కర్నూలు ఎంపీ టిక్కెట్ జెడ్పీ మాజీ చైర్మన్ బత్తినకు దక్కని వైనం
నేడు పార్టీకి రాజీనామా చేసే యోచన
బస్తిపాటి నాగరాజును అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ అధిష్టానం
కర్నూలు: టీడీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజును ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి కాకుండా వ్యాపారవేత్తకు ఎంపీ టిక్కెట్ ప్రకటించడంపై ఆ పార్టీ నేతల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది.
వ్యాపారవేత్త, ఆదోని పట్టణానికి చెందిన బత్తిని లక్ష్మీనారాయణ, హరియానా గవర్నర్ దత్తాత్రేయ ఓఎస్‌డీ భానుశంకర్, ఇటీవలే టీడీపీలో చేరిన డాక్టర్ సంజీవకుమార్, కర్నూలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు తెలుగుదేశం తరపున ఎంపీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డారు. పార్టీ అధిష్టానం బస్తిపాటి నాగరాజు అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో శుక్రవారం సాయంత్రం టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకుని అధ్యక్షుడు బీటీ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
టీడీపీకి రాజీనామా చేసే యోచనలో బత్తిన
పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం రామలింగాయపల్లె గ్రామానికి చెందిన జెడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టిక్కెట్ కోసం ఆయన విశ్వప్రయత్నం చేశారు. అయితే, బత్తిన సామాజికవర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బస్తిపాటి నాగరాజును ప్రకటించడంతో వెంకటరాముడు తీవ్ర మనస్థాపంతో ఆ పార్టీకి శనివారం రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment