ఆలూరు, ఆదోని విషయంలో మీనమేషాలు
జనసేనకు ఉమ్మడి జిల్లాలో మొండిచేయి
ఆలూరు టిక్కెట్‌పైడీఎస్పీ ఆశలు గల్లంతు
ఆదోనిలో గందరగోళంగా మీనాక్షినాయుడి భవితవ్యం
ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమైన తిక్కారెడ్డి
ఎంపీ సీట్ల విషయంలోనూ స్పష్టత కరువు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సార్వత్రిక సమరంలో అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకుపోతుంటే.. ‘కూటమి’కి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అభ్యర్థులే ఖరారు కాని పరిస్థితి. ఆదోని, ఆలూరు అసెంబ్లీలతో పాటు కర్నూలు, నంద్యాల ఎంపీ స్థానాలకు అభ్యర్థులు కరువయ్యారు. దీంతో నంద్యాల ఎంపీగా బీజేపీ నేత బైరెడ్డి శబరికి టిక్కెట్ ఇచ్చేందుకు అంగీకరించి ‘సైకిల్’ ఎక్కించారు. టిక్కెట్ ఖరారైన తర్వాత శబరి పచ్చకండువా వేసుకున్నారు. ఇక ఇప్పటి వరకు కర్నూలు ఎంపీ, ఆలూరు, ఆదోనికి అభ్యర్థుల విషయంలో స్పష్టత కరువైంది.
డీఎస్పీకి చేయిచ్చిన బాబు
ఆలూరు బరిలో బోయ కులానికి చెందిన ఓ డీఎస్పీని నిలపాలని చంద్రబాబు ఆ సామాజిక వర్గంలో ఆశలు రేకెత్తించారు. ఉద్యోగానికి రాజీనామా చేయాలని కూడా డీఎస్పీకి సూచించారు. అయితే చంద్రబాబు స్వభావం తెలిసి టిక్కెట్ ఖరారైన తర్వాత రాజీనామా చేయొచ్చని ఆయన వేచి చూశారు. పోలీస్‌శాఖలో తన బ్యాచ్‌మెట్లు, తన దగ్గర పని చేసే సిబ్బందితో తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. ఎన్నికలకు చందాలు కూడా అడిగారు. అయితే తీరా మంత్రాలయం టిక్కెట్ బోయ వర్గానికి చెందిన రాఘవేంద్రకు కేటాయించారు. దీంతో ఆలూరులో బోయలకు మొండిచేయి చూపినట్లయింది. ఈ కారణంగా ఎమ్మెల్యే కావాలని ఉవ్విళ్లూరిన డీఎస్పీ ఆశలు అడియాశలయ్యాయి.
ఇండిపెండెంట్‌గా తిక్కారెడ్డి
మంత్రాలయంలో టీడీపీని మొదటి నుంచి అంటిపెట్టుకుని, పార్టీ కోసం భారీగా డబ్బు ఖర్చు చేసి నష్టపోయిన తిక్కారెడ్డికి చంద్రబాబు హ్యాండిచ్చారు. అతన్ని కాదని రాఘవేంద్రకు టిక్కెట్ ఖరారు చేశారు. ఈ నిర్ణయాన్ని అతని సామాజికవర్గంతో పాటు నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ స్వాగతించలేదు. తామంతా తిక్కారెడ్డితోనే నడుస్తామని తేల్చిచెప్పారు. ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని ఆందోళనలు చేశారు. అయితే టీడీపీ మాత్రం తిక్కారెడ్డిని పిలిపించి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ‘పార్టీలో ఉంటే ఉండు లేదంటే లేదు!’ అనేలా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని మొదట భావించినా, చివరకు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని, తన బలం చూపించాలని నిర్ణయం తీసుకున్నారు. కేడర్ కూడా పూర్తి మద్దతు తెలపడంతో పోటీకి సిద్ధమయ్యారు.
మీనాక్షి నాయుడి భవిష్యత్తు ఏంటో?!
టీడీపీలో మీనాక్షినాయుడుకు టిక్కెట్ లేదనే సంకేతాలు పంపారు. టిక్కెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ ఫ్లెక్సీలను కూడా తొలగించారు. అయితే ఆ సీటు బీజేపీకి ఇస్తుండటంతో మీనాక్షినాయుడు ఆలోచనలో పడ్డారు. వయస్సు పైబడింది. తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకోలేకపోయాడు. దీంతో తన రాజకీయ భవిష్యత్తు ఏంటని ఆలోచించి చివరకు ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దామా? అని అనుచరులతో చర్చిస్తున్నారు. బీజేపీకి టిక్కెట్ ఖరారైతే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
‘పచ్చ’జెండా మోసేందుకే జనసైనికులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 45వేలు, నంద్యాలలో 38వేలు, డోన్, బనగానపల్లి, ఆత్మకూరుతో పాటు కర్నూలు జిల్లాలో కూడా బలిజలు అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే నంద్యాల జిల్లాలో ఒక్క సీటు కూడా జనసేనకు టీడీపీ కేటాయించలేదు. కర్నూలు జిల్లా ఆదోని సీటుపై ఆశలు పెట్టుకున్నప్పటికీ సీటు ఇవ్వలేమని చంద్రబాబే స్పష్టం చేసినట్లు తెలిసింది. అక్కడ బీజేపీకి టిక్కెట్ ఇచ్చే యోచనలో ఉన్నారు. దీంతో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసైనికులు టీడీపీ జెండా పట్టుకుని చంద్రబాబు విజయం కోసం పనిచేయడం మినహా తాము జనసేనలో ఉన్నందుకు ఒక్కరికై నా టిక్కెట్ దక్కించుకునే పరిస్థితి లేదు. ఉమ్మడి జిల్లా బ్యాలెట్లలో ఎక్కడా ‘గ్లాసు’ గుర్తు కన్పించని పరిస్థితి ఉండనుంది.
ఎటూ తేలని ఎంపీ అభ్యర్థులు
కర్నూలు, నంద్యాల పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి టీడీపీది. నంద్యాలలో మాండ్ర శివనందరెడ్డికి సర్వేలు దెబ్బకొట్టాయి. అతను డబ్బున్న వ్యక్తి మాత్రమే అని, రాజకీయంగా ఏమాత్రం ప్రభావితం చేయలేడని తేలింది. దీంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమారై, బీజేపీ నేత శబరికి ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే ఆమె బీజేపీని వీడి టీడీపీలో చేరారు. త్వరలో అభ్యర్థిగా ప్రకటించనున్నారు. దీంతో మాండ్ర శివానందరెడ్డి చట్టసభలకు వెళ్లాలనే ఆశలు దాదాపుగా సమాధి అయినట్లే. మరోవైపు కర్నూలు ఎంపీగా అభ్యర్థులే దొరకని పరిస్థితి. డబ్బున్న చాలామంది పేర్లను పరిశీలించిన బాబు చివరగా పంచలింగాల నాగరాజు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పీఏ భానుశంకర్‌లో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని భావించారు. చివరకు కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ టీడీపీలో చేరడంతో చేనేత కోటాలో ఆయనకు టిక్కెట్ ఇవ్వొచ్చనే ప్రచారం కొనసాగుతోంది. ఈ ముగ్గురిలో ఒకరు బరిలో నిలవనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment