నేర నియంత్రణకు ‘జీఎస్‌ఎఫ్‌’ | GSF For Criminal Regulation In Guntur | Sakshi
Sakshi News home page

నేర నియంత్రణకు ‘జీఎస్‌ఎఫ్‌’

Published Sat, May 26 2018 1:22 PM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

GSF For Criminal Regulation In Guntur - Sakshi

నూతనంగా శిక్షణ పూర్తిచేసుకుని ఎస్పీ వద్ద రిపోర్ట్‌ చేసిన కానిస్టేబుళ్లు ఇన్‌సెట్‌.. అర్బన్‌ ఎస్పీ సి.హెచ్‌.వెంకటప్పలనాయుడు

జీఎస్‌ఎఫ్‌...ఈ పేరు చెబితే గుంటూరు జిల్లా పోలీసు అధికారులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గుంటూరు రూరల్‌ ఎస్పీగా వచ్చినప్పటి నుంచి సీహెచ్‌ వెంకటప్పలనాయుడు ప్రధానంగా  క్రికెట్‌ బెట్టింగ్‌పై దృష్టిసారించారు. తీగ లాగితే డొంక కదిలినట్టు బెట్టింగ్‌ బుకీలను అరెస్టు చేస్తుంటే, వారి వెనుక ఉన్న పోలీసు అధికారుల బాగోతం  వెల్లడైంది. దీంతో నివ్వెరపోయిన ఎస్పీ జిల్లాలో నేరాల నియంత్రణతో పాటు తమ శాఖను కూడా ప్రక్షాళన చేయాలని సంకల్పించారు. డిపార్టుమెంట్‌లో పని చేస్తున్న వారితో కాకుండా కొత్తవారితో ఒక టీం ఏర్పాటు చేస్తే సత్ఫలితాలు ఉంటాయని భావించారు. నూతనంగా శిక్షణ పూర్తిచేసుకుని జిల్లాకు వచ్చిన 460 మంది కానిస్టేబుళ్లతో గుంటూరు స్పెషల్‌ ఫోర్స్‌(జీఎస్‌ఎఫ్‌) పేరుతో ఒక దళం తయారు చేశారు. 20 బృందాలుగా విభజించి జిల్లాలో త్వరలో వీరిని రంగంలోకి దింపనున్నారు.

సాక్షి, గుంటూరు: అవినీతి పోలీసు అధికారుల ఆట కట్టించడంతో పాటు, జిల్లాలో క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి నేరాలను అదుపు చేసేందుకు గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ సి.హెచ్‌.వెంకటప్పలనాయుడు గుంటూరు స్పెషల్‌ ఫోర్స్‌(జీఎస్‌ఎఫ్‌)కు శ్రీకారం చుట్టనున్నారు. గుంటూరు రూరల్‌ జిల్లాకు నూతనంగా 460 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకుని వచ్చారు. ప్రస్తుతం వారంతా ఫీల్డ్‌ స్టడీస్‌లో ఉన్నారు. మామూలుగా అయితే వారిని పోలీసుశాఖలోని వివిధ విభాగాలకు కేటాయించి ఉద్యోగ బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అయితే నూతనంగా వచ్చిన కానిస్టేబుళ్లలో అధిక శాతం మంది గ్రాడ్యుయేట్, పోస్ట్రుగాడ్యుయేట్‌లు ఉండడంతో వారిని మొదటి నుంచే సక్రమంగా పనిచేయించాలనే తలంపుతో ఎస్పీ వెంకటప్పలనాయుడు గుంటూరు స్పెషల్‌ ఫోర్స్‌ (జీఎస్‌ఎఫ్‌)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా పక్కా ప్రణాళిక రూపొందించారు. వీరందరిని 20 ప్రత్యేక గుంటూరు స్పెషల్‌ ఫోర్స్‌ (జీఎస్‌ఎఫ్‌) బృందాలుగా ఏర్పాటుచేశారు. వీరిపై పర్యవేక్షణ కోసం 12 మంది ప్రత్యేక అధికారులను నియమించేలా సమాయత్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ బృందాలు తిరిగేందుకు కావాల్సిన వాహనాలు, బడ్జెట్‌ వంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత జీఎస్‌ఎఫ్‌ను ప్రారంభించనున్నారు. 

క్షేత్రస్థాయిలో అవగాహనకు ఫీల్డ్‌ స్టడీస్‌
నూతన కానిస్టేబుళ్లల్లో అధిక శాతం మంది విద్యాధికులున్నట్టు గుర్తించిన ఎస్పీ వారిని సమర్థంగా పనిచేసేలా తీర్చిదిద్దేందుకు జీఎస్‌ఎఫ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వీరికి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయిలో నడుచుకోవాల్సిన తీరుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఇప్పటికే ఫీల్డ్‌ స్టడీస్‌ పేరుతో జిల్లాలోని పలు పోలీసు స్టేషన్‌లతోపాటు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఏఆర్, స్పెషల్‌ బ్రాంచ్, డీసీఆర్బీ, సీసీఎస్‌ వంటి విభాగాలకు కేటాయించి మెలకువలు నేర్పుతున్నారు. ఫీల్డ్‌ స్టడీస్‌ 15 రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో వీరితో సమావేశం నిర్వహించి ఇప్పటివరకు వీరు క్షేత్రస్థాయిలో ఏం చేశారు? ఏం నేర్చుకున్నారు? ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఎలా చేయాలనుకుంటున్నారు? అనే అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. జిల్లాకు కేటాయించిన 460 మంది నూతన కానిస్టేబుళ్లను 20 జీఎస్‌ఎఫ్‌ బృందాలుగా ఏర్పాటు చేసి జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి సమగ్ర వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఈ బృందాలకు దిశ, నిర్దేశం చేసేందుకు 12 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించాలని ఎస్పీ సమాయత్తం అవుతున్నారు. ఇందుకోసం వీరికి ప్రత్యేక డ్రస్‌ కోడ్‌తో పాటు, జిల్లాలో తిరగడానికి కావాల్సిన సౌకర్యాలు, వాహన సదుపాయాలు, అందుకోసం బడ్జెట్‌ కేటాయింపులపై ఎస్పీ పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చిన ఎస్పీ ఇటీవల ప్రత్యేక బృందంలోని కొందరు అధికారులకు కార్యాచరణ గురించి వివరించారు.

అవినీతి అధికారుల ఆట కట్టించేందుకే...
గుంటూరు రూరల్‌ జిల్లా పరిధిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి రేషన్‌ మాఫియా, క్రికెట్‌ బెట్టింగ్‌లు, గుట్కా అక్రమ రవాణా, మట్కా వంటి వాటిపై ఎస్పీ వెంకటప్పలనాయుడు ఇప్పటికే ఉక్కుపాదం మోపారు. ఎస్పీ దెబ్బకు క్రికెట్‌ బుకీలంతా జిల్లా వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ బృందాలు అందించిన సమాచారం ఆధారంగా జాతీయ రహదారిపై నిఘా పెంచి  రూరల్‌ పోలీసులు రెండున్నర క్వింటాళ్ల గంజాయిని కారులో తరలిస్తుండగా సినీ ఫక్కీలో వెంబడించి రెండు కార్లతో పాటు, ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రెండు, మూడు బృందాలకే జిల్లాలో సత్ఫలితాలు వస్తున్నాయంటే 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తే అసాంఘిక కార్యకలాపాలను ఏవిధంగా అరికట్టవచ్చో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఎస్పీ అనుకున్న విధంగా జీఎస్‌ఎఫ్‌ బృందాలు ఏర్పాటై కార్యాచరణ మొదలు పెడితే అవినీతి అధికారులకు చెక్‌ పడడం ఖాయం.

జీఎస్‌ఎఫ్‌ ఏర్పాటు విషయం తెలుసుకున్న అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీంతో ఎస్పీని బదిలీ చేయించాలంటూ అధికార పార్టీ నేతల చుట్టూ కొందరు అవినీతి పోలీసు అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement