జోరుగా ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ | IPL Cricket bettings in East Godavari | Sakshi
Sakshi News home page

జోరుగా ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌

Published Fri, Apr 26 2019 12:26 PM | Last Updated on Fri, Apr 26 2019 12:26 PM

IPL Cricket bettings in East Godavari - Sakshi

సాయంత్రం ఆరు గంటలైంది... చింతూరు మెయిన్‌రోడ్‌ సెంటర్‌లోని ఓ దుకాణం వద్ద పదుల సంఖ్యలో యువత గుంపులుగా ఫోన్‌లలో మాట్లాడుకుంటూ ఇన్ని వేలు, అన్ని వేలు అంటూ బిజీ బిజీగా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన అటుగా వెళ్లేవారు యువకులు కదా.. ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటున్నారని అనుకుంటూ వెళ్లిపోతున్నారు. అయితే ఆ ఫోన్ల సంభాషణ.. ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ కోసమని తెలిసేది అతి కొద్ది మందికే.

తూర్పుగోదావరి, చింతూరు (రంపచోడవరం): చింతూరు ప్రధాన కేంద్రంగా ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. చింతూరు మెయిన్‌రోడ్డులోని ఓ దుకాణం వద్ద ఈ దందా సాగుతున్నట్టు సమాచారం. రూ.5 వేల నుంచి రూ.10 వేలు.. ఆపైన బెట్టింగ్‌లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఫోన్లు, ఆన్‌లైన్‌ ద్వారా రూ.లక్షల్లో బెట్టింగ్‌లు నడుస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. బెట్టింగ్‌ కోసం యువకులందరూ కలసి ఓ మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని.. బెట్టింగ్‌ వేసిన సొమ్ములో అతనికి 10 శాతం కమీషన్‌గా ముట్టచెబుతున్నట్లు తెలిసింది. ఈ బెట్టింగ్‌లో ప్రధానంగా చింతూరుకు చెందిన యువకులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇతర మండలాలతో పాటు పొరుగునే వున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువత కూడా ఇక్కడికి వచ్చి బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. 

బెట్టింగ్‌ జరుగుతోందిలా...
బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠా ఆ రోజు నిర్వహించే ఐపీఎల్‌ మ్యాచ్‌కు సంబంధించిన సమాచారాన్ని యువతకు ముందుగానే చేరవేస్తున్నారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్న యువత ముందుగా పోటీలో ఉన్న జట్ల బలాబలాలను బేరీజువేసుకుని బెట్టింగ్‌కు దిగుతున్నారు. టాస్‌ ఎవరు  గెలుస్తారు, టాస్‌ గెలిస్తే ముందుగా బ్యాటింగా? బౌలింగా? పవర్‌ ప్లే ఆరు ఓవర్లలో ఎంత స్కోరు చేస్తారు? 20 ఓవర్లలో ఎంత స్కోరు చేస్తారు? ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు? అనే అంశాలపై బెట్టింగ్‌ జరుగుతున్నట్టు తెలిసింది. వీటితో పాటు ఆయా జట్లలోని ప్రధాన బ్యాట్స్‌మెన్ల వ్యక్తిగతంగా ఎంత స్కోరు చేస్తారనే దానిపై కూడా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. 

పెడదోవ పడుతున్న యువత
బెట్టింగ్‌ల పేరుతో పెద్ద సంఖ్యలో యువకులు సొమ్ములు పోగొట్టుకుంటున్నారు. తిరిగి బెట్టింగ్‌ కాసేందుకు సొమ్ము కోసం పెడదోవ పడుతున్నారు. తల్లిదండ్రులు పాకెట్‌ మనీ కోసం ఇచ్చిన సొమ్మును బెట్టింగ్‌లో పోగొట్టుకుంటున్నారు. తిరిగి సొమ్ముల కోసం సొంత ఇళ్లతో పాటు వేరే ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. బెట్టింగుల్లో సొమ్ములు పోగొట్టుకుంటున్న యువతకు బెట్టింగ్‌ ముఠా అధిక వడ్డీలకు సొమ్మును అప్పుగా ఇచ్చి తిరిగి ఆ సొమ్మును బలవంతంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి ఒత్తిడిని తట్టుకోలేని యువత అఘాయిత్యాలకు పాల్పడే అవకాశముందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ బెట్టింగ్‌ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించి బెట్టింగ్‌ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement