ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ విచ్చలవిడి ఖర్చు
గౌరీగోపాల్ ఆసుపత్రి, రాయలసీమ ఆల్కలీస్ ఫ్యాక్టరీ ఖాతాల నుంచి డబ్బు పంపిణీ
రూ.1,500 నుంచి రూ.5 వేల వరకూ నగదు బదిలీ
ఎన్నికల కమిషన్ కళ్లుగప్పి వ్యవహారం
టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తండ్రి, పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేష్‌కు సంబంధించిన శ్రీరాయలసీమ ఆల్కాలీస్ పరిశ్రమకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి xxxxxx680523 నెంబర్ గల ఖాతాకు మార్చి 8న రూ.1,500 జమ అయ్యింది.
టీజీ భరత్ కుటుంబానికి చెందిన గౌరీగోపాల్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి xxx0523నెంబర్ గల ఖాతాకు ఏప్రిల్ 6న రూ.5 వేలు జమ అయ్యింది..
ఈ రెండే కాదు.. ఎన్నికల వేళ కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గుట్టుగా డబ్బు పంపిణీ చేస్తూ కుల సంఘాల నాయకులను, ప్రజలను ప్రలోభపెడుతున్నట్ల తెలుస్తోంది. ఓటమి భయంతో డబ్బును ఎరగా చూపి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కులాల వారీగా సంఘాల నాయకులను చేరదీసి కొంతమందికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు ముట్టజెప్పి మద్దతు కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రెండుసార్లు ఓటమి చెందాం.. సాయం చేయండి..
టీజీ భరత్ తరపున ఆయన తండ్రి టీజీ వెంకటేష్ నగరంలోని ప్రముఖులను పలు రాజకీయ పార్టీల నాయకులు, కులసంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులను పిలిపించి రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు. రెండుసార్లు ఓడిపోయాం.. ఈసారి కూడా ఓడిపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఎలాగైనా సాయం చేయండి.. మీకు ఏ విధమైన సాయం కావాలన్నా చేస్తామంటూ ప్రాధేయపడుతున్నట్లు సమాచారం.
వార్డుల్లో ఒకస్థాయి నాయకుడిని కూడా వదలకుండా తన కార్యాలయానికి పిలిపించుకుని అంతో ఇంతో ముట్టజెప్పి తన కొడుకును గట్టెక్కించాలని ప్రాధేయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో టీజీ వెంకటేష్ దగ్గర కనీసం 70 మందికి పైగా ముఖ్యమైన వ్యక్తులు ఎళ్లవేళలా కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండేవారు. టీజీ భరత్ వ్యవహారశైలి నచ్చక చాలామంది దూరంగా ఉంటున్నారు. అలాంటి వారందరినీ కూడా టీజీ వెంకటేష్ పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భరత్‌తో కలసి పని చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
బర్త్‌డే గిఫ్ట్ పేరుతో ఓటర్లకు వల
2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన టీజీ కుటుంబానికి రానున్న 2024 ఎన్నికలు అత్యంత కీలకం. ఆ ఎన్నికల్లో పరాభవం చెందితే ‘హ్యాట్రిక్’ ఓటముల దెబ్బకు రాజకీయాల నుంచి టీజీ ఫ్యామిలీ దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో తనకు బలముంది, ప్రజల మద్దతు ఉందని చూపించేందుకు భరత్ తన బర్త్‌డేను వేదికగా చేసుకున్నారు. బర్త్‌డేకు జనం రారని ముందే ఊహించి తన అనుచరులతో ఇంటింటికీ తిరిగి గిఫ్ట్ కూపన్లు పంపిణీ చేయించారు. ఏస్టీబీసీ కళాశాల మైదానంలో వచ్చి న వారందరికీ విందుతో పాటు రూ.700 విలువ చేసే గిప్ట్‌లు పంపిణీ చేసి ఎన్నికల్లో సహకరించాలని కోరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. – కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment