ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీ
కర్నూలులో గెలవలేక టీజీ తాయిలాల ఎర
తన అనుచరులతో చీరల పంపిణీకి రంగం సిద్ధం
ఓటర్లకు స్లిప్పుల పంపిణీ
ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది దాడులు
975 చీరలు స్వాదీనం
కర్నూలు: వరుసగా రెండు సార్లు ఓటమిపాలైన తండ్రీకుమారులు.. ఈసారి గెలుపుకోసం అడ్డదారులు వెతుక్కుంటున్నారు.. చీరల మూటలు తెచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. తమ అనుచరులతో ఓటర్లను ప్రలోభ పెడుతూ రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ.. ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి టీడీపీ నాయకులు దొరికిపోయారు. వీరు కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ అనుచరులు కావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికలకు నెలరోజుల ముందే కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రలోభాలకు తెర లేపారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అదే ఉత్సాహంతో మూడవ సారి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. మారి్నంగ్ వాక్, ఇంటింటి ప్రచారం కార్యక్రమాలతో ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల ఫలాలు వివరిస్తూ ఆపార్టీ నేతలు బిజీగా ఉన్నారు.
మరోవైపు తెలుగుదేశం నేతల్లో సమన్వయం లేదు. తండ్రి టీజీ వెంకటేష్ ఒక పార్టీ, కుమారుడు టీజీ భరత్ మరో పారీ్టలో కొనసాగుతుండటంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. కూటమి ఏర్పడినా ఏ రోజూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలసి తిరిగిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. టీజీ భరత్ ఒక్కరే సైకిల్ యాత్ర పేరుతో కాలనీలలో తిరుగుతున్నా స్పందన అంతంత మాత్రమే.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో ప్రత్యేక మ్యానిఫెస్టో పేరుతో ఆ పార్టీ నేతలు నగర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి తండ్రీ కుమారులు ఓడిపోయారు. ఆ పారీ్టకి వెన్నుదన్నుగా ఉన్న లక్కీ–2 కుటుంబం కాంగ్రెస్ పారీ్టలో చేరింది. పి.జి.నరసింహులు యాదవ్ కొత్తపేట ప్రాంతంలో గతంలో కార్పొరేటర్‌గా స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా పనిచేశారు.
తాజాగా వీరి కుటుంబంలోనే ఉన్న 51వ వార్డు కార్పొరేటర్ మౌనిక రెడ్డి శుక్రవారం తెలుగుదేశం పారీ్టకి, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. వీరంతా టీజీ కుటుంబానికి మద్దతుగా ఉండేవారు. ఇప్పుడు వీరంతా వెంట లేరు. పారీ్టలో నైరాశ్యం ఉంది. జోష్ లేదు. ఏలాగైన గెలవాలన్న ఉద్దేశంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇక్కడ టీజీ భరత్ ప్రయత్నాలు చేస్తున్నారు.
చీరలతో ఓటర్లకు ఎర..
తమ ప్రభుత్వ హయంలో ఫలానా పనులు చేశాం. ఓట్లు వేయండి అని చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో తెలుగుదేశం నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. నగరంలోని ఎర్రబురుజు వద్ద కార్యకర్తలను కొంతమందిని నియమించి పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సమీపంలోని విక్టరీ థియేటర్‌లో చీరల మూటలు దాచారు. ఎర్రబురుజు, బొంగుల బజార్, నెహ్రూరోడ్డు, మించిన్ బజార్ వంటి కాలనీలలో ముందుగానే స్థానిక తెలుగుదేశం నాయకులు ఓటర్లకు స్లిప్పులు పంచారు. ఒకేసారి అందరూ వెళ్లకుండా పక్కాగా ప్రణాళిక ప్రకారం చీరల పంపిణీకి రంగం సిద్దం చేశారు. గుట్టుగా ఎర వేసి ఓట్లు కొల్లగొట్టేందుకు చేసిన టీడీపీ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి.
ఓటర్లకు పంపిణీ చేసేందుకు టీడీపీ వారు దాచిన చీరల మూటలు
సమాచారం మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు..
కర్నూలు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కమిషన్ నియమించిన ఫ్ల్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో విక్టరీ థియేటర్‌లో తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో మూటల మాటున దాచిన చీరలు బయట పడ్డాయి. మొత్తం 975 చీరలు స్వాదీనం చేసుకున్నారు. ఒక్కొక్క చీర రూ.200 ప్రకారం ఉన్నట్లు గుర్తించిన అ«ధికారులు దాదాపు రూ.2 లక్షలు విలువ చేసే చీరలను సీజ్ చేసి నగరపాలక కార్యాలయానికి తరలించారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు రిటరి్నంగ్ అధికారి భార్గవ్‌తేజ వెల్లడించారు.
ఎన్నికల ప్రవర్తన నియామావళిని తప్పకుండా పాటించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే తాను గెలిస్తే ఇది చేస్తా.. అది చేస్తా అని చెప్పుకునేందుకు ఏమీ లేక తాయిలాలు నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని పలువురు విమర్శిస్తున్నారు.
తాగినోళ్లకు తాగినంత..
గత ఆదివారం.. ఓ హోటల్ కేంద్రంగా టీజీ భరత్ విందురాజకీయం నడిచింది. అప్పటికే అందిన సమాచారం మేరకు.. సాయంత్రానికి కొన్ని కుల సంఘాల ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. కులాల వారీగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు సుమారు పది మంది కూర్చునే వెసలుబాటు కల్పించారు. సమావేశంలో తమ భవిష్యత్‌కు హామీ లభిస్తుందనుకుని అందరూ ఆత్రుతగా ఎదురుచూశారు.
ఇంతలో టీజీ భరత్ వచ్చి.. అందరూ సహకరిస్తే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెనుదిరిగారు. అప్పుడు మొదలైంది.. తాగినోళ్లకు తాగినంత మందు. రాత్రి సుమారు 11 గంటల వరకు ఈ తతంగం నడిచింది. అంతేకాదు.. తిన్నంత భోజనం కూడా ఏర్పాటు చేశారు.. ఎన్నికల సమయం కదామరి! ఏదో సమావేశం అనుకుని వచ్చిన కొందరు పెద్దలు ఇదేం పని అనుకుని నిట్టూర్చి బయటకు వెళ్లిపోగా.. మరికొందరు ఎంచక్కా విందు, మందుతో ఊగితూగుతూపోయారు.
ఓ ఫంక్షన్ హాలులోనూ..?
నగరంలోని సంకల్‌బాగ్ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాలులో టీడీపీకి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో తాయిలాలు దాచి పెట్టినట్లు సమాచారం. ఒకే చోట చీరలు, బహుమతులు దాచి పెడితే ఇబ్బందులు వస్తాయని టీజీ అనుచరులు ఈ ఫంక్షన్ హాలులో దాదాపు 30 వేల నుంచి 50 వేల దాకా చీరలు దాచి ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఎన్నికల పర్యవేక్షణ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది విక్టరీ థియేటర్‌లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న చీరలను పెద్ద సంఖ్యలో స్వా«దీనం చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.
కుల సంఘాలకు ఎర..
కులాల వారీగా నాయకులను ఎన్నికల వేళ ప్రలోభపెట్టేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారీగా తాయిలాలు ప్రకటించడమే కాక ముఖ్యమైన వారికి విందులు ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు. భరత్ వార్డుల వారీగా కొంతమందిని చేరదీసి వార్డుల్లో ఇంటింటికీ డబ్బులు పంపిణీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. తనకు అనుకూలంగా ఉన్న వార్డుల్లోని ముఖ్యులను పిలిపించుకొని ప్రాంతాల వారీగా ఓటర్లను గుర్తించి కానుకలు పంపిణీ చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment