కాయ్‌ రాజా కాయ్ | Cricket IPL Bettings in Srikakulam | Sakshi
Sakshi News home page

కాయ్‌ రాజా కాయ్

Published Sat, Apr 20 2019 12:58 PM | Last Updated on Sat, Apr 20 2019 12:58 PM

Cricket IPL Bettings in Srikakulam - Sakshi

శ్రీకాకుళం న్యూకాలనీ: ఎచ్చెర్ల మండలానికి చెందిన సీతారాం(పేరు మార్చాం) డిగ్రీ చదువుతున్నాడు. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి వీరాభిమాని. ఇతనికి అదే మండలానికి చెందిన శ్రీనివాస్‌(పేరు మార్చాం)తో పరిచయం ఏర్పడింది. గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నైపై బెంగళూరు గెలుస్తుం దని సీతారాం రూ.50 వేలు బెట్టింగ్‌ కాశాడు. అప్పటికే అప్పుల్లో ఉండటంతో ఈ మ్యాచ్‌ గెలిస్తే బాకీ తీర్చేయవచ్చని భావించాడు. అయితే అనూహ్యంగా బెంగళూరు ఓటమితో ఈయన ఆశలు గల్లంతయ్యాయి. ఆ అప్పులు తీర్చేందుకు కంపె నీలో ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి కూలీ పని చేసుకుంటూ వడ్డీలు కడుతున్నాడు.

జిల్లాలో ఇలాంటి యువకులు ఎందరో..
జూదం.. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది మూడు ముక్కలాట, పేకాట లాంటివి. ప్రస్తుతం వీటికన్నా ప్రమాదకరమైన జూదం క్రికెట్‌ బెట్టింగ్‌ తయారైంది. ఇన్నాళ్లు నగరానికే పరిమితమైన ఈ భూతం ఇప్పుడు పల్లెకు సైతం పాకింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కొంతమంది చేతుల్లో నడుస్తున్న వికృత పోకడ ఇది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో బెట్టింగ్‌ ఫీవర్‌ ఈ స్థాయిలో ఉంటే, రానున్న ప్రపంచకప్‌కు ఏ స్థాయిలో ఉంటుందో ఊహిస్తేనే భయపడాల్సిన పరిస్థితి దాపురించింది.

యువత, విద్యార్థులు బలి..
గతంలో ఒకేచోట కూర్చుని బెట్టింగులు చేస్తుంటే పోలీసులు నిఘాపెట్టి పట్టుకునేవారు. దీంతో బెట్టింగుబాబులు రూటు మార్చారు. బెట్‌ 385, సీబీ, క్రిక్‌బజ్, క్రికెట్‌ మజా అనే ఆన్‌లైన్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసి.. టీవీలో ఒక బంతి కంటే ముందే వచ్చే సమాచారాన్ని చూస్తూ.. ఫోన్‌ల ద్వారానే బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ బుకీ ఏజెంట్లు.. బెట్టింగ్‌ రాయళ్లతో పందాలు కాయిస్తున్నారు. రాత్రికి రాత్రే డబ్బు సంపాదించాలనే అత్యాసతో వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, స్థితిమంతులు, ఆటోడ్రైవర్లు బెట్టింగు ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ వ్యవహారంలో చివరకు బుకీ మాత్రం పెద్దమొత్తంలో జేబులు నింపుకుంటుండగా.. బెట్టింగురాయుళ్లు మాత్రం బికారులుగా మారిపోతున్నారు.

బంతి బంతికి బెట్టింగే..
సాధారణంగా క్రికెట్‌ మ్యాచ్‌ అంటే 50 ఓవర్లు చొప్పున ఉండేది. రోజంతా ఆటసాగి.. సాయంత్రం ఫలితం వచ్చేది. ఆట చివర్లో ఉత్కంఠ ఉండేది. ఈ నేపథ్యంలో టీ–20, ఐపీఎల్‌ మ్యాచ్‌లు వచ్చాక బంతి బంతికి రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఈ బంతి సిక్స్‌.. ఈ బంతి ఫోర్‌ అంటూ.. బెట్టింగులు కడుతున్నారు. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు బెట్టింగురాయళ్ల చేతుల్లో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి.

తమ ఫేవరేట్‌ జట్లపై బెట్టింగ్‌..
మరికొంతమంది తమ ఫేవరేట్‌ ఐపీఎల్‌ జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా, రాజస్థాన్‌ ఆడే మ్యాచ్‌ల ఫలితంపై బెట్టింగులు కాస్తున్నారు. ఇందుకోసం దొంగతనాలు, దోపిడీలకు వెనుకాడటం లేదు. ఇంట్లో విలువైన వస్తువులను గోప్యంగా తరలిస్తున్నారు. కుటుంబాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి యువతను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఐపీఎల్‌తో ముదిరిన బెట్టింగ్‌..
బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టీ–20 మ్యాచ్‌లతో బెట్టింగ్‌ భూతం మరింత ముదిరింది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల బెట్టింగులతో  భరించలేని టెన్షన్, నరాలు తెగే ఉత్కంఠతో మద్యం, సిగరెట్లకు బానిసలుగా మారుతూ జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతోపాటు ఆమదాలవలస, నరసన్నపేట, ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస, పాలకొండ, సీతంపేట, ఆమదాలవలస, ఎచ్చెర్ల, రణస్థలం, రాజాం తదితర ప్రాంతాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement