు కొంతకాలంగా కర్నూలు కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.
పరారీలో 11 మంది...
పై రెండు గ్రూపులతో అనుసంధానంగా పనిచేస్తూ క్రికెట్ బుకీలకు లాభాలు ఆర్జించిపెడుతున్న మరో 11 మంది పరారీలో ఉన్నారు. మొదటి గ్రూపులో జానకిరామ్ అలియాస్ జేడీ, శివశంకర్, తిమ్మయ్య, రాజశేఖర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, పుల్లయ్య గౌడ్, రెండో గ్రూపులో షఫీవుల్లా కింద పనిచేస్తున్న కర్ణాటక రాష్ట్రం బళ్లారి ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇనాయతుల్లా ఖాద్రి, సుదర్శన్‌రెడ్డి, శ్రీకాంత్, అశోక్, నాగరాజు తదితరులు పరారీలో ఉన్నారు. నిందితులపై మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అండర్ సెక్షన్ 420 ఐపీసీ, సెక్షన్ 9(1) ఏపీ గేమింగ్ యాక్ట్ (క్రికెట్ బెట్టింగ్) కింద కేసు నమోదయ్యింది.
రూ. కోట్లలో లావాదేవీలు...
షఫీవుల్లా వివిధ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు విచారణలో బయటపడింది. సంపాదించిన ఆస్తులకు ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించకపోగా పేదరికంలో మగ్గుతున్నట్లు ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు, అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాడు. ఇతని నుంచి స్వాధీనం చేసుకున్న లక్షలు విలువ చేసే ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మట్కా, బెట్టింగ్ రాయుళ్ల ఆస్తులనుకోర్టుకు అటాచ్ చేయిస్తాం..
మట్కా, బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలను నడిపించేవారి ఆస్తులను జప్తు చేసి, కోర్టుకు అటాచ్ చేయిస్తామని ట్రైనీ ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై టెక్నాలజీ ద్వారా నిఘా పెట్టామన్నారు. ఎక్కడైనా ఇటువంటి కార్యకలాపాలకు ఆశ్రయం కల్పించినట్లయితే (లాడ్జిలైనా సరే) వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసుల వాట్సాప్ నంబర్ 77778 77722కు సమాచారమందించాలని విజ్ఞప్తి చేశారు. మూడో పట్టణ సీఐ హనుమంత నాయక్, ఎస్‌ఐ తిరుపాల్ బాబు, ఏఎస్‌ఐ విశ్వనాథ్‌రెడ్డి తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment