టీడీపీ నేతలే బుకీలు..! | TDP Leaders In Cricket Betting Gang Guntur | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలే బుకీలు..!

Published Fri, Aug 17 2018 1:57 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

TDP Leaders In Cricket Betting Gang Guntur - Sakshi

మంత్రి నారా లోకేష్‌తో అంతర్జాతీయ క్రికెట్‌ బుకీ మారుతి (ఫైల్‌) ,టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎంపికైన మారుతిని సన్మానిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు (ఫైల్‌)

టాస్‌ నుంచి బాల్‌ బాల్‌కి పందెం. గెలిచిన వారికి ఆనందం.. ఆస్తులు ఆవిరై ఓడిన వారికి నిర్వేదం. వీటి నడుమ బుకీలుగా మారి అమాయకుల బతుకులను బుగ్గి చేస్తున్న టీడీపీ నేతల చిద్విలాసం. ఇదీ జిల్లాలో యువత జీవితాలతో చెలగాటమాడుతున్న క్రికెట్‌ బెట్టింగ్‌ జాఢ్యం. అభిమానాన్ని ఆసరాగా చేసుకుని ప్రాణాలతో పందేలాడుతున్న టీడీపీ నేతల కాసుల కక్కుర్తి ఇది. అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలతో అంతర్జాతీయ స్థాయి బుకీలుగా ఎదిగిన ద్వితీయ శ్రేణి నేతల బెట్టింగ్‌ మాఫియా కథ ఇది. ఎట్టకేలకు వీరి అరాచకాలకు కళ్లెం పడింది. జిల్లా ఎస్పీల తెగువ.. బుకీల కీలు విరిచి కటకటాల వెనక్కి పంపింది.

సాక్షి,గుంటూరు: జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌ల్లో అప్పుల పాలై ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.. మరెన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. అప్పుల భారంతో మొఖం చూపించుకోలేక అనేక కుటుంబాలు ఇతర జిల్లాలకు వలసలు వెళ్లాయి.. దీనికంతటికి కారణం అధికార పార్టీ ముఖ్యనేతల కనుసన్నల్లో నడుస్తున్న బెట్టింగ్‌ మాఫియా. జిల్లాలో అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు అంతర్జాతీయ క్రికెట్‌ బుకీల వరకు ఎదిగారు. మొన్న పెదకూరపాడుకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే మేనల్లుడు క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ గుంటూరు అర్బన్‌ పోలీసులకు చిక్కాడు. నిన్న పిడుగురాళ్ళ మున్సిపల్‌ వార్డు కౌన్సిలర్‌.. నేడు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతూ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు దొరికిపోయారు. అంతకు ముందు రెంటచింతల మండల పరిషత్‌ ఉపాధ్యక్షుని సోదరుక్రిడు కెట్‌ బెట్టింగ్‌లో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల చేతికి చిక్కాడు. వీరిని బెట్టింగ్‌ కేసుల్లో అరెస్టు చేయకుండా వదిలేయాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ గుంటూరు అర్బన్, రూరల్‌ ఎస్పీలు తలొగ్గకుండా బుకీల ఆట కట్టించారు. 

టీడీపీ ముఖ్యనేతల అండదండలతో..
జిల్లాలలో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న కీలక బుకీలంతా అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు కావడం గమనార్హం. వీరి కనుసన్నల్లోనే క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియా జిల్లా వ్యాప్తంగా నడుస్తోంది. గుంటూరు అర్బన్‌ ఎస్పీ క్విక్‌ రియాక్షన్‌ టీమ్, సీసీఎస్‌ బృందాలతో, గుంటూరు రూరల్‌ ఎస్పీ టాస్క్‌ఫోర్స్, సీసీఎస్‌ పోలీసుల బృందాలతో జిల్లా వ్యాప్తంగా దాడులు చేయిస్తూ కీలక క్రికెట్‌ బుకీల ఆట కట్టిస్తున్నారు. గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసులు గతంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తూ అందులో అప్పుల పాలైన బాధితుల నుంచి పొలాలు, స్థలాలు బలవంతంగా రాయించుకుంటున్నట్లు ఫిర్యాదులు అందడంతో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను అరెస్టు చేశారు. అందులో కీలక బుకీగా ఉన్న బాలాజీ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు వరుసకు మేనల్లుడు కావడంతో ఆయన్ను వదిలేయాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. పోలీసులు మాత్రం అతనితోపాటు, బెట్టింగ్‌ ముఠాను అరెస్టు చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో గుంటూరు రూరల్‌ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పిడుగురాళ్లలోని ఓ రెస్టారెంట్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న స్థానిక రెండో వార్డు కౌన్సిలర్‌ కోయ శ్యామలరావు అలియాస్‌ శ్యామ్‌తోపాటు అధికార పార్టీ నేతలు చల్లగుండ్ల బాబూరావు, గుదె భీష్మ మరి కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. తాజాగా జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు, నరసరావుపేట పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు అయిన శాఖమూరి మారుతి నవీన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను అమెరికా, న్యూయార్క్, ఆస్ట్రేలియా దేశాల్లో సైతం సబ్‌ బుకీలను ఏర్పాటు చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అనేక సంవత్సరాలుగా నరసరావుపేటలో ఉంటూ క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నప్పటికీ స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. అధికార పార్టీ ముఖ్య నేత తనయునికి అనుచరుడు కావడంతో గతంలో బుకీలను అరెస్టు చేసిన సమయంలో పక్కనే ఉన్నప్పటికీ వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.  

ఎస్పీలను టార్గెట్‌ చేస్తారు
జిల్లాలో క్రికెట్‌ బుకీలకు అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో జిల్లా ఎస్పీగా పని చేసిన పీహెచ్‌డీ రామకృష్ణ బెట్టింగ్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. దీంతో అధికార పార్టీ నేతలు ఎనిమిది నెలలు గడవకుండానే ఆయన్ను బదిలీ చేయించారు. బుకీలంతా అధికార పార్టీ నేతలకు కోట్లలో ముడుపులు సమర్పించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అర్బన్, రూరల్‌ ఎస్పీలు క్రికెట్‌ బెట్టింగ్‌పై సీరియస్‌గా దృష్టి సారించడంతో అధికార పార్టీ నేతలు వీరినీ బదిలీ చేయించేందుకు పావులు కదుపుతున్నాట్లు సమాచారం. గతంలో క్రికెట్‌ బుకీల జోలికి వెళ్లిన ఎస్సై, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు పోస్టింగ్‌లు లేక లూప్‌ లైన్లలో ఉన్నారు. బుకీలకు సహకరించి మామూళ్లు పుచ్చుకున్న వారు సబ్‌ డివిజన్‌లు, సర్కిళ్లు, పోలీసు స్టేషన్‌లలో తిష్ట వేసి కూర్చున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement