‘ఏయ్ ఈరన్నా.. కూలోళ్లకు బువ్వ తెచ్చినా.. అందర్నీ పిల్సుకరా!!
అబ్బా! యాలపొద్దయింది ఇంగా త్యాలేదని సూస్తుండాం ఉరుకుందప్ప మామ, అందరూ శానా ఆకలిమీదుండారు. అంతా రాండి! తిని పన్లోకి ఒంగి ఇంటికి పోదాం! బాగా ఎండకాస్తాంది!
‘ఏం మామా శానా పొద్దెక్కినాక తెచ్చినావ్! తొందరగా తెస్తావనుకుంటే! అన్నాడు ఈరన్న.
లేదు ఈరన్నా.. విరూపాచ్చి దేవనకొండ మండలంలో పల్లెలకు పోతున్నాడంట! కార్లు శానా వచ్చినాయి.. మధ్యల ఇరుక్కపోయింటి!’ అన్నాడు ఉరుకుందప్ప!
‘ఎలచ్చన్లు కదా! అంతా తిరుగుతాంటారు! పైగా ఈయప్పకు కొత్తగా మన ఆలూరు సీటు ఇచ్చినారు! బాగా తిరుగుతున్నాడు!’ అవును మామ! ఈసారి మన ఎలచ్చన్లు ఎట్టుంటాయంటావ్!
‘గుమ్మనూరు జయరాం టీడీపీలో సేరినాడు కాదా! విరూపాచ్చికి ఇబ్బందిగా ఉంటాదంటావా?! ఆ జయరాంకే సీటు ఇచ్చింటే పోయుండె కదా!’
‘అట్లాకాదు, బలేసెప్పినవ్! జయరాంకు ఎంపీ సీటు ఇచ్చినారు!
ఆలూరు కాదు.. కర్నూలు జిల్లాకే ఎంపీ! పైగా ఖరాకండీగా గెల్చే సీటు. ఆయప్పే నాకొద్దని పోయి సెంద్రబాబు పార్టీలో సేరినాడు. జగన్ మోహన్‌రెడ్డి పొరపాటు ఏముంది!’
‘మామా! ఆయప్పకు ఆలూరు ఎమ్మెల్యే సీటే కావాల్నంట? లేదంటే విరుపాచ్చిని మార్సాలని పట్టుబట్టినాడంట! పార్టీ కాదని సెప్పడంతో ఈయప్ప నా తడాఖా సూపిస్తా’ అని టీడీపీలో సేర్నాడంట’ వైఎస్సార్ పార్టీకి ఇబ్బంది ఉండదంటావా?’
‘ ఒకటి సెప్తా సూడు ఈరన్నా! తడాఖా సూపిచ్చేటోడే అనుకుంటే! యిప్పటిదాకా ఆలూరులో టీడీపీకి లీడరే దొరకల్యా. డీఎస్పీని, వాళ్లను ఈళ్లను అడుక్కుంటున్నారు. గెల్సేటట్ల ఉంటే ఈయప్పా బాయోడే కదా! మరి సెంద్రబాబు ఎందుకు టిక్కెట్ ఇయ్యల్యా!’ ఈయప్ప ఆడ గెల్సడని అర్థమైంది! అందుకే మంత్రిగా పార్టీలో సేరినా, ఆలూరులో బాయోల్లకు యియ్యాలనుకున్యా ఆయప్పను గుంతకల్లుకు పొమ్మన్యాడు!’ ఆ మాత్రం ఇంగితం లేకపోతే ఎట్టా!’
‘కాదు మామ! బాయోల్లకే ఇయ్యాలనుకున్యాక జయరాంకు ఇస్తే పొతాది కదా! మళ్లా విరూపాచ్చిని తీసురాడం, జయరాం అలిగి సెంద్రబాబు కాడికి పోవడం! ఇదంతా లేనిపోని తలకాయినొప్పి పెట్టుకున్నట్టుంది కదా వైసీపోళ్లు!’
‘అన్నీ సూసినాకే, వివరం తెల్సుకున్యాకే విరూపాచ్చికి సీటు ఇచ్చింటారు! ఈయప్పకు ఏం అన్నాయం సేయలేదు కదా! ఎంపీ సీటు ఇచ్చినాక ఇంకేం కావాల! మరి కోడుమూరు ఎమ్మెల్యేను కాదని సతీశ్‌కు సీటిస్తే మర్నాడే సతీశ్‌ను గెలిపిస్తామని సుధాకర్ యిలేకర్లతో సెప్పలేదా. నేను పేపర్లో సూసినా! హఫీజ్‌ఖాన్‌ను కాదని ఐఏఎస్ ఆఫీసరుకు సీటిస్తే హఫీజే ఆయన్ను జనంలోకి తీసుకపోతలేడా. అంతెందుకే.. పెద్దాయప్ప ఎర్రకోట సెన్నకేశవరెడ్డిని కాదని తొలుత ఎంకటేశ్‌కు సీటిస్తే ఆయప్పను జనాల్లో తిప్పలేదా.
అయినాంక రేణుకమ్మకు ఇత్తే ఆయమ్మను జనాల్లోకి తీసుకపోతుండ్లేదా! ఈళ్లందరికీ సీట్లే లేవు. అయినా జగన్‌రెడ్డి సెప్పినట్లు ఇంటలేరా!’ మరి ఈయప్పకు ఎంపీ సీటిచ్చినా నాకు పార్టీ అన్నాయం సేసిందని మొన్న సెంద్రబాబు దగ్గర సెప్తాడు!’ పైగా ఆయప్ప కాళ్లమీద పడి! జనాలకు ఈయన్నీ అర్థం కావా సెప్పు! ఆ.. ఇంకోటి నెల్లూరు అనిల్ను నర్సరావు పేట ఎంపీగా పంపినారు. జిల్లా దాటిచ్చినా ఆయన ఆటికి పోలేదా! జయరాం సెప్పినంత మాత్రాన, పార్టీ ఆయప్పకు అన్నాయం సేసిందని, అంత ఎర్రిగా నమ్మే వాళ్లు ఎవ్వరున్నార్లే! ఇంకోటి మొదట్నుంచి లీడర్లు జగన్‌రెడ్డికి అన్నాయం సేసినారు కానీ, జగన్‌రెడ్డి ఎవర్నీ అన్నాయం సేయలేదులే!’
‘నిజమే మామ!’ జగన్‌రెడ్డి జయరాంను శానా బాగా సూసుకున్యాడు. కొడాలి నాని, బాలినేని సీనివాసరెడ్డి లాంటోళ్లను కూడా కాదని ఈయప్పను ఐదేళ్లు మంత్రిగా ఉంచిన్యాడు. ఈళ్ల తమ్మున్ని మాల మల్లేశ్వరస్వామి గుడికి సైర్మన్ గిరి ఇయ్యలేదా. ఈయప్పే తప్పు సేసిన్యాడు.. వైసీపోళ్ల తప్పేం లేదు! పార్టీ ఆయప్పకు అన్ని సేసినప్పుడు, పార్టీ కోసం ఆయప్ప కూడా ఎంపీగా పోటీ సేసుంటే బాగుంటలేకున్యా!’
‘ఇంకోటి ఈరన్న! ఈ ఐదేండ్లల్ల ఈయప్ప మీద ఎన్ని నిందలొచ్చినాయో తెల్దా మనకి! గుమ్మనూరులో పత్తాలాడిస్తున్నప్పుడు పోలీసోళ్లు పోతే, వాళ్లను కొట్టలేదా! ఆ సిప్పగిరి నారాయణస్వామి ఇష్టానుసారం సేసినా సూసి సూడనట్లు ఉన్నిండ్రి! భూముల్దీ పంచాయితీ పెట్టుకునిండ్రి! కర్ణాటక మందు అమ్ముతున్నట్లు ఎన్ని పేపర్లల్ల సూడల్యా. సెంద్రబాబు మొన్న పత్తికొండ మీటింగ్‌కు వచ్చినాపొద్దు కూడా ఇయన్నీ సెప్పలేదా. ఇట్టాటివన్నీ ఇసారిచ్చుకునే జగన్ రెడ్డి సీటు మార్సింటాడు!’
‘అవును మామ! మట్టసంగ జగన్‌రెడ్డితోనే ఉంటే ఎంపీ అయ్యేటోడు! ఇప్పుడు సీటు పంతానికి పోయి ఆలూరు సీటు పోగొట్టుకునె! జిల్లాను కాదని పక్క జిల్లాకు పోవాల్సొచ్చ. మొత్తం కర్నూలు జిల్లా రాజకీయాలతో సంబంధాలు లేకుండా పాయ!పైగా ఆ గుంతకల్లులో గెల్సే పరిస్థితే లేదని అంటున్యారు!’ ఇంక ఈయప్ప రాజకీయం అంతే!’
‘అందుకే ఈరన్న! పెద్దోళ్లు సెప్తారు.. రాజకీయాల్లో హత్యలు ఉండవు! ఆత్మహత్యలే ఉంటాయని! ఇప్పుడు జయరాం సేసిందీ అదే! జిల్లా ‘గుమ్మ’ం దాటి గుంతకల్లు పోతుండాడు.. ఆడ ఓడిపోతే ఇంటా, బయటా రెండుసోట్ల సెడినట్లే!’
‘మామ! ఆయప్ప పోతాండేదీ! జిల్లా గుమ్మం దాటి కాదు.. నా కర్థమైంది, రాజకీయమే ఆయన గుమ్మం దాటిపోయింది!’ అనిపిస్తాండాది!
‘సూడు అందరూ అనుకుంటాండేది! జయరాం శానా తప్పు సేసినాడు! గుంతకల్లులో గెల్సలేడు! విరూపాచ్చి గెల్సినాక ఆలూరులో కూడా సోటుండదు!’ ఇంక ఆయప్ప రాజకీయ జీవితం అంతే!!
‘కాదు మీ మామ అల్లుళ్లు రాజకీయాలు మాట్లాడుకోవడమేనా! బువ్వ పెట్టేదేమన్నా ఉందా! బువ్వ పెడితే మిగిలిన మిరపకాయలు కోసి ఇంటికి పోదాం! ఎండ సావదొబ్బుతుంది!’
‘ఇదో లచ్చిమక్క మోటరు కాడికి పోయి బిందెలో నీళ్లు తీసుకొని రాపో..!!’
సాక్షి ప్రతినిధి, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment