క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో బుకీలతో మమేకమే.. వసూళ్లకు తెగబడిన పోలీసు అధికారుల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. ఇప్పటికే జిల్లాలో పలువురు అధికారులు, సిబ్బందిపై వేటు పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీఐలు, డీఎస్పీల పాత్ర కూడా ఉన్నట్టు బుకీలు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. దీంతో పూర్తి ఆధారాలతో వారిపైనా ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
సాక్షి, గుంటూరు : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా దెబ్బకు ఎన్నో కుటుంబాలు బలవుతున్నా పోలీస్ అధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. జిల్లా రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు దీనిపై సీరియస్‌గా దృష్టి సారించారు. క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకుని పోలీస్ అధికారుల పాత్రపై సమగ్ర సమాచారాన్ని రాబట్టడంతో పాటు పక్కా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మహమ్మారిని అరికట్టాలంటే ముందుగా ఇంటి దొంగల పని పట్టాలని భావించిన ఎస్పీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎస్సైలు, ఓ ఏఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేసిన ఎస్పీ మరో ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. త్వరలో మరికొందరు పోలీస్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న కీలక బుకీలను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీస్ ఉన్నతాధికారులకు కళ్లు చెదిరే వాస్తవాలు బయటకు వచ్చినట్లు సమాచారం.
క్రికెట్ బుకీలు బెట్టింగ్ నిర్వహణకు అడ్డు లేకుండా చేసుకునేందుకు కొందరు పోలీస్ అధికారులను తమ అదుపులో పెట్టుకుని యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగించినట్లు తేలింది. జిల్లాలోని పలువురు సీఐలు, డీఎస్పీలు సైతం క్రికెట్ బుకీల నుంచి భారీ ఎత్తున మామూళ్లు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఎస్పీ దీనిపై సీరియస్‌గా దృష్టి సారించారు. నరసరావుపేటకు చెందిన ఇద్దరు కీలక బుకీల ద్వారా సీఐలు, డీఎస్పీల పాత్రపై పూర్తి సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారంతో పూర్తిస్థాయి విచారణ జరిపి కీలక ఆధారాలను రాబట్టిన అనంతరం వీరిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గుంటూరు పోలీస్ రేంజ్ పరిధిలోని నెల్లూరులో ఎస్పీ రామకృష్ణ క్రికెట్ బుకీలను ఏరివేయడంతో పాటు నలుగురు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్సైలపై వేటు వేసిన విషయం తెలిసిందే. నెల్లూరుకు చెందిన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలను సస్పెండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు అందడంతో జిల్లాలోని అవినీతి పోలీస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అతి త్వరలో జిల్లాలోనూ పలువురు సీఐలు, డీఎస్పీలపై సైతం సస్పెన్షన్ వేటు పడనుందని పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోననే భయాందోళనలో వీరు ఉన్నట్లు సమాచారం. దీంతో తమపై వేటు పడకుండా చూడాలంటూ అధికార పార్టీ ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
డ్రైవర్లు, హోంగార్డుల ద్వారా వసూళ్లు
జిల్లాలోని కొందరు సీఐలు, డీఎస్పీలు తమ వద్ద పనిచేసే డ్రైవర్లు, హోంగార్డుల ద్వారా క్రికెట్ బుకీల నుంచి డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. క్రికెట్ బుకీలతో వారి సెల్‌ఫోన్‌ల నుంచి మాట్లాడి బేరసారాలు నడిపినట్లు చెబుతున్నారు. జిల్లాలోని పలు సర్కిళ్లలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీఐలకు సదరు హోంగార్డులు, డ్రైవర్‌లే ఆదాయ వనరుల గురించి చెప్పి వసూలు చేసి ఇస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తొలగించిన ఎస్పీ జిల్లాలో వివాదాస్పదంగా ఉన్న హోంగార్డులతో పాటు అధికారులకు వసూళ్లు చేసి పెడుతున్న కానిస్టేబుళ్ల జాబితాను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment