Kurnool : టీడీపీలో ‘బొగ్గుల’ కుంపటి | Too much fight in TDP team in Kurnool | Sakshi
Sakshi News home page

Kurnool : టీడీపీలో ‘బొగ్గుల’ కుంపటి

Published Mon, Apr 1 2024 1:25 AM | Last Updated on Mon, Apr 1 2024 6:50 PM

భూపాల్‌ కాంప్లెక్స్‌లో సమావేశమైన కోడుమూరు నియోజకవర్గ కోట్ల వర్గీయులు  - Sakshi

భూపాల్‌ కాంప్లెక్స్‌లో సమావేశమైన కోడుమూరు నియోజకవర్గ కోట్ల వర్గీయులు

ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ‘కోట్ల’ వర్గం

అధిష్టానం ఏకపక్ష నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి

బొగ్గుల దస్తగిరిని ఓడించేందుకు నిర్ణయం

రెబల్‌ అభ్యర్థిగా ఆకెపోగు ప్రభాకర్‌!

కర్నూలు: టీడీపీలో ముసలం పుట్టింది. కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై వ్యతిరేకంగా ఉన్న వారంతా ఒక్కటయ్యారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వర్గంగా ముద్ర పడిన వారంతా మొదటి నుంచి బొగ్గుల దస్తగిరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.

పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తూ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆకెపోగు ప్రభాకర్‌కు టికెట్‌ వస్తుందని అందరు భావించారు. అయితే ఊహించని రీతిలో పార్టీ సభ్యత్వం కూడా లేని బొగ్గుల దస్తగిరిని అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆకెపోగు ప్రభాకర్‌ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు ఎలాంటి భరోసా లభించలేదు. కోట్ల వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత కల్పించక పోవడంతో ఆ వర్గానికి చెందిన నాలుగు మండలాల ముఖ్య నాయకులు కర్నూలులోని భూపాల్‌ కాంప్లెక్స్‌లో భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు.

ఆకెపోగు ప్రభాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి గూడూరు మాజీ జెడ్పీటీసీ, మండల టీడీపీ కన్వీనర్‌ జూలకల్లు సుధాకర్‌రెడ్డి, కర్నూలు మండల పార్టీ అధ్యక్షులు శంకర్‌, కోడుమూరు మాజీ సర్పంచ్‌ సీబీలత, కోడుమూరు సింగిల్‌ విండో అధ్యక్షులు మధుసూధన్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు హేమాద్రిరెడ్డి, కర్నూలు మార్కెట్‌ యార్డు మాజీ వైస్‌ చైర్మన్‌ సుందర్‌రాజు, గుడిపాడు చంద్రారెడ్డి, భాస్కర్‌రెడ్డి, పంచలింగాల రాజశేఖర్‌రెడ్డి, కొత్తకోట సర్పంచు శ్రీనివాసులు, ఉల్చాల మాజీ సర్పంచు రాఘవేంధ్ర, గూడురు మైనారిటీ సెల్‌ కన్వీనర్‌ సలీం, తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి వంశీధర్‌రెడ్డి, టీడీపీ బీసీ సెల్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి విజయకుమార్‌తో పాటు పలువురు క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ కమిటీల ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

రెబల్‌ అభ్యర్థిగా ఆకెపోగు ప్రభాకర్‌?

సమావేశంలో టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. టీడీపీ సీనియర్‌ నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి వర్గంగా ముద్రపడిన బొగ్గుల దస్తగిరిని ఎన్నికల్లో ఓడించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఆకెపోగు ప్రభాకర్‌ను రెబల్‌ అభ్యర్థిగా బరిలో నిలపాలని కొందరు నేతలు చేసిన ప్రతిపాదనకు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశం విషయం బయటకు పొక్కిన నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న డాక్టర్‌ శ్రీనివాసమూర్తి రంగంలోకి దిగారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఫోన్‌లో కోరినట్లు సమాచారం. అయితే మరో రెండు రోజుల్లో కోడుమూరులో సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను తీసుకొని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

పార్టీ మారేందుకు సమాలోచనలు..

సమావేశంలో కొందరు ఆకెపోగు ప్రభాకర్‌ను రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేయిద్దామనగా, వద్దొద్దు .. మనమే పార్టీ మారదాం, వైఎస్సార్‌సీపీలోకి వెళ్లి సత్తా చాటుదామని మరి కొందరు నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సమావేశానికి కర్నూలు రూరల్‌, కోడుమూరు, గూడురు, సీ బెళగల్‌ మండలాలకు చెందిన ముఖ్య నేతలు హాజరై ప్రభాకర్‌కు మద్దతు ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement