
నిందితుల వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ మురళీకృష్ణ
నెల్లూరు(క్రైమ్): క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను నెల్లూరులోని పప్పులవీధిలో నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి బుకీల వివరాలను వెల్లడించారు. పప్పులవీధిలో నివాసం ఉంటున్న వెంకట రమేష్ అలియాస్ డీటీఎస్, సంతపేట ఈద్గామిట్టకు చెందిన షేక్ ఖాదర్‌నవాజ్‌లు క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గతంలో పలుమార్లు వీరు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఇద్దరూ మరికొందరితో కలిసి ఐపీఎల్ ప్రారంభం నుంచి బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. వీరి కదలికలపై నిఘా ఉంచిన నవాబుపేట ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్సై వీరప్రతాప్, సిబ్బంది ఈనెల 6వ తేదీ రాత్రి నిందితులు ఓ కల్యాణ మండపం సమీపంలో బెట్టింగ్‌లు నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించి బుకీలకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టారు. గతంలో క్రికెట్ బెట్టింగ్‌లో కీలక సూత్రధారిగా వ్యవహరించిన వ్యక్తి బావమరిది ప్రస్తుతం బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనితోపాటు మరో 13 మంది బెట్టింగ్ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. దీంతో ప్రస్తుతం చిక్కిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు, సెల్‌ఫోనును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు నగర డీఎస్పీ వెల్లడించారు. బెట్టింగ్‌కు పాల్పడే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఫంటర్లపై సైతం కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో నవాబుపేట ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, ఎస్సై వీరపత్రాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment