చిలకలూరిపేటకు చెందిన శీలం సతీష్ బంగారు దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబం. సాఫీగా సాగుతున్న అతని జీవితంలోకి అదే పట్టణానికి చెందిన ఓ క్రికెట్ బెట్టింగ్ బుకీ పరిచయం అయ్యాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందంటూ బెట్టింగ్‌లకు పాల్పడేలా ప్రోత్సహించాడు. మొదట్లో బాగానే డబ్బులు గెలుచుకున్న సతీష్ తర్వాతి మ్యాచ్‌ల్లో పోగొట్టుకుని మాయలో పడి రూ. 70 వేలు అప్పులు చేశాడు. ఇటీవల పందేలు కాస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. క్రికెట్ బెట్టింగ్ వల్ల చాలా నష్టపోయాయని, పందేలు కాయడం వల్ల డబ్బులు పోగొట్టుకోవడమే తప్పా లాభం ఉండదు అని చెప్పాడు.
సాక్షి, గుంటూరు: ఫ్రాంచైంజీలు, ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ మధ్యతరగతి కటుంబాలను మాత్రం రోడ్డు పాలు చేస్తోంది. క్రెకెట్ బుకీల మాయమాటలు నమ్మి సాధారణ మధ్యతరగతి యువకులు, విద్యార్థులు సర్వం కోల్పోయి రోడ్డున పడుతుంటే, కొందరు పోలీసలకు పట్టుబడి జైలుపాలు అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ పట్టుబడిన వారిలో ఎక్కువ శాతం మంది హోటళ్లలో పని చేసే వారు, కూలీ పనులు, చిరు వ్యాపారులే ఉన్నారు. వీరంతా క్రికెట్ బెట్టింగ్ బుకీల మాయమాటలు నమ్మి పందేలు కాస్తూ సర్వం కోల్పోయిన వారే. ఎవరిని కదిపినా అప్పుల పాలయ్యాం అని చెప్పేవారే. బెట్టింగ్‌ల్లో సర్వం కోల్పోయి పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు సైతం జిల్లాలో అనేకం ఉన్నాయి. అయినప్పటికీ బెట్టింగ్ రాయుళ్లలో మార్పు రావడం లేదు.
బుకీలు మోసం చేస్తోంది ఇలా..
వివిధ రాష్ట్రాల్లో ప్రధాన క్రికెట్ బూకీలు ఇతర ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని కమీషన్ల మీద వారిని నియమించుకుంటారు. దీని కోసం ఓ ప్రత్యేక ఫోన్‌లైన్ సెట్ అప్ చేసుకుని వాటి ద్వారా ఎప్పటికప్పుడు మ్యాచ్‌లో చోటు చేసుకునే అంశాల మీద పందెం ధరల్ని నిర్ణయిస్తూ ఫండర్లను ఆకర్షిస్తుంటారు. ఇందులో టాస్ ఎవరు గెలుస్తారు.. సెషన్స్ ప్రతి ఐదు ఓవర్లలో స్కోరు ఎంత వరకు వస్తుంది.. బాల్ టూ బాల్..తరువాతి బాల్‌లో వికెట్ పడుతుందా ... సిక్స్ కొడతారా అంటూ బుకీలు వారికి అనుగుణంగా ధరలు పెంచుతుంటారు. ఈ విషయం తెలియని పందెం రాయుళ్లు టీవీల్లో మ్యాచ్‌లు తిలకిస్తూ ఊహించని బెట్టింగ్‌లు కడుతుంటారు. అయితే 90% బెట్టింగ్ ఫలితాలు ఫండర్ల ఊహకు భిన్నంగా ఉంటుంది. అబ్బ జస్ట్ మిస్ నెక్టŠస్ టైం కచ్చితంగా గెలుస్తాం అంటూ డబ్బు పోగొట్టుకుంటున్నారు అమాయక ప్రజలు.
బుకీలందరూ టీడీపీ నేతలే...
రాజధాని ప్రాంతంలో అమాయక ప్రజల్ని క్రికెట్ బెట్టింగ్‌ల పేరుతో మోసం చేస్తున్న వారిలో టీడీపీ నేతలు అధికంగా ఉన్నారు. ఇటీవల పిడుగురాళ్ల మున్సిపల్ కౌన్సిలర్ »బెట్టింగ్ నిర్వహిస్తూ అరెస్టయిన విషయం తెలిసిందే. చిలకలూరిపేటలో పట్టిబడిన బుకీలు తన్నీరు వెంకటేశ్వర్లు, గొట్టిపాడు సదాశివరావు, కామినేని ప్రధీప్‌కుమార్ అధికార పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తెగబడి క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న సంఘటన ప్రజల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. అమాయక ప్రజల్ని మాయమాటలతో మోసం చేస్తున్నారు.
చివరకు మిగిలేది విషాదమే..
క్రికెట్ బెట్టింగ్‌ల ద్వారా వచ్చే డబ్బు వల్ల స్వల్ప కాలం మాత్రమే ఆనందం ఉంటుంది. ఆ తర్వతా విషాదమే మిగులుతుంది. బుకీల మాయ మాటలు నమ్మి ఎవరూ బెట్టింగ్‌లలో డబ్బులు పెడుతూ నష్టపోవద్దు. స్వల్పకాలిక ఆనందం కోసం బెట్టింగ్‌లకు పాల్పడి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఎక్కువ శాతం మధ్యతరగతి, సాధారణ యువకులు, విద్యార్థులను టార్గెట్ చేస్తూ బుకీలు మాయమాటలు చెప్తూ మోసం చేస్తుంటారు. అవి నమ్మి సర్వం కోల్పోకుండా అప్రమత్తంగా వ్యవహరించండి.– రూరల్ ఎస్పీ, సీహెచ్ వెంకటప్పలనాయుడు
Comments
Please login to add a commentAdd a comment