నిందితుడు అభీర్ చంద
గుంటూరు: ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని గుంటూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం గుంటూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్‌వి రాజశేఖరబాబు వివరాలు వెల్లడించారు. ఇటీవల గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బీరవల్లిపాలెం గ్రామానికి చెందిన బుకీ పసుపులేటి నాగరాజుతో పాటు భోపాల్‌కు చెందిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి ద్వారా వెబ్‌సైట్ యజమానిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అభీర్ చందగా గుర్తించారు. అతను ఆ రాష్ట్రంలోని కూచ్‌బిహార్ జిల్లా దిన్లాటా గ్రామంలో ఉన్నట్లు తెలుసుకుని శనివారం అదుపులోకి తీసుకున్నారు.
అక్కడ కోర్టులో హాజరు పరిచి గుంటూరుకు తరలించారు. కోల్‌కత్తాకు చెందిన సాఫ్ట్‌వేర్ డిజైనర్ సాయన్ గోష్‌కు సోమవారం గుంటూరులో విచారణకు హాజరుకావాలని నోటీసు జారీ చేశారు. నిందితుడు అభీర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మొత్తం 12 మంది మాస్టర్ బుకీలు ఉన్నారు. వారి పరిధిలో 50 మంది మాస్టర్ డిస్ట్రిబ్యూటర్లు, 60 మంది ప్రధాన బుకీలు, 400 మంది సబ్ బుకీలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఇక పంటర్స్ దేశవ్యాప్తంగా వేలాది మంది ఉన్నారు. ఇతర దేశాల్లో అధికారికంగా బెట్టింగ్‌కు లైసెన్సులు ఉన్నందున అక్కడ నుంచి సాఫ్ట్‌వేర్ కొని వివిధ క్రీడల బెట్టింగ్‌కు అనుకూలంగా రూపొందించారు. వాటిలో మన దేశంలో ప్రధానంగా 6 రకాల క్రీడల్లో బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు సెల్‌ఫోన్లు, బంగారు చైను, బ్రేస్‌లెట్‌తో పాటు బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 7 లక్షల నగదును సీజ్ చేశారు. గేమింగ్ యాక్ట్, ఐటీ యాక్ట్‌తో పాటు సెక్షన్ 420 ప్రకారం కేసు నమోదు చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న బుకీలను అరెస్టు చేసేందుకు ఏఎస్పీ ఎస్ వరదరాజు ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నారు. జిల్లాకు చెందిన బుకీలు కొందరిని ఇప్పటికే గుర్తించారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. నిందితుడిని అరెస్టు చేసిన బృందం సభ్యులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ ఎస్.వరదరాజు, డీఎస్పీ యు కాలేషావలి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment