గురజాల ఎమ్మెల్యే యరపతినేనితో టీడీపీ పిడుగురాళ్ళ మున్సిపల్ కౌన్సిలర్ కోయ శ్యామలారావు (సర్కిల్‌లో ఉన్న వ్యక్తి) (ఫైల్)
రేషన్ బియ్యం నుంచి గంజాయి సరఫరా వరకు.. అక్రమమైనింగ్ నుంచి రంగురాళ్ల వేట వరకు.. దారిదోపిడీల నుంచి పేకాట క్లబ్‌ల వరకు... అక్రమ దందాలన్నీ అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా పిడుగురాళ్లలోని ఓ హోటల్‌లో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న అధికార పార్టీ నేతల బండారం టాస్క్‌ఫోర్స్ బృందాల దాడిలో బట్టబయలైంది. నిందితుల్లో టీడీపీ కౌన్సిలర్‌తోపాటు పలువురు నాయకులు ఉండటంతో ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో గతంలో కనీవినీ ఎరుగని రీతిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక, మట్టి, బియ్యం అక్రమ రవాణా, అక్రమ మైనింగ్, బెల్టుషాపులు, ఇలా ప్రతి విషయంలో అక్రమాలకు పాల్పడుతూ కోట్లు గడిస్తున్నారు. అయినా వీరికి ధన దాహం తీరడం లేదు. పేకాట, గంజాయి, క్రికెట్ బెట్టింగ్, రంగురాళ్ల వేట, దొంగనోట్లు వంటి అసాంఘిక కార్యకలాపాలను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలే స్వయంగా నిర్వహిస్తుండడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
గతంలో దాచేపల్లిలో పేకాట క్లబ్‌ను ఏర్పాటు చేసి యథేచ్ఛగా పేకాట ఆడించిన వ్యవహారం ముఖ్యమంత్రి వద్ద పంచాయతీ జరగడం, అనంతరం యువనేత ఆదేశాలతో మళ్లీ తెరుచుకోవడం, పోలీసు ఉన్నతాధికారులు దీనిపై సీరియస్‌గా దృష్టి సారించి మూసివేయించిన ఘటన అందరికీ తెలిసిందే. దాచేపల్లి మండలంలోని అటవీ భూముల్లో మండల స్థాయి ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో రాత్రి వేళల్లో రంగురాళ్లను తవ్వి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర సంచలనం కలిగించింది. మాచర్ల నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్య నేత అనుచరులు దొంగ నోట్లు మారుస్తూ నల్లగొండ పోలీసులకు దొరికిపోయిన విషయం కూడా తెలిసిందే. జిల్లా రూరల్ ఎస్పీగా పీహెచ్‌డీ రామకృష్ణ ఉన్న సమయంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం, దీనిపై ఆగ్రహించిన అధికార పార్టీ ముఖ్య నేత ఆయన్ను బదిలీ చేయించిన విషయం తెలిసిందే. పిడుగురాళ్ళ, కారంపూడి, దాచేపల్లి వంటి ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న అధికార పార్టీ నేతలను స్పెషల్ పార్టీ పోలీసులు పలుమార్లు అరెస్టు చేశారు.
తాజాగా పిడుగురాళ్ళ పట్టణంలోని అపూర్వ హోటల్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలను టాస్క్‌ఫోర్స్ బృందాలు అరెస్టు చేశారు. అధికారపార్టీకి చెందిన పిడుగురాళ్ళ మున్సిపాలిటీ రెండోవార్డు కౌన్సిలర్ కోయ శ్యామలారావు అలియాస్ శ్యామ్, ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న గుదె భీష్మ, మొదటి నిందితుడు చల్లగుండ్ల బాబురావుతో పాటు పలువురు అధికార పార్టీ నేతలు వీరిలో ఉన్నారు. వీరిని విడిపించేందుకు అధికార పార్టీ ముఖ్యనేత చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యా యి. వీరి వద్ద భారీ స్థాయిలో గంజాయి సైతం పట్టుబడడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మహమ్మారికి అనేక మంది అమాయకులు బలవగా, వందల కుటుంబాలు రోడ్డు పాలయ్యారు. అలాంటి క్రికెట్ మాఫియాను అడ్డుకోవాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులే వారికి అండగా నిలుస్తూ కొమ్ముకాస్తుండడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్రమాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించవద్దంటూ వేదికలపై ఉపన్యాసాలు చెప్పే ప్రజాప్రతినిధులే వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేయడం విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment