నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న జిల్లా క్రైమ్స్ అదనపు ఎస్పీ శ్రీధరరావు
ఒంగోలు(ప్రకాశం జిల్లా): బెట్టింగ్ భూతం ఓ యువకుడ్ని నిండా ముంచింది. అత్యాశకు పోయి ఉన్న సొత్తును కోల్పోవడంతో పాటు చివరకు నేరాల బాట పట్టి కటకటాల పాలైన ఉదంతాన్ని జిల్లా అదనపు ఎస్పీ(క్రైమ్స్) వి.శ్రీధరరావు స్థానిక తాలూకా పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో మీడియాకు వివరించారు. జిల్లా ఎస్పీ మలికాగర్గ్ క్రైమ్స్ అదనపు ఎస్పీగా ప్రత్యేకంగా ఒక పోస్టును కేటాయించడంతోపాటు చాలెంజింగ్‌గా మారిన పలు కేసులను అప్పగించారు. ఈ నేపథ్యంలో వాటిపై ప్రత్యేక నిఘా కొనసాగించగా గత నెలలో జరిగిన చోరీ కేసుతో ఓ నిందితుడి బండారం బయటపడింది.
చదవండి: ఆ రోజు టీడీపీ నాయకులు అడ్డురాకుంటే.. యువతి బతికేది కదా!
ఆ కేసుతోపాటు గతంలో అదే తరహాలో చోటుచేసుకున్న కేసులను సరిపోల్చగా ఒంగోలు పట్టణ పరిధిలోనే 11 కేసుల్లో నిందితునిగా వెల్లడైంది. దీంతో పోలీసులు నిఘా పెట్టి గురువారం నిందితుడు రాయవరపు శ్రీనివాసరావును స్థానిక కర్నూలు రోడ్డులోని పవర్ ఆఫీసు సమీపంలో అరెస్టు చేశారు. అతనిని విచారించగా 2021 మార్చి నుంచి 2022 జూన్ వరకు మొత్తం 11 చోరీ కేసుల్లో అతని పాత్ర రూఢీ అయింది. ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో 2, ఒంగోలు వన్‌టౌన్ పరిధిలో 9 వెరసి మొత్తం 11 దొంగతనం కేసులకుగాను 5 సెల్‌ఫోన్లు, ఒక ట్యాబ్, ఒక మంగళసూత్రం, ఒక బంగారపు కాసు, రూ.500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు వెల్లడించిన విషయాలు పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి.
కొంపముంచిన అత్యాశ
పామూరు మండలం పుట్టనాయుడుపల్లికి చెందిన రాయవరపు శ్రీనివాసరావు ఇంటర్ వరకు విద్యనభ్యసించాడు. ఇతని సోదరి అనకాపల్లిలో, తల్లిదండ్రులు పూణేలో ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్దకు అంటూ పూణే వెళ్లిన సమయంలో అతనికి బెట్టింగ్ భూతం ఆవహించింది. ఆన్‌లైన్‌లో వన్ ఎక్స్‌బెట్, బెట్ వే, వూల్ఫ్ 777, 22 బెట్, ఐపీఎల్ విన్ అనే యాప్‌లలో బెట్టింగ్ ఆడి చేతిలో ఉన్న సొత్తును పోగొట్టుకున్నాడు. చివరకు తల్లి ద్వారా తెలిసిన వారి వద్ద కొంత అప్పు తీసుకుని ఆ మొత్తం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న చోటే సొమ్ము తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఉన్న ఇంటిని సైతం రూ.20 లక్షలకు విక్రయించాడు.
ఆ డబ్బును సైతం బెట్టింగ్‌లో అర్పించాడు. అనకాపల్లిలో ఉంటున్న అక్క వద్దకు వెళ్లి వారి లారీలను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.20 లక్షలను కూడా బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. ఒక వైపు సొంత ఇల్లు కోల్పోయి, తోబుట్టువుకు చెందిన సొమ్మును సైతం బెట్టింగ్‌లో సమర్పించుకుని, తల్లిదండ్రులకు ఇబ్బందులు తెచ్చి పెట్టి చివరకు నేరాల బాట పట్టాడు. ఒంగోలు లాడ్జిలో మకాం వేసి రాత్రిపూట షాపులను ఎంచుకుని చోరీలు చేయడం మొదలెట్టాడు.
దాదాపు 16 నెలలపాటు చోరీలు కొనసాగించాడు. ఈ క్రమంలోనే పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలయ్యాడు. చోరీ చేసిన సొత్తును సైతం బెట్టింగ్‌లోనే పోగొట్టినట్లు నిర్ధారించుకున్నామని క్రైమ్స్ అదనపు ఎస్పీ వి.శ్రీధరరావు వివరించారు. కేసులను ఛేదించేందుకు కృషి చేసిన క్రైమ్స్ అదనపు ఎస్పీతోపాటు డీఎస్పీ నాగరాజు, తాలూకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు ఎం.దేవకుమార్, ఎం.సైదుబాబు, సిబ్బందిని ఎస్పీ మలికాగర్గ్ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment