సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఘరానా క్రికెట్ బుకీల్లో ఒకరైన సికిందర్‌ను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లకు సంబంధించి అబిడ్స్‌లోని చిరాగ్ అలీ లైన్‌లో బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ఇతడితో పాటు కలెక్షన్ బాయ్ హరినీ అరెస్టు చేసినట్లు అదనపు డీసీపీ చైతన్యకుమార్ మంగళవారం తెలిపారు. గుజరాత్‌కు చెందిన సికిందర్ నిజా అలీ చరానియా 20 ఏళ్ల క్రితం బతుకుతెరువు కోసం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చాడు. బేకరీ, నోవల్టీస్, చాక్లెట్స్... ఇలా ఎన్నో వ్యాపారాలు చేసినా నష్టాలే మిగిలాయి. తేలిగ్గా, తక్కువ కాలంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో క్రికెట్ బుకీగా మారాడు. తొలినాళ్లల్లో సింధికాలనీకి చెందిన బర్ఖాంత్‌తో కలిసి పందాలు అంగీకరించాడు. 2013 నుంచి తానే సొంతంగా దందా నిర్వహిస్తూ 2014లో అబిడ్స్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ల్యాప్‌టాప్‌లో బెట్టింగ్స్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా మ్యాట్రిక్స్ సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసుకున్నాడు.
బెట్ ఫెయిర్ వెబ్‌సైట్ ద్వారా రేష్యో, క్రిక్‌బుక్ ద్వారా మ్యాచ్ అప్‌డేట్స్ తెలుసుకునేవాడు. పందాలు కాసే పంటర్లతో సంప్రదింపులు జరపడానికి ఏడు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సిమ్‌కార్డులు తీసుకున్నాడు. అబిడ్స్‌కు చెందిన హరి ప్రసాద్‌ను కలెక్షన్ బాయ్‌గా ఏర్పాటు చేసుకున్నాడు. పంటర్లలో ఓడిన వారి నుంచి డబ్బు వసూలు చేయడం, గెలిచిన వారికి ఇచ్చిరావడం ఇతడి పని. ఐపీఎల్ మ్యాచ్‌ల సీజన్‌లో నగరంలో పోలీసుల నిఘా పెరగడంతో గోవాలోని కలింగూడ్‌కు మకాం మార్చాడు. అక్కడ నుంచే నగరంలో ఉన్న పరిచయస్తులు, పరిచయం లేని పంటర్ల నుంచి ఫోన్ ద్వారా పందాలు అంగీకరించాడు. ఐపీఎల్ సీజన్ ముసిగిన తర్వాత సిటీకి వచ్చిన అతను ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న మూడో టీ–20 మ్యాచ్‌ల నేపథ్యంలో మళ్లీ పందాలు అంగీకరించడం మొదలెట్టాడు. ఆదివారం కార్డిఫ్‌లో జరిగిన మ్యాచ్‌కు సంబంధించి భారీగా పందాలు నిర్వహించాడు. దీనిపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్ ప్రసాద్‌వర్మ, ఎన్.శ్రీశైలం, జి.వెంకటరామిరెడ్డి, మహ్మద్ తర్ఖుద్దీన్‌లు దాడి చేసి అలీతో పాటు హరినీ అరెస్టు చేశారు. ఇతడి నుంచి రూ.5.28 లక్షల నగదు, ల్యాప్‌టాప్, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment