
ఐపీఎల్ బెట్టింగ్ ఖాకీల కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారికి గతంలో గన్‌మ్యాన్‌గా ఉన్న ఓ కానిస్టేబుల్ అనంతపురం కేంద్రంగా ఐపీఎల్ బెట్టింగ్ నడిపిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం నగరంలోని బళ్లారి బైపాస్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో యువకులను ఉంచి.. వారి ద్వారా బెట్టింగ్ దందా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. గుంతకల్లు, ధర్మవరంలోనూ ఖాకీల కనుసన్నల్లోనే ఈ బెట్టింగ్ దందా నడుస్తున్నట్లు సమాచారం. అందుకే బెట్టింగ్ దందా ఎవరు నిర్వహిస్తున్నారు? ఎవరి ఆధ్వర్యంలో నడుస్తోంది.. జిల్లా వ్యాప్తంగా ఎంత మంది బెట్టింగ్ రాయుళ్లు ఉన్నారనే సమాచారం ఇంటెలిజెన్స్, ఎస్‌బీ సిబ్బందికి తెలిసినా.. ఖాకీల ప్రమేయం ఉండటంతో మౌనం దాలుస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈట్ క్రికెట్... స్లీప్ క్రికెట్ అంటూ ఊగిపోయే ఇండియాలో ఏడాదికి ఒకసారి వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఎందరో జీవితాలను తారుమారు చేస్తోంది. గల్లీ క్రికెటర్‌ను ఒక్క మ్యాచ్‌తో స్టార్‌గా మార్చేస్తున్న పొట్టి ఫార్మాట్ మ్యాచ్‌లు.. బెట్టింగ్ బారిన పడిన ఎందరో జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కొన్ని సందర్భాల్లో ఒక్క బంతికే బతుకు బస్టాండై పోతోంది. బెట్టింగ్ నడిపిస్తున్న బుకీలకు మాత్రం రూ.కోట్లు కుమ్మరిస్తోంది. 45 రోజుల పాటు జరిగే ఈ ఐపీఎల్–12 సీజన్ మార్చి 23న ప్రారంభం కాగా.. మే 12 వరకు కొనసాగనుంది.
రూ.కోట్లలో బెట్టింగ్
ఐపీఎల్ వచ్చిందంటే చాలు బుకీలకు పండగే. అనంతపురాన్ని కేంద్రంగా చేసుకుని జిల్లా వ్యాప్తంగా సబ్ బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి బెట్టింగ్ నడిపిస్తున్నారు. మన జిల్లాలో ఒక్క సీజన్‌కే రూ.100 కోట్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా యువతే బెట్టింగ్ మాయాజాలంలో చిక్కి అప్పుల పాలవుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ ప్రారంభమై 25 రోజులు పూర్తి కాగా బెట్టింగ్ కూడా భారీగా సాగినట్లు తెలుస్తోంది. ఏటా ఐపీఎల్ బెట్టింగ్‌పై నిఘా ఉంచే పోలీసులు...ఈ సారి ఎన్నికల విధుల్లో బిజీగా ఉండగా...బెట్టింగ్ రాయుళ్లు బహిరంగంగానే రెచ్చిపోతున్నారు. ఒక్కో మ్యాచ్‌కు జిల్లాలో రూ. 5 కోట్లకు పైగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో ఇండియన్ ్రíపీమియర్ లీగ్(ఐపీఎల్) కాస్తా బెట్టింగ్ లీగ్‌గా మారుతోంది.
ప్రతి బంతీ కీలకమే
ఫ్యాన్సీ పేరుతో జరిగే పందేలలో మ్యాచ్ ఎవరు గెలుస్తారని ఒకరు పందెం కాస్తే, మరొకరు ఈ ఓవర్లో ఇన్ని పరుగుల కొడతారని బెట్టింగ్ వేస్తున్నారు. అలాగే ఈ బాల్‌కు వికెట్ పడుతుందని, ఈ ఓవర్‌లో సిక్సర్ కొడతారని, 20 ఓవర్లకు ఇన్ని పరుగులు వస్తాయని పందెలు కాస్తున్నారు. మ్యాచ్ మొదలయ్యే ముందు నుంచి ఈ బెట్టింగ్ తంతు కొనసాగుతుంది. ప్రధానంగా టాస్ ఏ జట్టు గెలుస్తుంది అన్న దానిపై మొదలయ్యే బెట్టింగ్ జట్టు విజయంలో చివరి బంతి వరకు కూడా కొనసాగుతుంది. అత్యుత్తమ జట్టుకు అత్యధిక రేటింగ్ పలుకుతూ పెద్ద ఎత్తున బెట్టింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకూ ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై, ముంబయి, బెంగళూరు జట్ల మ్యాచ్‌లపై ఎక్కువగా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయా జట్లు ప్రాతినిథ్యం వహించే మ్యాచుల్లో అధిక సంఖ్యలో బూకీలు వాటి రేటింగ్‌ను పెద్ద ఎత్తున పెంచేస్తున్నారు. ఆయా జట్లు ఆడుతున్న సమయంలో ఒకటికి రెండు, మూడింతలు అధికంగా అందించి బెట్టింగ్‌లో యువతను దాసోహం చేస్తున్నారు.
ఆత్మహత్యలే శరణ్యం
క్రికెట్ బెట్టింగ్ వ్యసనంలో పడిన అనేక మంది తీవ్రంగా నష్టపోయారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారంతా ఎక్కువగా జిల్లాకేంద్రంలోని కళాశాలల్లో విద్యనభ్యసిస్తుండగా...వారికి బెట్టింగ్ అలవాటు చేసేందుకు ఆయా కళాశాలల్లోని విద్యార్థుల ద్వారానే బెట్టింగ్ దందా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది విద్యార్థులు డబ్బుపై ఆశతో బెట్టింగ్ ఉచ్చు పడి.. అప్పుల పాలై...అవి తీర్చే మార్గం లేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్‌లో నష్టపోయి బలవన్మరణాలకు పాల్పడిన వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. మరోవైపు అప్పుల వాళ్లకు భయపడి ఇళ్లు వదిలి వెళ్లిన యువకులు కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల విధుల్లో బిజీగా పోలీసులు
ఎన్నికల విధుల్లో పోలీసులు బిజీబిజీగా ఉండటంతో గత నెల ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ క్రికెట్ పోటీలు బూకీల పాలిట కల్పతరువుగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో వీటిపై పోలీసులు దృష్టి సారించకపోవడం...మరికొందరు ఖాకీలూ బెట్టింగ్‌కు సహకరించడంతో బూకీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే సీజన్ మొదలై 25 రోజుల గడుస్తున్నా.. నేటికీ ఒక్కకేసు నమోదు కావడం లేదు.
నగరంలో సోమనాథ్‌నగర్‌కు చెందిన షేక్ గౌస్‌పీర్ (27) తపోవనం సమీపంలో వాటర్ సర్వీసింగ్ సెంటర్ నడిపేవాడు. క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడిన గౌస్‌పీర్ రూ.లక్షల్లో పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు కొంత మేర చెల్లించినా..ఇంకా భారీమొత్తం బాకీ పడ్డాడు. ఓవైపు రుణదాతలు...మరోవైపు బుకీల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో 2018 మే 5న ఇంట్లోనే ఉరివేసుకుని ఊపిరితీసుకున్నాడు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి.
ముంబయి కేంద్రంగా...
ఐపీఎల్ బెట్టింగ్ ముంబయి కేంద్రంగా నడుస్తున్నట్లు గతంలో తేలింది. వీటికి సబ్ బ్రాంచ్ బెంగళూరులో ఉండగా కీలకమైన వ్యక్తులు వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు ఉన్నారు. ఈ ముఠా సభ్యులు అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, కదిరి, గుత్తిలలో క్రికెట్ బెట్టింగ్‌లకు అడ్డాగా మార్చుకున్నారు. బెట్టింగ్ రాయుళ్లు బుకీల వద్ద డిపాజిట్‌లు పెట్టి మొబైల్ ఫోన్ల ద్వారా పందేలు ఆడుతున్నారు. మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు, యువకులు, రోజు కూలీలు బెట్టింగ్‌ల బారిన పడి డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలవుతున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఈ బెట్టింగ్ మాఫియాను నిర్వహిస్తూ... ప్రతి మ్యాచ్ ద్వారా రూ.లక్షల ఆదాయం గడిస్తున్నారు. తాడిపత్రిలో కొన్ని రోజుల క్రితం బుకీలను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment